సాక్షి, హైదరాబాద్: జంతువుల హక్కుల గురించి పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మానవుడి వల్ల ఈ భూమి మీద ఉన్న ప్రతీ జంతువు ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉందని పేర్కొంది. కొన్ని జంతువులను వాహనాల్లో కుక్కి అక్రమంగా తరలిస్తున్నారని, ఈ సమయంలో ఆ జంతువులు కాళ్లు, నడుము విరిగి వర్ణించలేనంత బాధను అనుభవిస్తున్నాయని వ్యాఖ్యానించింది. చనిపోయే సమయంలో కూడా అంత బాధను అనుభవించవని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. జంతువుల హక్కులు, వాటి సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా కొవుటూరు పవన్ కుమార్‌ను నియమించింది. జంతు హక్కుల చట్టా లు, వాటి సంరక్షణ చట్టాలు, ఆయా దేశాల్లో చట్టాలు అమలవుతున్న తీరు తదితర విషయాలన్నింటిపై తగిన అధ్యయనం చేసి తమకు సహకరించాలని పవన్‌ను కోర్టు కోరింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మతపరమైన వ్యవహారంగా భావించవద్దు..
ఇటీవల తుర్కపల్లి నుంచి షామీర్‌పేట వైపు వెళుతున్న డీసీఎంలో 63 గోవులు, దూడలను తరలిస్తుండగా గో సంరక్షణదళ్ సభ్యులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, తాము కేవలం గోవులను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాజ్యంపై విచారణ జరపడం లేదని స్పష్టం చేసింది. దీనిని మతపరమైన వ్యవహారంగా భావించరాదని వ్యాఖ్యానించింది. ప్రతీ జంతువు హక్కుల పరిరక్షణ కోసం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది. జంతువులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయంది. ఈ మొత్తం వ్యవహారంలో తగిన అధ్యయనం చేసి కోర్టుకు సహకరించేందుకు ఓ యువ న్యాయవాది అవసరమని ధర్మాసనం చెప్పగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ స్పందిస్తూ.. కొవులూరి పవన్ పేరును ప్రతిపాదించారు. ధర్మాసనం కూడా పవన్ పట్ల సానుకూలంగా స్పందించింది. జంతువుల హక్కులకు సంబంధించిన చట్టాల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి తమకు సహకరించాలని పవన్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment