మంగళవారం విజయవాడలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ నరసింహన్
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్:అమరావతి రాజధాని కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొలువు తీరింది. రాష్ట్రపతి రామ్‌నా«థ్ కోవింద్ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ సలసా వెంకట నారాయణ బట్టు, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మందాడ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్‌చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్, జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ తేలప్రోలు రజని, జస్టిస్ దుర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యానారాయణ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ ఎం.గంగారావులు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ, రాష్ట్రపతి నోటిఫికేషన్ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ వేదికపై ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, డీజీపీ ఆర్పీ ఠాకూర్, మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మికాంతం, జిల్లా జడ్జి వై.లక్ష్మణరావు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: జస్టిస్ ఎన్వీ రమణ
హైకోర్టు ఏర్పడినంత మాత్రాన మన కర్తవ్యం తీరిపోలేదని, దీన్ని ఒక ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దాలని, అందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలు సహకరించినప్పుడే అది సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కలసి జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత(10 కోర్టు హాల్స్) న్యాయస్థానం భవన సముదాయాలను ప్రారంభించారు. మొత్తం పది కోర్టులను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. హైకోర్టు నిర్వహించాల్సిన విధులు క్లిష్టతరంగాను, సున్నితంగాను ఉంటాయన్నారు. వ్యక్తికి–వ్యక్తికి, వ్యక్తికి–ప్రభుత్వానికి వచ్చే వ్యాజ్యాలు విచారించి న్యాయాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కర్తవ్యాన్ని నిష్కర్షగా నిర్వహించాల్సి ఉందని, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటమే కాకుండా రాజ్యాంగంలో నిబిడీకృతమైన అంశాలకూ ప్రాధాన్యమివ్వాలన్నారు. తీర్పులు వెల్లడించే సమయంలో న్యాయమూర్తులు స్వతంత్రంగానూ, నిష్కర్షగానూ వ్యవహరించాలని ఉద్బోధించారు. అనువైన సంఘ నిర్వహణకు నిర్మించబడిన సంస్థల్లో న్యాయ సంస్థ కూడా ఒకటన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవభావం ఉండేలా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. హైకోర్టు తరలిరావడంతో ఇక్కడి కక్షిదారులకు ఇబ్బందులు తగ్గుతాయన్నారు.
ఈ నెల 21న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాక..
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సందేశాన్ని జస్టిస్ ఎన్వీ రమణ చదివి విన్పించారు. రాష్ట్రంలో న్యాయ విభాగం కార్యకలాపాలు విస్తృతమయ్యాయని, మరింత బలోపేతమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన సందేశంలో పేర్కొన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుది అతిపిన్న వయస్సు అని అన్నారు. మన న్యాయవ్యవస్థ నిస్సందేహంగా గర్వించదగినదిగా ఉండాలని, ఇందుకు మన బాధ్యత ఎంతో ఉందని, ఆనందంతో మన విధుల్లో భాగస్వాములమవ్వాలని ఉద్బోధించారు. న్యాయవ్యవస్థలో న్యాయవాదులు జవాబుదారీగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని తన సందేశంలో ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ నెల 21న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ చేతుల మీదుగా అమరావతిలోని తాత్కాలిక హైకోర్టు నూతన భవనాలను ప్రారంభించి పూర్తి స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించారు.
ఇదో చరిత్రాత్మక ఘట్టం: జస్టిస్ ప్రవీణ్‌కుమార్
అమరావతి రాజధాని కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు కావడం చరిత్రాత్మక ఘట్టమని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోవడం ప్రశంసనీయమని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు వ్యవస్థ చరిత్రలో పునరావృతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి హైకోర్టు గుంటూరు కేంద్రంగా పనిచేసిందని, తదుపరి 1956లో హైదరాబాద్‌కు తరలించడం జరిగిందని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగాక తిరిగి అమరావతి రాజధాని ప్రాంతం విజయవాడ కేంద్రంగా హైకోర్టు కార్యకలాపాలు చేపట్టడం చరిత్రాత్మకమైన ఘట్టమని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
విభజన పూర్తయ్యింది: సీఎం
ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు రాకతో విభజన పూర్తయిందని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిధులు, ఆస్తుల విభజన తప్ప తరలింపు మొత్తం పూర్తయినట్టేనన్నారు. అమరావతికి హైకోర్టు తరలడానికి తక్కువ సమయం ఇచ్చారన్నారు. హైకోర్టు విధుల నిర్వహణకు ఇబ్బందుల్లేకుండా చూస్తామని చెప్పారు. విభజన సమస్యలున్నా అన్నింటినీ అధిగమిస్తున్నామని, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో జనవరి 1న నూతన హైకోర్టును ప్రారంభించుకోవడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా తాను, తొలి గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు చేపట్టామని, ఇప్పుడు హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌గా ప్రవీణ్‌కుమార్ వ్యవహరించడం చరిత్ర అని పేర్కొన్నారు. ఇక్కడినుంచే న్యాయపరిపాలనకు శ్రీకారం చుట్టామని, మనందరం కలసి ఉత్తమ హైకోర్టుగా తీర్చిదిద్దుదామని అన్నారు.
నేటినుంచి తాత్కాలిక హైకోర్టు కార్యకలాపాలు..
విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హైకోర్టు కార్యకలాపాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తయింది. అమరావతి కేంద్రంగా హైకోర్టు కార్యకలాపాలకు, జడ్జీలు, అధికారుల వసతికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైకోర్టు కార్యాలయం కోసం 10,000 చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.
తాత్కాలిక హైకోర్టును సందర్శించిన చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్
తుళ్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పలువురు న్యాయవాదుల బృందం ఆయన వెంట ఉన్నారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ బృందం అక్కడ పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ద్వారా నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్థానమిదీ..
హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ 1961 ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. ఎంతోమంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించి న్యాయ సహాయాన్ని చేశారు. ఆయన కుమారుడైన ప్రవీణ్‌కుమార్ 10వ తరగతి వరకు హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో చదివారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే న్యాయవాద వృత్తిని ఆరంభించారు. అతి తక్కువ కాలంలోనే తండ్రి మాదిరిగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
కొలువుదీరిన తెలంగాణ కొత్త హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరాదిన తెలంగాణ కొత్త హైకోర్టు కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టుకు చేరుకున్న జస్టిస్ రాధాకృష్ణన్ తన సహచర న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పివీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ బి.శివశంకర్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ టి.అమర్‌నాథ్ గౌడ్‌లతో ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు మొదటి కోర్టు హాలు వేదిక కాగా, ఈసారి హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వేదిక నుంచి ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం సీజే, ఇతర న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్థానమిదీ..
హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ 1961 ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్, గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. ఎంతోమంది పేదల తరఫున ఉచితంగా కేసులు వాదించి న్యాయ సహాయాన్ని చేశారు. ఆయన కుమారుడైన ప్రవీణ్‌కుమార్ 10వ తరగతి వరకు హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో చదివారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986 ఫిబ్రవరి 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తండ్రి పద్మనాభరెడ్డి వద్దే న్యాయవాద వృత్తిని ఆరంభించారు. అతి తక్కువ కాలంలోనే తండ్రి మాదిరిగా క్రిమినల్ లాపై పట్టు సాధించారు. 2012 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
తాత్కాలిక హైకోర్టును సందర్శించిన చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్
తుళ్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నేలపాడులో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పలువురు న్యాయవాదుల బృందం ఆయన వెంట ఉన్నారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఈ బృందం అక్కడ పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ద్వారా నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జస్టిస్ ఎస్.వి నారాయణబట్టు
1962లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో రామకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా మదనపల్లెలో కొనసాగింది. బెంగళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1987లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఈ.కళ్యాణ్‌రామ్ వద్ద వృత్తిపరమైన మెళకువలు నేర్చుకున్నారు. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2000–03 సంవత్సరాల మధ్య ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలు అందించారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వ్యవసాయ కుటుంబంలో 1962లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా భీమవరంలోనే సాగింది. ఏలూరు సీఆర్ రెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1987లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. న్యాయవాదులు పి.రాజగోపాలరావు, పి.రాజారావుల వద్ద వృతి జీవితాన్ని ఆరంభించారు. సివిల్, క్రిమినల్, సర్వీసు చట్టాలపై పట్టు సాధించారు. అనతికాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేపట్టారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సంగీతం, కళలపై మంచి మక్కువ.
