Lok Sabha Election 2024: పొలిటికల్‌ టాప్‌ గన్స్‌.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు | Lok Sabha Election 2024: Military officers excelled in politics | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: పొలిటికల్‌ టాప్‌ గన్స్‌.. రాజకీయాల్లో రాణించిన సైనికాధికారులు

Published Sun, May 5 2024 4:39 AM | Last Updated on Sun, May 5 2024 4:39 AM

Lok Sabha Election 2024: Military officers excelled in politics

వారు కదన రంగంలో శత్రువుల భరతం పట్టిన వీర సైనికులు. రెండో ఇన్సింగ్స్‌లో రాజకీయ రణరంగంలోనూ అంతే గొప్పగా రాణించారు. త్రివిధ దళాల్లో పలు హోదాల్లో దేశానికి సేవలందించిన సైనిక ఉన్నతాధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు,  ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. జశ్వంత్‌సింగ్, రాజేశ్‌ పైలట్‌ మొదలుకుని తాజాగా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ (రిటైర్డ్‌) బదౌరియా దాకా ఈ జాబితా పెద్దదే...

జశ్వంత్‌ సింగ్‌ 
బహుముఖ ప్రజ్ఞాశీలి  సైనికాధికారిగా శత్రువులతో పోరాడిన జశ్వంత్‌ రాజకీయాల్లో చేరి రక్షణ మంత్రిగా త్రివిధ దళాలకు బాస్‌ అయ్యారు. 1965లో ఇండో–పాక్‌ యుద్ధంలో పాల్గొన్న జశ్వంత్‌ మేజర్‌ హోదాలో 1966లో పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారతీయ జన సంఘ్, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1980లో బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 దాకా ఐదుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1989లో సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్‌ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1998 నుంచి 2004 దాకా కీలకమైన ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు చూశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధిక కాలం పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన కొద్దిమందిలో జశ్వంత్‌ ఒకరు.  

రాజేశ్‌ ‘పైలట్‌’ 
అసలు పేరు రాజేశ్వర్‌ ప్రసాద్‌ బిధూరి. పైలట్‌ వృత్తినే పేరులోనే చేర్చుకుని రాజకీయాల్లో వెలుగు వెలిగారు. భారత వైమానిక దళంలో బాంబర్‌ పైలట్‌గా 1971 భారత్‌–పాక్‌ యుద్ధంలో పోరాడారు. స్క్వాడ్రన్‌ లీడర్‌ హోదాలో రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజీవ్‌కు సన్నిహితుడు. 1980లో కాంగ్రెస్‌ తరఫున భరత్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి 1999 దాకా ఎంపీగా గెలిచారు. కేంద్రంలో పలు కీలక శాఖలకు మంత్రిగా చేశారు. 2000 జూన్‌లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన తనయుడు సచిన్‌ పైలట్‌ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు.

అమరీందర్‌ 
కెప్టెన్‌ టు సీఎం కెపె్టన్‌ అమరీందర్‌ సింగ్‌ జవాన్ల కుటుంబం నుంచి వచ్చారు. 1965 ఇండో–పాక్‌ యుద్ధంలో శత్రువుకు చుక్కలు చూపించారు. కెపె్టన్‌ హోదాలో రిటైరైన ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది రాజీవ్‌. అమరీందర్‌ 1980లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2017 దాకా మూడుసార్లు పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా, 2002 నుంచి 2007 దాకా సీఎంగా చేశారు. 2017లో మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి సీఎం అయ్యారు. కాంగ్రెస్‌ వర్గ విభేదాలతో పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని బీజేపీలో విలీనం చేశారు. 

బి.సి.ఖండూరీ 
స్వర్ణ చతుర్భుజి సారథి మిలిటరీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించిన భువన్‌ చంద్ర ఖండూరీ 1954 నుంచి 1990 దాకా భారత సైన్యంలో సేవలందించారు. ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయి నుంచి ఆర్మీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ విభాగంలో అదనపు డైరెక్టర్‌ జనరల్‌ దాకా కీలక హోదాల్లో పని చేశారు. 1971 ఇండో–పాక్‌ యుద్ధంలో రెజిమెంట్‌ కమాండర్‌గా పోరాడారు. మేజర్‌ జనరల్‌ హోదాలో రిటైరయ్యారు. 1991లో తొలిసారి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్‌ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. ఐదుసార్లు ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో రహదారులు, హైవేల మంత్రిగా చేశారు. దేశ నలు దిక్కులను కలిపిన స్వర్ణ చతుర్భుజి హైవేల ప్రాజెక్టును దిగ్విజయంగా అమలు చేసిన ఘనత ఖండూరీదే. నిజాయితీకి మారుపేరైన ఆయన ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజేతగా నిలిపి సీఎం అయ్యారు.

అయూబ్‌ ఖాన్‌ 
వార్‌ హీరో సైనికుల కుటుంబం నుంచి వచ్చిన అయూబ్‌ ఖాన్‌ 1965 ఇండో పాక్‌ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. భారత సైన్యంలోని 18వ సాయుధ 
అశి్వక దళంలో రిసాల్దార్‌గా పని చేస్తున్న అయూబ్‌ను యుద్ధంలో జమ్మూకశీ్మర్‌ సియాల్కోట్‌ సెక్టార్లో నియమించారు. పాకిస్తాన్‌ సైన్యం యుద్ధ ట్యాంకులతో మన జవానులను చుట్టుముడుతున్న తరుణంలో నాలుగు పాక్‌ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంతో పాటు ఒక ట్యాంకును స్వా«దీనం చేసుకుని శత్రువుకు చుక్కలు చూపించారు. ఆ యుద్ధంలో పరాక్రమానికి వీర్‌ చక్ర పురస్కారం అందుకున్నారు. గౌరవ కెపె్టన్‌ హోదా కూడా దక్కింది. ‘నేను పాక్‌ అధ్యక్షుడు జనరల్‌ అయూబ్‌ ఖాన్‌ను కలుసుకోలేదు గానీ భారతీయ అయూబ్‌ను కలిసినందుకు గర్వంగా ఉంది’ అంటూ నాటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఈ వీర సైనికున్ని హత్తుకోవడం విశేషం. 1983లో రిటైరయ్యాక అయూబ్‌ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ అయూబ్‌ను ఒప్పించి మరీ ఎన్నికల్లో నిలబెట్టారు. రాజస్తాన్‌లోని ఝుంఝును నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్రం నుంచి తొలి ముస్లిం ఎంపీగా కూడా చరిత్ర సృష్టించారు. 1991లో రెండోసారి విజయం సాధించి, పీవీ కేబినెట్లో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.

కాండెత్‌ 
గోవా విముక్తి వీరుడు దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా గోవాలో మాత్రం 1961 దాకా పోర్చుగీసు వలస పాలనే సాగింది. 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ విజయ్‌ ద్వారా గోవాను విలీనం చేసుకుంది. ఈ కీలక సైనిక చర్యకు సారథ్యం వహించిన ధీరుడు కేరళకు చెందిన మేజర్‌ జనరల్‌ కున్హిరామన్‌ పాలట్‌ కాండెత్‌. తర్వాత కొంతకాలం గోవా రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా చేశారు. 1971 ఇండో–పాక్‌ యుద్ధంలో పశి్చమ కమాండ్‌ సైనిక బలగాన్ని నడిపించారు. పరమ విశిష్ట సేవా మెడల్‌తో పాటు పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. 1972లో లెఫ్టినెంట్‌ జనరల్‌గా రిటైరయ్యారు. 1990ల్లో బీజేపీలో చేరారు. పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా చేశారు.   

జనరల్‌ వీకే సింగ్‌... 
రాజకీయాల్లో సక్సెస్‌ భారత సైన్యంలో కమాండో స్థాయి నుంచి ఆర్మీ ఛీఫ్‌ అయిన తొలి వ్యక్తి జనరల్‌ విజయ్‌ కుమార్‌ సింగ్‌. 1971 ఇండో–పాక్‌ యుద్ధంతో సహా అనేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2012 దాకా సైనిక దళాధిపతిగా చేశారు. రిటైరయ్యాక 2014లో బీజేపీలో చేరారు. స్వరాష్ట్రం యూపీలోని ఘాజియాబాద్‌ నుంచి ఎంపీ అయ్యారు. 2019లో 
రెండోసారి విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు 
మంత్రిగా చేశారు.

విష్ణు భగవత్‌... 
గురి తప్పిన టార్పెడో  భారత నావికాదళంలో అత్యంత ప్రతిభాపాటవాలతో అత్యున్నత పదవికి చేరుకున్న అడ్మిరల్‌ విష్ణు భగవత్‌... వివాదాస్పద వ్యవహార శైలితో అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. 1971 ఇండో–పాక్‌ యుద్ధంలో, పోర్చుగీస్‌ చెర నుంచి గోవాకు విముక్తి కలి్పంచిన ఆపరేషన్‌ విజయ్‌లో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ ప్రభుత్వంతో విభేదాల కారణంగా 1998లో ఉద్వాసనకు గురయ్యారు. నేవీ చీఫ్‌గా ఉంటూ వేటుకు గురైన తొలి వ్యక్తి ఆయనే. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అడ్మిరల్‌ హోదానూ కోల్పోయారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్‌ రాజకీయాల్లో కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. 

‘ఉత్తమ’ ఫైటర్‌ 
నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. వైమానిక దళంలో మిగ్‌ 21, మిగ్‌ 23 వంటి ఫైటర్‌ జెట్లు నడిపి శత్రువులపై పోరాడారు. రాజకీయాల్లోనూ రియల్‌ ఫైటర్‌గా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌ 1982 నుంచి 1991 దాకా ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్‌ పైలట్‌గా చేశారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ఎన్నికల్లో కోదాడ నుంచి ఓడినా 1999లో అక్కడి నుంచే విజయఢంకా మోగించారు. మూడు దశాబ్డాల రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్లగొండ ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా చేశారు. తాజాగా హుజారాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో తొలి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఉత్తమ్‌ భార్య పద్మావతి కూడా రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో వచి్చన టెర్రర్‌ అనే తెలుగు సినిమాలో ఆయన సీఎం పాత్ర పోషించడం విశేషం!

జేజే సింగ్‌... తొలి సిక్కు 
ఆర్మీ చీఫ్‌ జోగిందర్‌ జస్వంత్‌ సింగ్‌. తొలి సిక్కు ఆర్మీ జనరల్‌. 2005 నుంచి 2007 దాకా దేశ 21వ ఆర్మీ చీఫ్‌గా సేవలందించారు. రిటైరయ్యాక 2008లో అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా అయ్యారు. 2017లో అకాలీదళ్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కెపె్టన్‌ అమరీందర్‌ సింగ్‌ చేతిలో ఓడారు. 2019లో అకాలీదళ్‌ (తక్సలీ)లో నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరారు. వీకే సింగ్‌ తర్వాత కాషాయం తీర్థం పుచ్చుకున్న రెండో జనరల్‌గా నిలిచారు.

బదౌరియా...  పొలిటికల్‌ టేకాఫ్‌ 
రాజకీయాల్లోకి  వచి్చన తొలి వైమానిక దళపతిగా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ బదౌరియా చరిత్ర సృష్టించారు. ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌గా విధుల్లో చేరిన ఆయన 41 ఏళ్ల కెరీర్‌లో 26 రకాల ఫైటర్‌ జెట్స్, రవాణా విమానాలు నడిపిన విశేష ప్రతిభావంతుడు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్‌ చీఫ్‌ టెస్ట్‌ పైలట్‌గా, ప్రాజెక్ట్‌ టెస్టింగ్‌ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. 2019 నుంచి 2021 దాకా ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌గా చేసి రిటైరయ్యారు. ఇటీవలే బీజేపీలో చేరారు.  

రాథోడ్‌ గురి పెడితే...  టార్గెట్‌ తలొంచాల్సిందే! 
యుద్ధభూమి అయినా, క్రీడా మైదానమైనా ఆయన గురి పెడితే టార్గెట్‌ తలొంచాల్సిందే! ఆయనే కల్నల్‌ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌. విశ్వ క్రీడా ప్రపంచంలో భారత్‌కు ఘన కీర్తి సాధించి పెట్టిన అభినవ అర్జునుడు. చదువులోనూ, ఆటలోనూ ‘గోల్డెన్‌’ బాయ్‌గా నిలిచిన రాథోడ్‌ కార్గిల్‌ యుద్ధంలో పోరాడారు. 2002 కామన్వెల్త్‌ క్రీడల్లో గోల్డ్‌ మెడల్‌ కొట్టారు. ఆ ఈవెంట్లో ఆయన నెలకొలి్పన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 2004 గ్రీస్‌ ఒలింపిక్స్‌ డబుల్‌ ట్రాప్‌ ఈవెంట్లో వెండి పతకం కొట్టడంతో రాథోడ్‌ పేరు మారుమోగింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు అదే తొలి వ్యక్తిగత వెండి పతకం! కెరీర్లో ఏకంగా 25 అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకున్నారు. 2013లో ఆర్మీ నుంచి రిటైరై బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. మోదీ ప్రభుత్వంలో సమాచార, క్రీడా మంత్రిగా చేశారు. 2019లోనూ ఎంపీగా గెలిచారు. 2023లో రాజస్తాన్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement