సరళీకరణతోనే ‘వ్యవసాయ’ సంక్షోభం
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై
హన్మకొండ: పాలకులు అవలంబిస్తున్న సరళీకృత విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు వ్యవసాయ కార్మికులు, రైతుల పరిస్థితులను రోజు రోజు దిగజారుస్తున్నాయని, దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో నాలుగు రోజులపాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు శనివారం ముగిశాయి.
చివరి రోజు ప్రతినిధుల సభలో రామచంద్రన్ పిళ్లై మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ విజయం.. ఆర్థిక, రాజకీయ రంగాల్లో దేశం మితవాదం వైపు మరలడానికి కారణమైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సరళీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేస్తోందని విమర్శించారు. గత 20 ఏళ్ల కాలంలో ప్రభుత్వాల విధానాలతో భూములు కోల్పోయే రైతుల సంఖ్య పెరుగుతున్నదని, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదన్నారు.
చిల్లర వర్తకం, రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, దీంతో బహుళజాతి సంస్థలు విస్తారంగా భూములు కొనుగోలు చేస్తున్నాయన్నారు. దీంతో వ్యవసాయ కార్మికులకు పని లేకుండా పోతుందన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ కార్మికుల కోసం పోరాటలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభ పలు అంశాలపై తీర్మానాలు చేసింది. భూ సంస్కరణల పాలసీ అమలు, అటవీ హక్కుల చట్టాల పటిష్టత, కూలీలకు రక్షణ చట్టం అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరింది.
జాతీయ కార్యవర్గం ఎన్నిక..
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా శనివారం సంఘం జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షునిగా తమిళనాడుకు చెందిన ఎస్.తిరువక్కరుసు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా 5వ సారి కేరళకు చెందిన ఎ.విజయరాఘవన్ తిరిగి ఎన్నికయ్యారు.
మూడు రోజుల పాటు జరిగిన ప్రతినిధుల సభలో పలు ఆంశాలపై తీర్మానాలు చేశారు. భూ సంస్కరణలు వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మిక సంఘాలతో చర్చించి భూసంస్కరణల పాలసీ ముసాయిదాను అమలు చేయాలని, ల్యాండ్ యుటిలైజేషన్ పాలసీని అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తీర్మానించారు.