జస్టిస్ ఎం.సీతారామమూర్తి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో న్యాయవాద కుటుంబంలో జన్మించారు. వారి వంశంలో మూడో తరం న్యాయవాదిగా ఈయన నిలిచారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 12 సంవత్సరాలపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఆ తరువాత జ్యుడీషియల్ సర్వీసుల్లో ప్రవేశించారు. పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. ఉత్తమ న్యాయాధికారిగా పలు పతకాలు అందుకున్నారు. యోగా, సంగీతం, ప్రయాణాలంటే ఆసక్తి. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు
విజయనగరం జిల్లాలో 1962లో న్యాయవాద కుటుంబంలో జన్మించారు. తాత ఉప్మాక నారాయణమూర్తి విజయనగరం, పార్వతీపురంలలో ప్రముఖ న్యాయవాదిగా, శతావధానిగా పేరుగాంచారు. తల్లి తరఫున వారు కూడా న్యాయవాదులే. భార్య, ఆమె తండ్రి కూడా న్యాయవాదులే. 1986లో బొబ్బిలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1998లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ తాళ్లూరు సునీల్ చౌదరి
1957 ఫిబ్రవరి 4న ప్రకాశం జిల్లా కారం చేడులో వెంకటాద్రి, వీరమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కారంచేడులోనే కొనసాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1984లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. చీరాలలో పి.వెంకటాద్రి వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. తరువాత జస్టిస్ జె.చలమేశ్వర్(సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల పదవీ విరమణ చేశారు) వద్ద పనిచేశారు. పలు ప్రభుత్వరంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 1998లో జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1960 జూన్ 14న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యాభాస్యమంతా మచిలీపట్నంలోనే సాగింది. ఏలూరు సీఆర్ రెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ సాధించారు. న్యాయవాదిగా ఎన్‌రోల్ అయి, మచిలీపట్నంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. యక్కాల పాండురంగారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1991లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సతీమణి రమణకుమారి ప్రస్తుతం న్యాయాధికారిగా పనిచేస్తున్నారు.
జస్టిస్ జి.శ్యాంప్రసాద్
గుంటూరులో 1958 సెప్టెంబర్ 27న మల్లికార్జునరావు, సావిత్రమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరులోనే సాగింది. నెల్లూరు వీఆర్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ సాధించారు. న్యాయవాదిగా ఎన్‌రోల్ అయి ఎన్.చలపతిరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు.1985లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో సేవలు అందించారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ జె.ఉమాదేవి
1959 సెప్టెంబర్ 26న అనంతపురం జిల్లాలో జ్ఞానోబారావు, తులసీబాయి దంపతులకు జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టాలు పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. వరదారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి ఉభయ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ఎన్.బాలయోగి
తూర్పుగోదావరి జిల్లా పెయ్యలవారిపేట గ్రామంలో 1957 జనవరి 15న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయి, సీనియర్ న్యాయవాదిగా వెంకటరామయ్య వద్ద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తరువాత జ్యుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ టి. రజని
ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో 1958 నవంబర్ 6న వెంకటప్పయ్య, రామతులసమ్మ దంపతులకు జన్మించారు. పాఠశాల నుంచి కాలేజీ వరకు విద్యాభ్యాసం గుంటూరులో సాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1981లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2002 వరకు గుంటూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి పలు హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు
1961 సెప్టెంబర్ 26న జన్మించారు. తండ్రి డీవీ సుబ్బారావు ప్రముఖ న్యాయకోవిదుడు. విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోనే సాగింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పలు ప్రభుత్వరంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ లీగల్ కమిటీ సభ్యునిగా కొనసాగారు. స్వచ్ఛభారత్ అంబాసిడర్‌గా నామినేట్ అయ్యారు. 2017న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కింది కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ కొంగర విజయలక్ష్మి
గుళ్లాపల్లి వెంకటేశ్వరరావు, సీతారత్నం దంపతులకు 1960 సెప్టెంబర్ 20న జన్మించారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. విద్యార్థి దశలో వివిధ బహుమతులు అందుకున్నారు. 1985లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. జస్టిస్ ఎస్.పర్వతరావు వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, న్యాయవాదిగా పనిచేశారు. ఈమె జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వద్ద కూడా పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ఎం.గంగారావు
అనంతపురం జిల్లా గుంతకల్లులో 1961 ఏప్రిల్ 8న చింతామణి, గోవిందమ్మ దంపతులకు జన్మించారు. అనంతపురంలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1987లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1988లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. జస్టిస్ బీఎస్‌ఏ స్వామి, జస్టిస్ సీవీ రాములు వద్ద జూనియర్‌గా చేరి వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment