
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 6లోపు ఆయన కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. జస్టిస్ రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం జనవరి 10న నిర్ణయించి, ఆ మేరకు కేంద్రానికి సిఫారసు పంపింది.
ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం.. జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీపై పునరాలోచన చేయాలని కొలీజియాన్ని కోరింది. దీంతో మరోసారి సమావేశమైన కొలీజియం, జనవరి 10న సిఫారసు చేసేటప్పుడే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని, ఆయన బదిలీపై పునరాలోచన చేసేందుకు కొత్త విషయాలేవీ తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది. జనవరి 10న చేసిన సిఫారసుకే కట్టుబడి ఉన్నామని కొలీజియం ఫిబ్రవరి 19న పునరుద్ఘాటించింది. అయితే అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి సంబంధించిన ఫైల్‌ను రాష్ట్రపతికి పంపలేదు. దీంతో జస్టిస్ గొగోయ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని గుర్తు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
జస్టిస్ రాధాకృషన్ బదిలీ ఫైల్‌ను రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి కోవింద్ జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి ఆమోదముద్ర వేశారు. రాధాకృష్ణన్ 2018, జూలై 7న ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన బదిలీతో ప్రస్తుతం నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment