నువ్వో దోపిడీదారుడివి! | KCR in greater elections compaign | Sakshi
Sakshi News home page

నువ్వో దోపిడీదారుడివి!

Published Sun, Jan 31 2016 3:04 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నువ్వో దోపిడీదారుడివి! - Sakshi

నువ్వో దోపిడీదారుడివి!

గ్రేటర్ ఎన్నికల సభలో చంద్రబాబుపై సీఎం కేసీఆర్ నిప్పులు
పెట్టుబడిదారులకు కొమ్ముకాసి.. కార్మికుల కడుపులు కొట్టావు
హైదరాబాద్‌లో నీ ముద్రలున్నాయా?
అవును.. బషీర్‌బాగ్‌లో రక్తపు ముద్రలు ఉన్నాయి..
అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన ముద్రలున్నాయి
హైదరాబాద్‌ను వదల బొమ్మాళీ.. వదల అంటున్నాడు
మా వదిన భువనేశ్వరి టీఆర్‌ఎస్‌కే ఓటేస్తానన్నది
ఏపీలో మీ పని మీరు చేసుకోండి.. ఇక్కడ మా పని మేం చేసుకుంటాం
డబుల్ బెడ్రూంపై దత్తాత్రేయవి అబద్ధాలు నారాయణ గారూ..
5న హైదరాబాద్‌లో ఉండకండి
మంత్రి కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడి

 
సాక్షి, హైదరాబాద్:
‘‘చంద్రబాబు నాయుడూ... నువ్వో దోపిడీదారుడివి. కార్మికుల శ్రమను దోచుకున్నవ్. పెట్టుబడిదారుల కొమ్ముకాసినవ్. హైదరాబాద్‌లో నా ముద్రలు ఉన్నయని గొప్పలు చెబుతున్నవ్. బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి నలుగురిని పొట్టన పెట్టుకున్న రక్తపు ముద్రలు ఉన్నయ్. అసెంబ్లీ ముందు అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ముద్రలు ఉన్నయ్. మూసీ మురికిలో నీ అడుగు ఉంది. కార్మికుల కడుపులు గొట్టినవ్.
 
 దేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను సృష్టించిన ముద్రలు నీవే. మేం వారిని పర్మనెంట్ చేసే ముద్రలు వేస్తున్నం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు మళ్లీ మాయో పాయాలు చేస్తున్నాడని, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాడని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగించారు.
 
వదల బొమ్మాళీ.. వదల అంటుండు
బహిరంగ సభలో సరిగ్గా 30 నిమిషాలపాటు మాట్లాడిన కేసీఆర్ టీడీపీ అధినేతపై విమర్శల దాడి చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం ఏర్పాటైందని, తెలంగాణ ప్రజలు తనను ఇక్కడ పనిచేయాల్సిందిగా తీర్పిచ్చారని, ఏపీ ప్రజలు అక్కడ పనిచేయాల్సిందిగా చంద్రబాబుకు తీర్పు ఇచ్చారని చెప్పారు. ‘‘ఆయన అక్కడ చేసుకోవడానికి కావాల్సినంత పని ఉంది. మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటం. హైదరాబాద్ బజార్లు మేమే ఊడ్చుకుంటం. చంద్రబాబు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్ఛాపురం దాకా చాలా బజార్లు ఉన్నాయి. కానీ చంద్రబాబు వదల బొమ్మాళీ.. వదల అంటూ హైదరాబాద్‌ను వదల అంటుండు.. అయినా ఎవడు పొమ్మన్నడు? కావాలంటే మరో 25 హెరిటేజ్ దుకాణాలు పెట్టుకో. పర్మిషన్లు ఇప్పిస్తం. 15 రోజులకో సారి వచ్చిపో..’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
 హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు ఏమీ చేయలేదని, వంద శాతం పనిచేసే పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు. ‘‘చంద్రబాబూ.. వాస్తవం తెలియక మాట్లాడుతున్నావు. నేను అమరావతిలో ఉంటానంటే కుదురుద్దా? ఒక ఊరి పటేల్ మరో ఊరికి మస్కూరు. విజయవాడకు పోయి హైదరాబాద్‌లో ఉండబుద్ది కావడం లేదంటవు. హైదరాబాద్‌లో ఉండి పనిచేయాలంటే విదేశంలో ఉండి పనిచేస్తున్నట్టు ఉందంటవు. వీసా కావాలంటవు. హైదరాబాద్ మీద ప్రేమ ఉంది.. విజయవాడ నుంచి అరగంటలో వస్తనంటవు. కృష్ణా, గోదావరి నుంచి తాగునీరు తెస్తమంటే మాత్రం పంచాయితీ పెడతవ్..’’ అని విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రచారానికి వచ్చి చంద్రబాబు చక్కిలిగింతలు పెట్టాలని చూస్తున్నాడని, ఆయన చేతిలో నెత్తి ఉందా.. కత్తి ఉందా.. ఏమన్నా చేయడానికి అంటూ ఎద్దేవా చేశారు.
 
దత్తాత్రేయ అబద్ధాలాడుతున్నారు
‘‘బీజేపీ, టీడీపీ నేతలు కలసి ప్రచారంలో అవాకులు చవాకులు పేలుతున్నారు. దత్తాత్రేయ అబద్ధాలు అడుతున్నాడు. కేంద్రం ఇచ్చే నిధులతో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నారని అంటున్నాడు. దేశంలో ఎక్కడన్నా ఈ స్కీమ్ ఉందా? బీజేపీ పాలిత గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఉందా..? ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పాలి. నగరంలో నువ్వు కలసి తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న ఏపీలో ఈ స్కీమ్ ఉందా..?’’ అని సీఎం ప్రశ్నించారు. ఇవన్నీ చేస్తామని 2014 ఎన్నికల ముందే మేనిఫెస్టోలో చెప్పామని గుర్తుచేశారు.
 నారాయణ గారూ.. 5న హైదరాబాద్‌లో ఉండకండి
 
 ‘‘నాకో మంచి దోస్తు ఉన్నడు. సీపీఐ నారాయణ. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ ఒంటరిగా మేయర్ పీఠం గెలుచుకుంటే చెవులు కోసుంటా అన్నారు. నారాయణ గారూ.. మీరు ఐదో తేదీన హైదరాబాద్‌లో ఉండకండి. ఎవరన్నా చెవులు కోస్తే మళ్లీ మేమే ఈఎన్‌టీలో ఆపరేషన్ చేయించాలి. ఇదివరకే ఓసారి గాంధీ జయంతిన చికెన్ తిని, తప్పు ఒప్పుకుని ఏడాది పాటు చికెన్‌కు దూరం అయ్యిండు. చెవులు కోసుకోవడం ఏమిటి.. బేల మాటలు కాకుంటే..’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
 ఇదే ముఠా వరంగల్‌కు వచ్చి తొడలు కోసుకుంటా, మెడలు కోసుకుంటా అని సవాలు విసిరారని, కానీ వరంగల్ ప్రజలు దంచుడు దంచితే అడ్రస్ లేకుండా అయ్యారంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఎవరిది కోయాలో.. ఏం కోయాలో ప్రజలు ఫిబ్రవరి 2వ తేదీన డిసైడ్ చేస్తరు..’’ అని వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు, బీజేపీ కలిసి ఏం చేశాయి? రాష్ట్రం ఏర్పడగానే, ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు గుంజుకున్నరు. అందుకోసం ఓటేయాలా? గుంజుకుంది చంద్రబాబు నాయుడైతే, గుంజిచ్చింది వెంకయ్యనాయుడు...’ అంటూ సీఎం చురకలేశారు.
 
 మా వదిన భువనేశ్వరి ఓటు మాకే..
 ‘‘చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండడం లేదు. పాపం.. విజయవాడలో ఉంటండు. ఆయన వ్యాపారమంతా, ఆయన భార్య, మా వదిన భువనేశ్వరి చూస్తంది. ఈయన కంటే ఆమె నయం. ఆమె మంచిగనే చూస్తంది. బాబూ.. నీకు హైదరాబాద్ వదలబుద్ది కాకుంటే పదిహేను రోజులకోసారి రా.. హిస్సాబ్ కింద మూసుకోని పో. ఎవరు వద్దంటరు నిన్ను? నేను గ్యారెంటీగా చెబుతున్న భువనేశ్వరి గారు ఇక్కడనే ఉంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి ఆమె గ్యారెంటీగా మాకే ఓటేస్తది. మా కార్యకకర్త పోయి అడిగితే.. ‘నాకు తెలుసు. నేను హైదరాబాద్‌లో మీకే ఓటేస్తానంది’. నువ్వు ఉంటలేవు కాబట్టి నీకు తెలియడం లేదు. మా ఒదిన మాత్రం మాకే ఓటేస్తది..’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
 
 టీఆర్‌ఎస్ గెలిస్తేనే పనులు జరుగుతాయి..
 రాష్ట్రానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌కు ఎన్నికలు జరుగుతున్నాయని, ఇక్కడ ఉండే అనేక మంది మేధావులు, విద్యావేత్తలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ కోరారు. మన రాష్ట్రం మనకుంటే.. మన నిధులు మనమే వాడుకుని అభివృద్ధి చెందవచ్చని చెప్పాననని, ఈ 18 నెలల కాలంలో అదే రుజువైందని పేర్కొన్నారు. ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తోందని, ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.51 వేలు ఇస్తున్నామని, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని వివరించారు.
 
 పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు డబ్బాలాంటి ఇళ్లు కాకుండా, డబుల్ బెడ్రూం ఇళ్లను దేశంలో ఎక్కడా లేని విధంగా కట్టిస్తున్నామన్నారు. ‘‘హైదరాబాద్‌లో పేదలందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది. కేసీఆర్‌గా, మీ బిడ్డగా చెబుతున్నా. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. బల్దియాలో కాంగ్రెస్, టీడీపీలు అరవై ఏళ్లు ఉన్నాయి. కొత్త పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే. చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషి చేస్తా. హైదరాబాద్‌ను బ్రహ్మాండగా చేస్తా. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తేనే పనులు జరుగుతాయి..’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ కలసి పనిచేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. 18 నెలల కాలంలో వివిధ వర్గాల కోసం 190 సంక్షేమం కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
 
 కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ బాధ్యతలు
 ‘‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతా. కేసీఆర్ మొండోడు. ప్రాణం పోయినా అన్న మాట నెరవేరుస్తా. వంద శాతం అవినీతి లేని, ప్రజలకు దగ్గరగా ఉండే, ప్రజల్లో ఉండి పని చేసే మా అభ్యర్థులను గెలిపించండి ’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నా కొడుకు, మంత్రి కేటీఆర్ ప్రచారాన్ని భుజానికెత్తుకుండు. బాగా తిరిగిండు. సమస్యలను ఆకళింపు చేసుకున్నడు. మున్సిపల్ శాఖ నా దగ్గరే ఉంది. ఆ శాఖను ఆయనకే ఇస్తా. బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం’’ అని అన్నారు.
 
 నా బాధ్యత మరింత పెరుగుతుంది: కేటీఆర్
 మున్సిపల్ శాఖ బాధ్యతను తనకు ఇస్తానని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను సవినయంగా స్వీకరిస్తున్నాని మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గురుతర బాధ్యత అప్పజెప్పిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ వాసిగా, ఓ పౌరుడిగా ఈ శాఖ తన బాధ్యతను మరింతగా పెంచుతుందని అన్నారు. ప్రచారంలో భాగంగా గత మూడు నెలల కాలంలో నగరంలో విస్తృతంగా పర్యటించిన తనకు ప్రజల సమస్యలు, ఆకాంక్షలు తెలిశాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement