- బాబు బెదిరించి భూములు తీసుకుంటున్నారు.
- కేసీఆర్ అభివృద్ధి పేరిట భూములను లాక్కుంటున్నారు.
- టిఆర్‌ఎస్ ప్రభుత్వంది మాటలే చేతల్లేవ్
- ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్‌రాఘవన్.
హిమాయత్‌నగర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెద్ద తేడా ఏమీ లేదని ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్‌రాఘవన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు పేద రైతుల వద్ద నుంచి బెదిరించి భూములను లాక్కుంటుంటే, కేసీఆర్ అభివద్ధిని అరచేతిలో చూపిస్తూ భూములను లాక్కుంటూ పేద ప్రజలను మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్‌రాఘవన్ మాట్లాడుతూ ప్రాజెక్టులు, రీడిజైనింగ్‌లు, సచివాలయాలంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు పేదల వద్ద ఉన్న భూములను అన్యాయంగా లాక్కుంటూ కార్పొరేట్ శక్తులకు అంటగడుతున్నారన్నారు. మల్లన్నసాగర్ బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన కలసి బతిమిలాడి, సభలు నిర్వహించి వారిని ఒప్పించేలా చేయాలే తప్పా వారిని బెదిరించడం సరైంది కాదన్నారు. ఈ భమూల విషయంలో 123జీఓను ప్రభుత్వాలు అనుసరించాలన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని ఎదురించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటూ అభివద్ధిని అదమరుస్తుందన్నారు.
కేవలం మాటలే కాని చేతల్లో ఏ పనినీ చేసి చూపడం లేదన్నారు. ఒక్క రూ.వెయ్యి పించన్ మినహా ఏ ఒక్కటీ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. డబుల్ బెడరూమ్ ఇళ్లు కేసీఆర్ ఫామ్‌హౌస్ ప్రాంతంలో పెలైట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. నిత్యవసర ధరలు, సాగునీరు, త్రాగునీరు తదితర విషయాలపై సభలో కొన్ని తీర్మాలను చేయడం జరిగిందన్నారు. ఆ తీర్మానాలను అనుసరించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు జి.నాగయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.