Akshaya Gold
-
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం. -
జగన్‌ను కలిసిన అక్షయ గోల్డ్ బాధితులు
సాక్షి, కర్నూలు : తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ అక్షయ గోల్డ్ బాధితులు గురువారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. పత్తికొండ నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను ఈరోజు ఉదయం నర్సాపురం క్రాస్‌రోడ్ సమీపంలో అక్షయ గోల్డ్ బాధితులు కలిసి, తమ ఆవేదన తెలిపారు. రూపాయి రూపాయి కూడబెట్టి అక్షయ గోల్డ్‌లో పొదుపు చేసుకుంటే మోసం చేశారని వాపోయారు. ఈ సందర్భంగా సురేష్ బాబు అనే ఏజెంట్...జగన్ ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించాడు. బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. యాజమాన్యం ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని, న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ‘అక్షయ గోల్డ్ యాజమాన్యం సుమారు రూ.600 కోట్లు బకాయి పడింది. ఇప్పటికే 100మంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అగ్రి గోల్డ్, అక్షయ గోల్డ్ లాంటి మోసాలపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాను. అయినా ప్రభుత్వం బాధితులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఏడాది పాటు ఓపిక పట్టండి. బాధితులందరికీ న్యాయం చేస్తా.’ అని హామీ ఇచ్చారు. -
ఈ–పోర్టల్ ద్వారా అగ్రి, అక్షయగోల్డ్ ఆస్తుల వేలం
- ప్రాథమిక నిర్ణయం తీసుకున్న హైకోర్టు - నేడు వెలువడనున్న పూర్తిస్థాయి ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: సీఐడీ తమ ముందుంచిన అగ్రిగోల్డ్ 12 ఆస్తులను, అక్షయగోల్డ్ 5 ఆస్తులను ప్రభుత్వ ఈ పోర్టల్ ద్వారా వేలం వేసేందుకు ఉమ్మడి హైకోర్టు ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో శుక్రవారం పూర్తిస్థాయిలో ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ డిపాజిటర్లు హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిపై మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. ప్రభుత్వ ఈ పోర్టల్ ద్వారానే 17 ఆస్తుల వేలం జరుగుతుందని స్పష్టం చేసింది. వేలం విధివిధానాలను, ప్రచారం తదితర విషయాలపై శుక్రవారం ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొంది. -
మెరుగైన ఫలితాల కోసం సూచనలు
అగ్రి, అక్షయగోల్డ్ కేసుల్లో న్యాయవాదులను కోరిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్‌లఆస్తుల వేలానికి సంబంధించి మెరుగైన ఫలితాల కోసం సూచనలు, సలహాలు తెలియచేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం పిటిషనర్లను, అగ్రి, అక్షయ గోల్డ్ యాజమాన్యాలను కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో 32 లక్షల మంది డిపాజిటర్లను సంతృప్తిపరి చేలా చర్యలు తీసుకోవడం అసాధ్యంలా కనిపిస్తోందని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ యాజమా న్యాలు డిపాజిట్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి, తిరిగి చెల్లించ కుండా ఎగవేశాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పలువురు హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలు ఇవ్వండి
-
అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలు ఇవ్వండి
ఏపీ సీఐడీ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసును ఓ కొలిక్కి తెచ్చిన ఉమ్మడి హైకోర్టు ఇప్పుడు అక్షయగోల్డ్‌పై దృష్టి సారించింది. దానికి చెందిన ఆస్తుల వివరాలను తమ ముందుంచాలని సోమవారం ఏపీ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తనఖాలో ఉన్నవి, తనఖా లేకుండా తక్షణ విక్రయానికి వీలుగా ఉన్న ఆస్తులు.. తదితర వివరాలను సమర్పించాలంది. వాటి ఆధారంగా అగ్రిగోల్డ్ కేసు తరహాలో అక్షయగోల్డ్ ఆస్తులను వేలం వేసే ప్రణాళికలు రూపొందిస్తామంది. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వారుుదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
అక్షయ గోల్డ్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు
అక్షయ గోల్డ్ ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమెటెడ్ సంస్థపై శుక్రవారం విజయవాడ సీఐడీ పోలీసులు ఒంగోలు జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సీఐడీ ఏఎస్పీ మేరి ప్రశాంతి ఒంగోలుకు చేరుకొని జిల్లా కోర్టులో చార్జ్ షీట్ వేశారు. మొత్తం రూ.330 కోట్లు ప్రజాధనాన్ని సంస్థ యాజమాన్యం అక్రమంగా కాజేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు అన్ని పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని జిల్లా కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 2,200 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. సంస్థకు చెందిన 2,500 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన సమయంలో బ్యాంకుల్లో నిల్వ ఉన్న రూ.10 కోట్లు లావాదేవీలు జరగకుండా స్తంభింపజేశారు. ఈ కేసులో సంస్థతో పాటు, సంస్థకు చెందిన 37 మందిపై కేసు నమోదు చేశారు. 2012 సంవత్సరంలో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి అక్షయ గోల్డ్ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. అప్పట్లో దక్షణ బైపాస్‌లో ఉన్న పాత జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న కల్యాణమండపంలో సంస్థ సీఎండీ, డెరైక్టర్లు, ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారని సమాచారం తెలుసుకొని అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అక్షయ గోల్డ్ సీఎండీ భోగి సుబ్రహ్మణ్యంతో పాటు డెరైక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యంతో పాటు నూతన సీఎండీ పాల్సన్, వ్యవస్థాపక డెరైక్టర్లు మునగపాటి సుధాకర్, దేవకి హరనాథ్‌బాబు, ఆత్మకూరి రమేష్ బాబుతో పాటు మరో 18 మంది డెరైక్టర్లపై కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు సీఐడీ పోలీసులకు అప్పగించారు. సంస్థతో పాటు మొత్తం 37 మందిపై కేసు నమోదు చేశారు. పాత, కొత్త సీఎండీలతో పాటు 21 మంది డెరైక్టర్లు, సంస్థలో కీలక పదవుల్లో ఉన్న మరో 14 మందిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా గొలుసుకట్టు వ్యాపారం ద్వారా ప్రజల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారు. -
'అక్షయ' కేసులో సీఐడీ ఛార్జ్‌షీట్
ఒంగోలు : అక్షయ గోల్డు కేసులో సీఐడీ అధికారులు ఒంగోలు కోర్టులో శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 330 కోట్ల మేర మోసం జరిగిన ఈ కేసులో 38 మంది నిందితులను చేర్చుతూ 2200 పేజీల ఛార్జ్‌షీట్‌ను సీఐడీ ఏఎస్పీ మేరీ ప్రశాంత్ నేతృత్వంలోని బృందం కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటి వరకు 2500 ఎకరాల భూమిని సీజ్ చేసింది. దాదాపు 10 కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్‌ను కూడ నిలిపివేసింది. 2012 నుంచి ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. -
అపరాధులుగా ఎందుకు ప్రకటించడం లేదు?
అక్షయగోల్డ్ పూర్వ యాజమాన్యంపై సీఐడీకి హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: అక్షయ గోల్డ్ పూర్వ చైర్మన్, ఇతర డెరైక్టర్ల ఆచూకీ లభించనప్పుడు వారిని ప్రకటిత అపరాధులుగా(ప్రొక్లెయిమ్డ్ అఫెండర్స్) ఎందుకు ప్రకటించడం లేదని హైకోర్టు గురువారం ఏపీ సీఐడీ అధికారులను ప్రశ్నించింది. వారిని ప్రకటిత అపరాధులుగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు స్పష్టం చేసింది. అలా ప్రకటిస్తే వారి వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయవచ్చునని తెలిపింది. అలాగే అక్షయ గోల్డ్ వ్యవహారంలో ఇప్పటి వరకు ఏం చేశారు.. తదుపరి ఏం చేయబోతున్నారో వివరిస్తూ పూర్తి వివరాలతో ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి అక్షయగోల్డ్ యాజమాన్యం రూ.600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని అక్షయగోల్డ్ వినియోగదారుల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తెలుగు రామమద్దయ్య, మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. అక్షయగోల్డ్ ఆస్తుల స్వాధీనానికి ఒంగోలు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మరి అక్షయగోల్డ్ పూర్వ యాజమాన్యం సంగతేమిటని సీఐడీని ప్రశ్నించింది. వారి ఆచూకీ తెలియడం లేదని, పరారీలో ఉన్నట్లున్నారని సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ తెలిపారు. పరారీలో ఉంటే వారిని ప్రకటిత అపరాధులుగా ఎందుకు ప్రకటించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సమయంలో శ్రవణ్ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం వద్ద అక్షయగోల్డ్‌కు చెందిన రూ.10 కోట్లు ఉన్నాయని, వాటిని హైకోర్టు ఖాతాకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. డబ్బున్నది ప్రభుత్వం వద్దే కదా.. దానికి మీరేమీ ఆందోళన చెందాల్సిన పని లేదంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
పురోగతి నివేదిక సమర్పించండి
► అక్షయ గోల్డ్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశం ► ఇకపై ప్రతి విచారణకు హాజరు కావాలని సంస్థ ఎండీకి స్పష్టీకరణ ► తదుపరి విచారణ 24కు వాయిదా సాక్షి, హైదరాబాద్: అక్షయ గోల్డ్ వ్యవహారంలో ఇప్పటివరకు సాగిన దర్యాప్తునకు సంబంధించిన పురోగతితో నివేదిక సమర్పించాలని హైకోర్టు శుక్రవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేగాక అక్షయగోల్డ్ ఆస్తుల వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. ఇకపై ప్రతి విచారణకు స్వయంగా హాజరు కావాలని అక్షయ గోల్డ్ మేనేజింగ్ డెరైక్టర్‌ను ఆదేశించింది. ఇప్పటివరకు ఎంతమంది బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు అక్షయ గోల్డ్‌లో ఉన్నారు.. ఏ ఏ సంవత్సరాల్లో వారు ప్రాతినిథ్యం వహించారు.. అసలు ఈ మొత్తం వ్యవహారంలో నిందితులెవరు.. డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో వారి పాత్ర ఏమిటి?.. తదితర వివరాలను తేల్చాలని, ఇందుకు అవసరమైతే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)ను ఆశ్రయించాలని ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి దాదాపు 600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి వాటిని తిరిగి చెల్లించకుండా అక్షయగోల్డ్ యాజమాన్యం ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్, అక్షయగోల్డ్ తరఫు న్యాయవాది ధనుంజయ వాదనలు వినిపించారు. -
హైకోర్టులో 'అక్షయగోల్డ్' కేసు విచారణ
హైదరాబాద్ : లక్షలాదిమంది డిపాజిటర్ల డబ్బును గోల్మాల్ చేసిన అక్షయ గోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం విదితమే. విచారణ సందర్భంగా గురువారం.. ప్రతి వాయిదాకు యాజమాన్యం తప్పక హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆస్తుల డాక్యుమెంట్లను ఎందుకు ఇవ్వలేదంటూ కోర్టు ప్రశ్నించింది. అక్షయ గోల్ట్ పై చర్యలు తీసుకోవాలని సీఐడీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. -
ఎగవేతదారులను అరెస్టు చేయండి
♦ అప్పుడే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయి ♦ అక్షయ గోల్డ్ కేసులో తెలంగాణ సీఐడీకి హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేతదారులను అరెస్ట్ చేసే విషయంలో చర్యలెందుకు చేపట్టలేదని హైకోర్టు తెలంగాణ సీఐడీ అధికారులను ప్రశ్నించింది. అక్షయ గోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరంటూ సీఐడీని ఉద్దేశించి వ్యా ఖ్యానించింది. అరెస్ట్ చేస్తే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని, అగ్రిగోల్డ్ కేసులోనూ ఇదే జరిగిందని గుర్తు చేసింది. అక్షయగోల్డ్తో సంబంధం ఉన్న వారెవరైనా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, దానిని వ్యతిరేకించడంతో పాటు, ఈ మొత్తం వ్యవహారాన్ని తాము పర్యవేక్షిస్తున్న విషయాన్ని సంబంధిత న్యాయస్థానాల దృష్టికి తీసుకురావాలని ఏపీ, తెలంగాణ సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ తమ ముందుంచాలని ఇరు రాష్ట్రాల సీఐడీ అధికారులకు సూచించింది. డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ ఓ కార్యాచరణ ప్రణాళికను తమ ముందుంచాలని అక్షయగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. చర్యలెందుకు తీసుకోలేదు? తమ నుంచి అక్షయగోల్డ్ యాజమాన్యం రూ.600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయ గోల్డ్ వినియోగదారుల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తెలుగు రామ మద్దయ్య, మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అక్షయగోల్డ్ వ్యవహారంలో వ్యవహారంలో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. దీనికి ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానమిస్తూ... 19 కేసుల్లో 28 మంది నిందితులున్నారని, ఇందులో 10మందిని అరెస్ట్ చేయగా, వారు బెయిల్ పొందారని, మిగిలినవారు ముందస్తు బెయిల్ పొందారని, ఇదంతా 2012లోనే జరిగిందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయస్థానాలు బెయిళ్లు ఇస్తుం టే ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించింది. బెయిళ్ల రద్దు కోసం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. సదరు బెయిల్ మంజూరు ఉత్తర్వులను తమ ముందుంచాలంది. సహకరిస్తే కఠిన చర్యలు మోసం చేయడం ఎలాగో అగ్రిగోల్డ్‌లో నేర్చుకున్న తరువాత దాని నుంచి బయటకు వచ్చి అక్షయగోల్డ్ పెట్టినట్లు ఉన్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్షయగోల్డ్ యజమాన్యా న్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయలేదు కాబట్టి, ఆ పని మీరెందుకు చేయరని తెలంగాణ సీఐడీ అధికారులను ప్రశ్నించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ స్పందిస్తూ... తెలంగాణలోనూ అక్షయగోల్డ్‌పై 8కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకోకుంటే దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. అక్షయగోల్డ్ యాజమాన్యానికి ఎవరైనా సహకరిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
అక్షయ గోల్డ్ ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
నెల్లూరు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ప్రజలను మోసగించిన అక్షయ గోల్డ్ ఆస్తుల జప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న అక్షయ గోల్డ్ సంస్థ ఆస్తులను జప్తు చేయడానికి ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అక్షయ్‌గోల్డ్ సంస్థ గొలుసుకట్టు వ్యాపారంతో సుమారుగా కోట్ల రూపాయలను వసూలు చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన అక్షయ్ గోల్డ్ సంస్థ ప్రజలను బురిడీ కొట్టించింది. తాము అనేక రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, తమ దగ్గర పెట్టుబడులు పెడితే భారీ లాభాలను అందిస్తామని ప్రజలను మభ్యపెట్టారు. వారి నుంచి దీర్ఘకాలిక ప్రాతిపదికన డిపాజిట్లు సేకరించి భారీ మోసానికి తెరలేపారు. -
అక్షయ గోల్డ్ సభ్యుడి అరెస్ట్
రాయచూరు రూరల్ : అక్షయ గోల్డ్ ఫార్మ్ విల్లాస్ ఇండియా కంపెనీ సభ్యుల్లో ఒకరైన ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన హరినాథబాబును రాయచూరులో శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాయచూరు సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ అక్షయ గోల్డ్ ఫార్మ్ విల్లాస్ ఇండియా కంపెనీ ఏజెంట్లను నియమించుకుని పిగ్మీ కలెక్షన్లు సేకరించేదని, అందులో భాగంగా రాయచూరులో కూడా 2007లో శాఖను ప్రారంభించి కార్యకలాపాలను కొనసాగించిందని తెలిపారు. 2012 లో అక్షయ గోల్డ్ కంపెనీపై ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో కేసు నమోదు కావడంతో అప్పటి నుంచి లావాదేవీలు నిలిచిపోయాయని తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలని రాయచూరులోని అక్షయ గోల్డ్ ఏజెంట్లు జిల్లాధికారి కార్యాలయం వద్ద 49 రోజుల నుంచి అందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో అక్షయ గోల్డ్ కంపెనీ కార్యాలయం ఉందని, 7 జిల్లాలలో ఏజెంట్లు సేకరించిన పిగ్మీ కలెక్షన్లతో 2500 ఎకరాల భూమిని కొన్నారని తెలిపారు. అక్షయ గోల్డ్ కంపెనీలో 8 మంది సభ్యులున్నారని, కంపెనీ ఎండీ గోగి సుబ్రమణ్యం విశాఖపట్నంలో ఉంటున్నారని వివరించారు. హరినాథబాబుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రాజీ పడక.. ఒత్తిళ్లకు బెదరక
కర్నూలు: రాజకీయ ఒత్తిళ్లకు బెదరకుండా.. అధికార పార్టీ నాయకులతో రాజీపడకుండా ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లాలో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పేరు సంపాదించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన శాఖా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పోలీస్ శాఖ పనితీరును గాడిలో పెట్టారు. జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బందులు పడే ప్రజానీకం కోసం మీతో మీఎస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుద్యోగులు ఫ్యాక్షన్ ఉచ్చులోకి కూరుకుపోకుండా ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ చూపారు. ఆదోని, కోసిగి, కర్నూలు టౌన్‌కు చెందిన యువకులకు 600 మందికి శిక్షణనిచ్చి కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగాలు ఇప్పించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు ఆదోనిలో పేరు మోసిన మట్కా కింగ్. ఈయన ఆస్తుల విషయంలో విచారణ జరిపించాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఆమ్వే కంపెనీకి చెందిన సీఈఓ విలియం స్కాట్ పింకినేను ఢిల్లీలోని గూర్గావ్లో అరెస్టు చేశారు. జిల్లాలో సంచలనం రేపిన నర్సింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారం మొదలుకొని కర్నూలు-నంద్యాల జంట హత్యలను ఛేదించారు. మాల్‌ప్రాక్టీస్ ముఠా గురివిరెడ్డి ముఠాను అరెస్టు చేయించడంలో శాస్త్రీయ పద్ధతులను పాటించి ఫలితాలు సాధించారు. వసంత గోల్డ్, అక్షయ గోల్డ్, అవని గోల్డ్ సంస్థలకు సంబంధించి డిపాజిటర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెట్టుబడుల చట్టాన్ని ఉపయోగించి వాటి నిర్వాహకులను కటకటాలకు పంపారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఏడాది క్రితం ఎస్పీగా జిల్లాకు వచ్చిన ఆయన నేతల ఒత్తిళ్ల మధ్యనే విధులు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన మూడున్నర నెలలకే హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ఆయనను బదిలీ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి మళ్లీ ఇక్కడే కొనసాగేలా ఉత్తర్వులు పొంది సంచలనం సృష్టించారు. అయితే ప్రస్తుతం ఈయన బదిలీ వెనుక జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వద్ద పంచాయితీ పెట్టి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి.