సీఎం కేసీఆర్. చిత్రంలో గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్ చేత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ రాధాకృష్ణన్‌కు గవర్నర్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులు, పలువురు మంత్రులు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ న్యాయవాదులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
విభజన అనంతరం తొలి సీజే...
రాష్ట్ర విభజన తరువాత ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ కావడం విశేషం. 2013 మే 21న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 35వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా... రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2015 మే 6న పదవీ విరమణ చేశారు. జస్టిస్ సేన్‌గుప్తా పదవీ విరమణ అనంతరం హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి నియమితులు కావడం ఇదే తొలిసారి.
సేన్‌గుప్తా పదవీ విరమణ తర్వాత జస్టిస్ దిలీప్ బి. బొసాలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా బాధ్య తలు చేపట్టారు. ఆయన 2015 మే 5న ఏసీజేగా బాధ్యతలు చేపట్టి 14 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. 2016 జూలై 30న పదోన్నతిపై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఏసీజేగా నియమితులయ్యారు. 2016 జూలై 30న ఏసీజేగా బాధ్యతలు చేపట్టిన రమేశ్ రంగనాథన్ రికార్డు స్థాయిలో 23 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. ఇంత సుదీర్ఘకాలంపాటు ఏసీజేగా పనిచేసిన న్యాయమూర్తి హైకోర్టులో ఇప్పటివరకు ఎవరూ లేరు.
ఇదీ జస్టిస్ రాధాకృష్ణన్ నేపథ్యం...
జస్టిస్ రాధాకృష్ణన్ 1959 ఏప్రిల్ 29న కేరళలో జన్మిం చారు. 1983లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2006లో అదే హైకో ర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్ హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన జస్టిస్ రాధాకృష్ణన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న
Comments
Please login to add a commentAdd a comment