అపరాధులుగా ఎందుకు ప్రకటించడం లేదు?
అక్షయగోల్డ్ పూర్వ యాజమాన్యంపై సీఐడీకి హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: అక్షయ గోల్డ్ పూర్వ చైర్మన్, ఇతర డెరైక్టర్ల ఆచూకీ లభించనప్పుడు వారిని ప్రకటిత అపరాధులుగా(ప్రొక్లెయిమ్డ్ అఫెండర్స్) ఎందుకు ప్రకటించడం లేదని హైకోర్టు గురువారం ఏపీ సీఐడీ అధికారులను ప్రశ్నించింది. వారిని ప్రకటిత అపరాధులుగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు స్పష్టం చేసింది. అలా ప్రకటిస్తే వారి వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయవచ్చునని తెలిపింది. అలాగే అక్షయ గోల్డ్ వ్యవహారంలో ఇప్పటి వరకు ఏం చేశారు.. తదుపరి ఏం చేయబోతున్నారో వివరిస్తూ పూర్తి వివరాలతో ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి అక్షయగోల్డ్ యాజమాన్యం రూ.600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని అక్షయగోల్డ్ వినియోగదారుల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తెలుగు రామమద్దయ్య, మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. అక్షయగోల్డ్ ఆస్తుల స్వాధీనానికి ఒంగోలు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ మరి అక్షయగోల్డ్ పూర్వ యాజమాన్యం సంగతేమిటని సీఐడీని ప్రశ్నించింది. వారి ఆచూకీ తెలియడం లేదని, పరారీలో ఉన్నట్లున్నారని సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ తెలిపారు.
పరారీలో ఉంటే వారిని ప్రకటిత అపరాధులుగా ఎందుకు ప్రకటించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సమయంలో శ్రవణ్ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం వద్ద అక్షయగోల్డ్‌కు చెందిన రూ.10 కోట్లు ఉన్నాయని, వాటిని హైకోర్టు ఖాతాకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. డబ్బున్నది ప్రభుత్వం వద్దే కదా.. దానికి మీరేమీ ఆందోళన చెందాల్సిన పని లేదంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.