సుజనా చౌదరికి హైకోర్టు షాక్ | hi court given shock to sujana chowdary | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరికి హైకోర్టు షాక్

Published Wed, Apr 22 2015 12:49 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

సుజనా చౌదరికి హైకోర్టు షాక్ - Sakshi

సుజనా చౌదరికి హైకోర్టు షాక్

సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సుజనా చౌదరి తమ నుంచి తీసుకున్న రూ.106 కోట్ల అప్పును చెల్లించే స్థితిలో లేనందున.. ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తద్వారా తమ అప్పును తీర్చేలా ఆదేశాలివ్వాలంటూ మారిషస్‌కు చెందిన మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) దాఖలు చేసిన కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఇదే సమయంలో సుజనా చౌదరికి మరో అవకాశం ఇచ్చింది.

పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయాన్ని ఎంసీబీ ఆరు నెలల వరకు పత్రికల్లో ప్రకటన ఇవ్వకుండా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీరును ఈ సందర్భంగా న్యాయమూర్తి దుయ్యబట్టారు. తీసుకున్న మొత్తాలను తిరిగి చెల్లించాల్సిన సుజనా.. ఎంసీబీ పదే పదే కోరినప్పటికీ, ఆ మొత్తాలను తిరిగి చెల్లించకూడదని తీర్మానించుకున్నట్లుగా వ్యవహరించిందన్నారు. బకాయి మొత్తాన్ని ఎంసీబీకి తిరిగి చెల్లించేందుకు సుజనా ముందుకొచ్చినట్లుగా ఈ కోర్టు ముందు ఎటువంటి ఆధారం చూపలేదన్నారు.

ఇటువంటి కంపెనీ విషయంలో తాము దాఖలు చేసిన కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని కోరే హక్కు ఏ రుణదాతకైనా ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఎంసీబీని అలాగే వదిలేస్తే, భారతీయ కంపెనీలు నిజాయితీగా లేవనే అభిప్రాయం అంతర్జాతీయంగా కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఎంసీబీ కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు జస్టిస్ రాజశేఖరరెడ్డి తెలిపారు.
ఇదీ వివాదం
సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కం పెనీని హేస్టియా పేరుతో మారిషస్‌లో ఏర్పాటు చేసింది. 2010లో హేస్టియా  ఎంసీబీ నుంచి రూ.100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గ్యారెంటార్)గా ఉంది. అయితే 2012 నుంచీ హేస్టియా బకాయి చెల్లిం పులు మానేసింది. పలు పరిణామాల నేపథ్యంలో ఎంసీబీ తొలుత హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఆ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. అయితే తమ బకాయి చెల్లించే విషయంలో హేస్టియా, సుజనా యూనివర్సల్ చేస్తున్న జాప్యం, తాత్సారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీని మూసివేయాలని కోరుతూ ఎం సీబీ గతేడాది హైకోర్టులో కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement