స్వరాష్ట్రంలో టికెటిచ్చేందుకు ఆసక్తి చూపని పార్టీలు
బయటి రాష్ట్రాల్లోనే నేతలుగా రాణిస్తున్న భోజ్‌పురి తారలు
వాళ్లంతా భోజ్‌పురీ సినీ పరిశ్రమను తిరుగు లేకుండా ఏలిన, ఏలుతున్న తారలు. వెండితెరపై కనిపించారంటే విజిళ్లు, క్షీరాభిష్‌కాలే. అయితే వారిపట్ల ఈ వీరాభిమానమంతా భోజ్‌పురీ సినిమాలకు పుట్టిల్లయిన బిహార్, పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లకే పరిమితం. వాళ్లు స్థానికంగా ఎంతగా వెలిగినా బాలీవుడ్, తెలుగు తదితర సినీ పరిశ్రమల్లోనే విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించడం ద్వారానే దేశవ్యాప్తంగా ఫేమ్‌లోకి వచ్చారు. రాజకీయ రంగస్థలంపైనా ఇదే సీన్ రిపీటవుతోంది. భోజ్‌పురీ తారలెవరూ వారి స్వరాష్ట్రమైన బిహార్లో పెద్దగా ఉనికి చాటలేకపోతున్నారు. కారణాలేవైనా వారిని అక్కడినుంచి బరిలోకి దింపేందుకు పార్టీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేసి మాత్రమే వాళ్లు లోక్‌సభలో అడుగు పెడుతున్నారు...
భోజ్‌పురీ నటీనటులకు, వారి స్వరాష్ట్రమైన బిహార్‌కు రాజకీయంగా ఎప్పుడూ చుక్కెదురే. పొరుగు రాష్ట్రాలకో, సుదూరాలకో వెళ్లి మాత్రమే రాజకీయాల్లో రాణిస్తున్నారు. పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా రాణించిన భోజ్‌పురీ సూపర్‌స్టార్ రవికిషన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ జౌన్‌పూర్ లోక్‌సభ స్థానంలో బరిలో దిగిన ఆయన ఘోర ఓటమి చవిచూసి ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం బీజేపీలో చేరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి 3 లక్షల ఓట్ల పై చిలుకు భారీ మెజారిటీతో నెగ్గారు.
ఈసారి కూడా అక్కడినుంచే బరిలోకి దిగుతున్నారు. మరో ప్రముఖ భోజ్‌పురీ నటుడు మనోజ్ తివారీ అయితే ఏకంగా ఢిల్లీని తన రాజకీయ కర్మభూమిగా మార్చుకున్నారు. బిహార్లోని కైమూర్ జిల్లా అతర్వాలియా గ్రామానికి చెందిన ఆయన ఈశాన్య ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ. ఈసారి కూడా అక్కడినుంచే పోటీలో ఉన్నారు. భోజ్‌పురీ నట గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్ పరిస్థితీ అంతే. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఆజంగఢ్ నుంచి నెగ్గిన ఆయన ఈసారీ అక్కడి నుంచే పోటీలో ఉన్నారు. మరో భోజ్‌పురీ గాయకుడు పవన్ సింగ్‌కు కూడా ఈసారి పశ్చిమ బెంగాల్ లోని ఆసన్‌సోల్ నుంచి బీజేపీ టికెటివ్వగా రెండు రోజులకే ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు.
బిహారీ బాబుగా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం శత్రుఘ్న సిన్హా గతంలో రెండుసార్లు బిహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచినా 2019లో టికెట్ దక్కకకపోవడంతో పశి్చమ బెంగాల్ వలస వెళ్లారు. అసన్‌సోల్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఈసారీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇంటర్నెట్ సంచలనం, భోజ్‌పురీ గాయని నేహా సింగ్ రాథోడ్‌కు ఈసారి ఢిల్లీ నుంచి టికెట్ ఇస్తారంటున్నారు.
గుంజన్.. ఒకే ఒక్కడు
ఈ లోక్‌సభ ఎన్నికల్లో భోజ్‌పురి సినీ పరిశ్రమకు సంబంధించి బిహార్ నుంచి పోటీ చేస్తున్నది గుంజన్ కుమార్ ఒక్కరే. అయితే ఈ భోజ్‌పురీ/మగధీ గాయకుడు తన స్వస్థలమైన నవడా నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారు. ‘‘అన్ని ప్రధాన పార్టీలనూ సంప్రదించా. ఎవరూ టికెటివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని వాపోతున్నారాయన! భోజ్‌పురి నటులు, గాయకులకు బిహార్‌లో లోక్‌సభ టికెటివ్వడానికి ప్రధాన పారీ్టలు వెనకా ముందాడుతున్న మాట వాస్తవమేనని భోజ్‌పురి గాయకుడు వినయ్ బిహారీ అంటున్నారు.
ఆయన బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియా ఎమ్మెల్యే. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించారు. కానీ ఏ పార్టీ కూడా టికెటివ్వకపోవడంతో 2010లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థగా పోటీ చేయాల్సి వచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన భోజ్‌పురీ భాషకు బిహార్లోనే తగిన గౌరవం లభించడం లేదు. బహుశా అందుకే భోజ్‌పురీ నటీనటులు, గాయకులకు ఇతర రాష్ట్రాల నుంచే తప్ప స్వరాష్ట్రంలో పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయేమో!’ అన్నారు. భోజ్‌పురీ నటీనటులు, గాయకులకు బీజేపీ మున్ముందు కచి్చతంగా బిహార్ నుంచి అవకాశమిస్తుందని తనకు నమ్మకముందని రవికిషన్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment