హైకోర్టుకు నివేదించిన సైనికాధికారులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న సైనిక ప్రాంతంలో గత ఏడాది అక్టోబర్ 9న వెలుగుచూసిన షేక్ ముస్తఫాయుద్దీన్ అనే తొమ్మిదేళ్ల బాలుడి అనుమానాస్పద మృతిపై నమోదైన కేసును ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించినా అభ్యంతరం లేదని సైనికాధికారులు హైకోర్టుకు నివేదించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతోపాటు ఈ ఘటనకు బాధ్యులైన మిలటరీ అధికారులపై కేసు నమోదుచేసేలా పోలీసులను ఆదేశించాలంటూ గతవారం హైకోర్టులో గులాం రబ్బానీ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై సైనిక క్యాంప్ కమాం డెంట్ అతుల్ దేవ్లీ కౌంటర్ దాఖలు చేశారు. ఇద్దరు సైనికాధికారులే తనకు నిప్పంటించినట్లు మరణ వాంగ్మూలంలో బాలుడు పేర్కొన్నా.. పోలీసులు ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని ఆయన ఆరోపించగా సైనికాధికారులు దీన్ని తోసిపుచ్చారు. వదంతుల ఆధారంగా తమను నేరస్తులుగా చిత్రీకరించడం న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. ముస్తఫా మృతితో సంబంధం ఉందన్న కారణంగా లాన్స్‌నాయక్ అప్పలరాజు ఆత్మహత్య చేసుకోలేదని, ఈ కేసులో పోలీసుల విచారణ ఒత్తిడి కారణంగా అప్పలరాజు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని దేవ్లీ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. విలువైన సైనిక క్యాంపస్ భూమిపై రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను ఆశిస్తున్న కొన్ని శక్తుల ప్రమేయాన్ని ఈ కేసుల్లో అనుమతించొద్దని ఆయన కోర్టును కోరారు. పిటిషనర్ ఆరోపణల్లో ఆధారాలు లేనందున ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు.
ముస్తఫా కేసులో ఏ దర్యాప్తుకైనా సిద్ధమే
Published Wed, Feb 4 2015 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement