► అక్షయ గోల్డ్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశం
► ఇకపై ప్రతి విచారణకు హాజరు కావాలని సంస్థ ఎండీకి స్పష్టీకరణ
► తదుపరి విచారణ 24కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: అక్షయ గోల్డ్ వ్యవహారంలో ఇప్పటివరకు సాగిన దర్యాప్తునకు సంబంధించిన పురోగతితో నివేదిక సమర్పించాలని హైకోర్టు శుక్రవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేగాక అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. ఇకపై ప్రతి విచారణకు స్వయంగా హాజరు కావాలని అక్షయ గోల్డ్ మేనేజింగ్ డెరైక్టర్‌ను ఆదేశించింది. ఇప్పటివరకు ఎంతమంది బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు అక్షయ గోల్డ్‌లో ఉన్నారు.. ఏ ఏ సంవత్సరాల్లో వారు ప్రాతినిథ్యం వహించారు.. అసలు ఈ మొత్తం వ్యవహారంలో నిందితులెవరు.. డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో వారి పాత్ర ఏమిటి?.. తదితర వివరాలను తేల్చాలని, ఇందుకు అవసరమైతే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)ను ఆశ్రయించాలని ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది.
తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి దాదాపు 600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి వాటిని తిరిగి చెల్లించకుండా అక్షయగోల్డ్ యాజమాన్యం ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్, అక్షయగోల్డ్ తరఫు న్యాయవాది ధనుంజయ వాదనలు వినిపించారు.
పురోగతి నివేదిక సమర్పించండి
Published Sat, Mar 12 2016 3:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement