హైదరాబాద్: ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారుల విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లను జీహెచ్‌ఎంసీ తొలగిస్తుండటాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విద్యుత్, నీటి కనెక్షన్లను ఇవ్వనప్పుడు వాటిని నిలుపుదల చేసే అధికారం జీహెచ్‌ఎంసీకి లేదని చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. 2014-15కుగానూ రూ. 23.42 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ పంపిన నోటీసును సవాల్‌చేస్తూ ఎన్‌ఎస్‌ఎల్ రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గత నెల 6న నోటీసు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు 48 గంటల్లోపు ఆస్తి పన్ను చెల్లించాలని, లేనిపక్షంలో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్లను తొలగిస్తామన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ నోటీసు చట్ట విరుద్ధమని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నోటీసును నిలుపుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియను ఆరు వారాల్లోపు పూర్తి చేయాలని పేర్కొంటూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది.