Ramachandran Pillai
-
సీపీఎం సారథిగా ఏచూరి
లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కూడగడదాం విశాఖలో ముగిసిన సీపీఎం జాతీయ మహాసభలు విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కొంతకాలంగా సీపీఎంలో సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తొలుత ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో నిలిచిన కేరళ నేత రామచంద్రన్ పిళ్లై.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో ఏచూరి ఎన్నిక ఏకగ్రీవమైంది. గత 6 రోజులుగా విశాఖలో జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభల ముగింపు రోజైన ఆదివారం పార్టీ నూతన కార్యవర్గాన్ని.. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న ప్రకాశ్ కారత్ ప్రకటించారు. 91 మందితో నూతన కేంద్ర కమిటీ(సీసీ)ని, 16 మందితో పొలిట్‌బ్యూరో(పీబీ)ను మహాసభ ఎన్నుకున్నట్టు తెలిపారు. సీసీలో 17 మంది, పీబీలో నలుగురు కొత్తవారికి చోటు కల్పించారు. పొలిట్‌బ్యూరోలో ఏపీ, తెలంగాణల ప్రతినిధిగా బీవీ రాఘవులు కొనసాగుతారు. మరో ఐదుగురు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. సీనియర్ నేత సుకుమల్సేన్ పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా ఉంటారు. మైనారిటీలు, మహిళలకు కూడా.. పార్టీ నాయకత్వ స్థానాల్లోకి మహిళలను, మైనా రిటీలను, ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని తీర్మానించినప్పటికీ దళితవర్గాలకు పొలిట్‌బ్యూరోలో చోటు లభించలేదు. మైనారిటీలకు, ఓ మహిళకు మాత్రం స్థానం దక్కింది. కేంద్ర కమిటీలో కొంతమంది బీసీలకు చోటు కల్పించారు. వీరిలో తెలంగాణ నుంచి ఎన్నికయిన చెరుపల్లి సీతారాములు ఒకరు. ముగిసిన మహాసభలు ఆరు రోజులు, 12 సెషన్లు, 40 గంటల చర్చోపచర్చలు, 812 మంది ప్రతినిధులు, 26 తీర్మానాలు, కొత్త కార్యవర్గం ఎంపిక అనంతరం పార్టీ 21వ జాతీయ మహాసభలు ఆదివారమిక్కడ ముగిశాయి. పార్టీకి రాబోయే కాలంలో దిశానిర్దేశం కల్పించే రాజకీయ, ఎత్తుగడల పంథాను, వచ్చే మూడేళ్ల కాలానికి రాజకీయ విధానాన్నీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల దిద్దుబాటుకు త్వరలో ప్రత్యేక ప్లీనంను నిర్వహించాలన్న కీలక నిర్ణయాలతో మహాసభలు ముగిసినట్టు రామచంద్రన్ పిళ్లై ప్రకటించారు. పొలిట్‌బ్యూరో సభ్యులు వీరే సీతారాం ఏచూరి(ప్రధాన కార్యదర్శి), ప్రకాశ్ కారత్, ఎస్.రామచంద్రన్ పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్(త్రిపుర సీఎం), పినరాయి విజయన్, బీవీ రాఘవులు, బృందా కారత్, కొడియేరి బాలకృష్ణన్, ఏంఏ బేబీ, సూర్యకాంత్ మిశ్రా, ఏకే పద్మనాభన్, హన్నన్ మొల్లా, మహమ్మద్ సలీం, సుభాషిణీ అలీ, జి.రామకృష్ణన్. కేంద్ర కమిటీ నుంచి తప్పించిన కురువృద్ధులు (వీరు ఆహ్వానితులుగా ఉంటారు) అచ్యుతానందన్ (కేరళ మాజీ సీఎం) బుద్ధదేవ్ భట్టాచార్య (బెంగాల్ మాజీ సీఎం) మల్లు స్వరాజ్యం (తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు) మహమ్మద్ అమీన్ కేంద్ర కమిటీలో తెలుగువారు వీరే.. ఏపీ నుంచి: పెనుమల్లి మధు, పాటూరి రామయ్య, ఎంఎ గఫూర్, సుంకర పుణ్యవతి. తెలంగాణ నుంచి: తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు. కేంద్ర కమిటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రతినిధి: బీవీ రాఘవులు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు, దేశ సమగ్రతకు భంగకరంగా మారిన మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడదాం. దీనికిగాను లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కూడగడదాం. నూతన భారతాన్ని నిర్మిద్దాం. అందుకోసం సీపీఎంను బలపరచండి’ అని సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మతోన్మాద, విధ్వంసకర రాజకీయాలను సీపీఎం ఎర్రజెండా అడ్డుకుని తీరుతుం దని ఉద్ఘాటించారు. ఈ మేరకు సీపీఎం 21వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా విశాఖ ఆర్కేబీచ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఏచూరి ప్రసంగించారు. చరిత్రాత్మక సీపీఎం మహాసభలతో విశాఖ తీరాన కొత్త ఉద్యమ స్ఫూర్తి ఉదయించిందని ఏచూరి చెప్పారు. ‘ఘర్‌వాపసీ’, ‘లవ్‌జీహాద్’, చర్చిలపై దాడులు తదితర ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత రాజకీయాలతో దేశ సమగ్రతకు బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్నం కలిగిస్తోందని నిప్పులు చెరిగారు. రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజుకుని.. కార్పొరేట్ పెద్దలకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నిందన్నారు. ఫాన్స్ నుంచి రూ.8 వేల కోట్లతో యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలన్న మోదీ నిర్ణయం విదేశీ కంపెనీలకే ప్రయోజనకరమని విమర్శించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ స్థానంలో ‘మేక్ ఫర్ ఇండియా’ విధానం కావాలని ఏచూరి డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం సామాన్యులపై పన్ను భారాలు మోపుతోందని ఆరోపించారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఉద్యమపథం సాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. వచ్చే 6 మాసాల్లో ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఎర్రజెండాకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఉద్యమాలతో బుద్ధి చెబుదాం: కారత్, పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్రంలోని బీజేపీ, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి ఉద్యమిద్దాం. తద్వారా ఆయా ప్రభుత్వాలకు బుద్ధి చెబుదాం. దీనికిగాను సీపీఎం తన బలాన్ని మరింత పటిష్టపరుచుకోనుంది. బహిరంగ సభలో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు, సీిపీఎం ఏపీ కార్యదర్శి మధు ప్రసంగించారు. -
వ్యవసాయ కార్మికులకు పని భద్రత కల్పించాలి
హన్మకొండ సిటీ : వ్యవసాయ కార్మికులకు నిరంతరం ఆదాయం వచ్చేలా పని భద్రత కల్పించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మికులను సంఘటితం చేసి పోరాటా లు చేపట్టాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మికుల సమస్యలు, హక్కుల కోసం ఇతర సంఘాలతో కలిసి పోరాడాలన్నారు. వరంగల్, హన్మకొండలో నాలుగు రోజులపాటు జరిగిన అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు శనివారం ముగిశాయి. చివరి రోజు సభలో రామచంద్రన్ పిళ్లైముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత సమాజంలో వివిధ కులాలు, మతాల్లో నయా ధనికులు పుట్టుకొచ్చి మూఢనమ్మకాలు, కాలం చెల్లిన ఆచార వ్యవహారాలు ముందుకు తీసుకొస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని నీరుగారుస్తున్నారని, దీనిని వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు తిప్పికొట్టాలని చెప్పారు. ప్రజలను చైతన్య వంతులను చేసి వ్యవసాయ కార్మికుల కు పదునైన ఆయుధంగా ప్రజల్లో ఉండాల న్నారు. వ్యవసాయ కార్మికులకు ఇచ్చే కూలి రేట్లు తక్కువగా ఉంటున్నాయని, మహిళలు, పురుషుల వేతానాల్లో వ్యత్యాసాలు కనపడుతున్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పరిహారం ఇవ్వడం లేదని, దీంతో బాధితులకు రుణభారం పెరుగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు. పని రోజులు తగ్గిపోవడంతో వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు ఆహార భద్రత లేదని, వారి పిల్లలకు విద్యావకాశాలు లేకుండా పోయాయన్నారు. కార్మికుల పిల్లలు కార్మికులుగా మారే దుస్థితి పాలకుల వైఫల్యాలతో కలుగుతోందని విమర్శించారు. అనంతరం సంఘం నూతన జాతీయ కమిటీని ఎన్నుకోవడంతోపాటు పలు తీర్మానాలు అమోదించారు. మహాసభ బులెటిన్‌ను నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పాటూరి రామయ్య, ఎం.వి.గోవిందరాజన్, బానులాల్ సాహ్, గుర్మేశ్సింగ్, సుభాషిణీ అలీ, జాయింట్ కార్యదర్శులు సునీత్ చోప్రా, కుమార్ షిరాల్కర్, బి.వెంకట్, సారంగధర్ పాశ్వాన్, బ్రిజిలాల్ భారతి, కార్యదర్శి వర్గ సభ్యులు బి.రాఘవన్, పి.మురళీకృష్ణ, కె.కోమలకుమారి, నాయకులు జి.నాగయ్య, నాగేశ్వర్రావు, రవి, మెట్టు శ్రీనివాస్, సూడి కృష్ణారెడ్డి, సీహెచ్.