All India Agricultural Workers Union
-
మోదీ, అమిత్‌షా శాశ్వతం కాదు: విజయరాఘవన్
ఖమ్మం మయూరిసెంటర్: ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న బీజేపీ, చివరకు విపక్షాలు కూడా లేకుండా చేయాలని చూస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు విజయరాఘవన్ మండిపడ్డారు. మోదీ, అమిత్‌షాలు శాశ్వతం కాదని అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవన్ మాట్లాడుతూ బీజేపీ సర్కార్ నిరంకుశ రాజకీయాలు చేస్తూ పార్లమెంట్, అసెంబ్లీ.. తదితర ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. వామపక్షాల పాలన ఉన్నందునే అభివృద్ధి, మానవాభివృద్ధి సూచిలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. వామపక్షాల పాలన ఉండడం వల్ల భూసంస్కరణలు, భూమి పునఃపంపిణీ అక్కడ సాధ్యమైందని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుతున్న తరుణంలోనూ ఆకలి దేశంగా భారతదేశం ఉండటం శోచనీయమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్టీ, ఎస్సీ మహిళలపై ఆకృత్యాలు అధికమయ్యాయని చెప్పారు. ఈ సభల్లో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి.వెంకట్, ఉపాధ్యక్షుడు విక్రమ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు-కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే...
- బాబు బెదిరించి భూములు తీసుకుంటున్నారు. - కేసీఆర్ అభివృద్ధి పేరిట భూములను లాక్కుంటున్నారు. - టిఆర్ఎస్ ప్రభుత్వంది మాటలే చేతల్లేవ్ - ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్‌రాఘవన్. హిమాయత్‌నగర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పెద్ద తేడా ఏమీ లేదని ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్‌రాఘవన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు పేద రైతుల వద్ద నుంచి బెదిరించి భూములను లాక్కుంటుంటే, కేసీఆర్ అభివద్ధిని అరచేతిలో చూపిస్తూ భూములను లాక్కుంటూ పేద ప్రజలను మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్‌రాఘవన్ మాట్లాడుతూ ప్రాజెక్టులు, రీడిజైనింగ్‌లు, సచివాలయాలంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు పేదల వద్ద ఉన్న భూములను అన్యాయంగా లాక్కుంటూ కార్పొరేట్ శక్తులకు అంటగడుతున్నారన్నారు. మల్లన్నసాగర్ బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన కలసి బతిమిలాడి, సభలు నిర్వహించి వారిని ఒప్పించేలా చేయాలే తప్పా వారిని బెదిరించడం సరైంది కాదన్నారు. ఈ భమూల విషయంలో 123జీఓను ప్రభుత్వాలు అనుసరించాలన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని ఎదురించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటూ అభివద్ధిని అదమరుస్తుందన్నారు. కేవలం మాటలే కాని చేతల్లో ఏ పనినీ చేసి చూపడం లేదన్నారు. ఒక్క రూ.వెయ్యి పించన్ మినహా ఏ ఒక్కటీ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. డబుల్ బెడరూమ్ ఇళ్లు కేసీఆర్ ఫామ్‌హౌస్ ప్రాంతంలో పెలైట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. నిత్యవసర ధరలు, సాగునీరు, త్రాగునీరు తదితర విషయాలపై సభలో కొన్ని తీర్మాలను చేయడం జరిగిందన్నారు. ఆ తీర్మానాలను అనుసరించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు జి.నాగయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సరళీకరణతోనే ‘వ్యవసాయ’ సంక్షోభం
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై హన్మకొండ: పాలకులు అవలంబిస్తున్న సరళీకృత విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు వ్యవసాయ కార్మికులు, రైతుల పరిస్థితులను రోజు రోజు దిగజారుస్తున్నాయని, దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో నాలుగు రోజులపాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు శనివారం ముగిశాయి. చివరి రోజు ప్రతినిధుల సభలో రామచంద్రన్ పిళ్లై మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ విజయం.. ఆర్థిక, రాజకీయ రంగాల్లో దేశం మితవాదం వైపు మరలడానికి కారణమైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సరళీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేస్తోందని విమర్శించారు. గత 20 ఏళ్ల కాలంలో ప్రభుత్వాల విధానాలతో భూములు కోల్పోయే రైతుల సంఖ్య పెరుగుతున్నదని, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదన్నారు. చిల్లర వర్తకం, రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, దీంతో బహుళజాతి సంస్థలు విస్తారంగా భూములు కొనుగోలు చేస్తున్నాయన్నారు. దీంతో వ్యవసాయ కార్మికులకు పని లేకుండా పోతుందన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ కార్మికుల కోసం పోరాటలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభ పలు అంశాలపై తీర్మానాలు చేసింది. భూ సంస్కరణల పాలసీ అమలు, అటవీ హక్కుల చట్టాల పటిష్టత, కూలీలకు రక్షణ చట్టం అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. జాతీయ కార్యవర్గం ఎన్నిక.. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా శనివారం సంఘం జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షునిగా తమిళనాడుకు చెందిన ఎస్.తిరువక్కరుసు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా 5వ సారి కేరళకు చెందిన ఎ.విజయరాఘవన్ తిరిగి ఎన్నికయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ప్రతినిధుల సభలో పలు ఆంశాలపై తీర్మానాలు చేశారు. భూ సంస్కరణలు వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మిక సంఘాలతో చర్చించి భూసంస్కరణల పాలసీ ముసాయిదాను అమలు చేయాలని, ల్యాండ్ యుటిలైజేషన్ పాలసీని అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తీర్మానించారు. -
పాలకుల విధానాలతోనే అసమానతలు
ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ వరంగల్: ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల సమాజ ంలో అసమానతలు పెరిగిపోతున్నాయని ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన ఐదు దశాబ్దాల కంటే.. ఈ రెండు దశాబ్దాల్లోనే ఇది మరింత వేగం పుంజుకున్నదన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభల సందర్భంగా హన్మకొండలో శుక్రవారం రాత్రి ‘వ్యవసాయరంగం- ప్రపంచీకరణ’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన ప్రసంగించారు. ప్రజల నుంచి నీటిని దొంగిలించే కుట్రలు సాగుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు.. ఆయకట్టు పెంచేందుకు కాదని, అక్కడ పరిశ్రమల ఏర్పాటు, సెజ్‌ల నిర్మాణం సాగుతుందన్నారు. రానున్న రోజుల్లో మంచినీరు ఒక మార్కెట్‌గా మారనున్నదన్నారు. సామాన్యునికి భద్రత కరువు: షీలాభల్లా దేశంలో సామాన్యుని జీవనానికి భద్రత కరువైందని వ్యవసాయ శాస్త్రవేత్త షీలాభల్లా ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో స్థూల ఉత్పత్తి పెరుగుతున్నా ఉపాధి అవకాశాలు పెరగడంలేదన్నారు. దళితులకు ప్రపంచీకరణ చేటు: రాఘవులు ప్రపంచీకరణ ఫలితంగా దళితులు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడంతో ప్రైవేటీకరణ పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో ప్రభుత్వ భూమి ఉండకపోవచ్చన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ఒకే వర్గానికి చెందిన వారన్నారు. -
గుజరాత్ మోడల్ కు వ్యతిరేకం
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవన్ వరంగల్: దేశమంతా ఊదరకొడుతున్న గుజరాత్ మోడల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ అన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభలు హన్మకొండలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు శుక్రవారం జరిగిన ప్రతినిధుల సభలో చర్చలు, తీర్మానాలను ఆయన విలేకరులకు వివరించారు. గుజరాత్లో 10 లక్షల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కేటాయించారని ఆరోపించారు. వ్యతిరేకించిన రైతులను అణచివేశారని అన్నారు. దేశంలో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని, ఈ క్రమంలోనే వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతుందన్నారు. 2001లో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది వ్యవసాయ కార్మికులుంటే ప్రస్తుతం ఈ సంఖ్య 16 కోట్లకు చేరుకుందన్నారు. భూమిని వ్యాపారంగా మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ పాల్గొన్నారు.