ఎగవేతదారులను అరెస్టు చేయండి
♦ అప్పుడే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయి
♦ అక్షయ గోల్డ్ కేసులో తెలంగాణ సీఐడీకి హైకోర్టు సూచన
సాక్షి, హైదరాబాద్: అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేతదారులను అరెస్ట్ చేసే విషయంలో చర్యలెందుకు చేపట్టలేదని హైకోర్టు తెలంగాణ సీఐడీ అధికారులను ప్రశ్నించింది. అక్షయ గోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరంటూ సీఐడీని ఉద్దేశించి వ్యా ఖ్యానించింది. అరెస్ట్ చేస్తే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని, అగ్రిగోల్డ్ కేసులోనూ ఇదే జరిగిందని గుర్తు చేసింది. అక్షయగోల్డ్‌తో సంబంధం ఉన్న వారెవరైనా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, దానిని వ్యతిరేకించడంతో పాటు, ఈ మొత్తం వ్యవహారాన్ని తాము పర్యవేక్షిస్తున్న విషయాన్ని సంబంధిత న్యాయస్థానాల దృష్టికి తీసుకురావాలని ఏపీ, తెలంగాణ సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ తమ ముందుంచాలని ఇరు రాష్ట్రాల సీఐడీ అధికారులకు సూచించింది. డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ ఓ కార్యాచరణ ప్రణాళికను తమ ముందుంచాలని అక్షయగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
చర్యలెందుకు తీసుకోలేదు?
తమ నుంచి అక్షయగోల్డ్ యాజమాన్యం రూ.600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయ గోల్డ్ వినియోగదారుల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తెలుగు రామ మద్దయ్య, మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అక్షయగోల్డ్ వ్యవహారంలో వ్యవహారంలో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. దీనికి ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానమిస్తూ... 19 కేసుల్లో 28 మంది నిందితులున్నారని, ఇందులో 10మందిని అరెస్ట్ చేయగా, వారు బెయిల్ పొందారని, మిగిలినవారు ముందస్తు బెయిల్ పొందారని, ఇదంతా 2012లోనే జరిగిందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయస్థానాలు బెయిళ్లు ఇస్తుం టే ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించింది. బెయిళ్ల రద్దు కోసం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. సదరు బెయిల్ మంజూరు ఉత్తర్వులను తమ ముందుంచాలంది.
సహకరిస్తే కఠిన చర్యలు
మోసం చేయడం ఎలాగో అగ్రిగోల్డ్‌లో నేర్చుకున్న తరువాత దాని నుంచి బయటకు వచ్చి అక్షయగోల్డ్ పెట్టినట్లు ఉన్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్షయగోల్డ్ యజమాన్యా న్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయలేదు కాబట్టి, ఆ పని మీరెందుకు చేయరని తెలంగాణ సీఐడీ అధికారులను ప్రశ్నించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ స్పందిస్తూ... తెలంగాణలోనూ అక్షయగోల్డ్‌పై 8కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకోకుంటే దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. అక్షయగోల్డ్ యాజమాన్యానికి ఎవరైనా సహకరిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.