రంగయ్య, ప్రభాకర్‌రెడ్డి, సారంపల్లి వాసుదేవరెడ్డి, ఉపేందర్, ఉప్పలయ్య, యాదానాయక్, చుక్కయ్య, సంపత్ పాల్గొన్నారు. బాధ్యతతో పని చేస్తా.. అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడిగా బాధ్యత ఎరిగి పని చేస్తా. దేశంలో పాలకవర్గాలు వ్యవసాయ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో ఆకట్టుకుంటున్నాయి. తరువాత డబ్బులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నామంటూ నిట్టూరుస్తున్నాయి. డబ్బులతో వ్యవసాయ కార్మికులకు ఆర్థిక వనరులు సమకూరుస్తే వారు సొంత కాళ్లపై నిలబడుతారు. స్వశక్తితో ఎదుగుతారు. వ్యవసాయ కార్మికులందరినీ సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాం. తెలంగాణ కమిటీ మహాసభలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభలను విజయవంతం చేసిన ఏపీ, తెలంగాణ కమిటీలకు అభినందనలు. -నూతన అధ్యక్షుడు తిరువక్కరుస్ కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలి వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు ప్రజలతో మమేకమై వ్యవసాయ కార్మికులను చైతన్య వంతులుగా తయారు చేయాలి. నాయకులు అనేవారు ప్రజల మధ్య ఉన్నపుడే గుర్తింపు ఉంటుంది. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం ఒక్కటే మార్గం. మహాసభలు చూపించిన మార్గంలో నడుస్తాం. పాలకుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించేలా పోరాటాలు నిర్వహిస్తాం. రాష్ట్ర విభజన జరుగకముందు ఇక్కడ జాతీయ మహాసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఏపీ, తెలంగాణ శాఖలు మహాసభలను విజయవంతం చేశాయి. - విజయరాఘవన్, జాతీయ ప్రధాన కార్యదర్శి -
సరళీకరణతోనే ‘వ్యవసాయ’ సంక్షోభం
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై హన్మకొండ: పాలకులు అవలంబిస్తున్న సరళీకృత విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు వ్యవసాయ కార్మికులు, రైతుల పరిస్థితులను రోజు రోజు దిగజారుస్తున్నాయని, దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో నాలుగు రోజులపాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు శనివారం ముగిశాయి. చివరి రోజు ప్రతినిధుల సభలో రామచంద్రన్ పిళ్లై మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ విజయం.. ఆర్థిక, రాజకీయ రంగాల్లో దేశం మితవాదం వైపు మరలడానికి కారణమైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సరళీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేస్తోందని విమర్శించారు. గత 20 ఏళ్ల కాలంలో ప్రభుత్వాల విధానాలతో భూములు కోల్పోయే రైతుల సంఖ్య పెరుగుతున్నదని, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదన్నారు. చిల్లర వర్తకం, రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, దీంతో బహుళజాతి సంస్థలు విస్తారంగా భూములు కొనుగోలు చేస్తున్నాయన్నారు. దీంతో వ్యవసాయ కార్మికులకు పని లేకుండా పోతుందన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ కార్మికుల కోసం పోరాటలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభ పలు అంశాలపై తీర్మానాలు చేసింది. భూ సంస్కరణల పాలసీ అమలు, అటవీ హక్కుల చట్టాల పటిష్టత, కూలీలకు రక్షణ చట్టం అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. జాతీయ కార్యవర్గం ఎన్నిక.. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా శనివారం సంఘం జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షునిగా తమిళనాడుకు చెందిన ఎస్.తిరువక్కరుసు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా 5వ సారి కేరళకు చెందిన ఎ.విజయరాఘవన్ తిరిగి ఎన్నికయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ప్రతినిధుల సభలో పలు ఆంశాలపై తీర్మానాలు చేశారు. భూ సంస్కరణలు వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మిక సంఘాలతో చర్చించి భూసంస్కరణల పాలసీ ముసాయిదాను అమలు చేయాలని, ల్యాండ్ యుటిలైజేషన్ పాలసీని అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తీర్మానించారు.