సీపీఎం సారథిగా ఏచూరి | seetaram yechuri is elected as CPM national general secretary | Sakshi
Sakshi News home page

సీపీఎం సారథిగా ఏచూరి

Published Mon, Apr 20 2015 1:50 AM | Last Updated on Mon, Aug 13 2018 9:04 PM

సీపీఎం సారథిగా ఏచూరి - Sakshi

సీపీఎం సారథిగా ఏచూరి

  • లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కూడగడదాం
  •  విశాఖలో ముగిసిన సీపీఎం జాతీయ మహాసభలు
  • విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కొంతకాలంగా సీపీఎంలో సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తొలుత ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో నిలిచిన కేరళ నేత రామచంద్రన్ పిళ్లై.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో ఏచూరి ఎన్నిక ఏకగ్రీవమైంది. గత 6 రోజులుగా విశాఖలో జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభల ముగింపు రోజైన ఆదివారం పార్టీ నూతన కార్యవర్గాన్ని.. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న ప్రకాశ్ కారత్ ప్రకటించారు. 91 మందితో నూతన కేంద్ర కమిటీ(సీసీ)ని, 16 మందితో పొలిట్‌బ్యూరో(పీబీ)ను మహాసభ ఎన్నుకున్నట్టు తెలిపారు. సీసీలో 17 మంది, పీబీలో నలుగురు కొత్తవారికి చోటు కల్పించారు. పొలిట్‌బ్యూరోలో ఏపీ, తెలంగాణల ప్రతినిధిగా బీవీ రాఘవులు కొనసాగుతారు. మరో ఐదుగురు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. సీనియర్ నేత సుకుమల్‌సేన్ పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా ఉంటారు.
     
     మైనారిటీలు, మహిళలకు కూడా..
     పార్టీ నాయకత్వ స్థానాల్లోకి మహిళలను, మైనా రిటీలను, ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని తీర్మానించినప్పటికీ దళితవర్గాలకు పొలిట్‌బ్యూరోలో చోటు లభించలేదు. మైనారిటీలకు, ఓ మహిళకు మాత్రం స్థానం దక్కింది. కేంద్ర కమిటీలో కొంతమంది బీసీలకు చోటు కల్పించారు. వీరిలో తెలంగాణ నుంచి ఎన్నికయిన చెరుపల్లి సీతారాములు ఒకరు.
     
     ముగిసిన మహాసభలు
     ఆరు రోజులు, 12 సెషన్లు, 40 గంటల చర్చోపచర్చలు, 812 మంది ప్రతినిధులు, 26 తీర్మానాలు, కొత్త కార్యవర్గం ఎంపిక అనంతరం పార్టీ 21వ జాతీయ మహాసభలు ఆదివారమిక్కడ ముగిశాయి. పార్టీకి రాబోయే కాలంలో దిశానిర్దేశం కల్పించే రాజకీయ, ఎత్తుగడల పంథాను, వచ్చే మూడేళ్ల కాలానికి రాజకీయ విధానాన్నీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల దిద్దుబాటుకు త్వరలో ప్రత్యేక ప్లీనంను నిర్వహించాలన్న కీలక నిర్ణయాలతో మహాసభలు ముగిసినట్టు రామచంద్రన్ పిళ్లై ప్రకటించారు.  
     
     పొలిట్‌బ్యూరో సభ్యులు వీరే
     సీతారాం ఏచూరి(ప్రధాన కార్యదర్శి), ప్రకాశ్ కారత్, ఎస్.రామచంద్రన్ పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్(త్రిపుర సీఎం), పినరాయి విజయన్, బీవీ రాఘవులు, బృందా కారత్, కొడియేరి బాలకృష్ణన్, ఏంఏ బేబీ, సూర్యకాంత్ మిశ్రా, ఏకే పద్మనాభన్, హన్నన్ మొల్లా, మహమ్మద్ సలీం, సుభాషిణీ అలీ, జి.రామకృష్ణన్.
     
     కేంద్ర కమిటీ నుంచి తప్పించిన కురువృద్ధులు (వీరు ఆహ్వానితులుగా ఉంటారు)

    •  అచ్యుతానందన్ (కేరళ మాజీ సీఎం)
    •  బుద్ధదేవ్ భట్టాచార్య (బెంగాల్ మాజీ సీఎం)
    •  మల్లు స్వరాజ్యం (తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు)
    •  మహమ్మద్ అమీన్

     
     కేంద్ర కమిటీలో తెలుగువారు వీరే..
     ఏపీ నుంచి: పెనుమల్లి మధు, పాటూరి రామయ్య, ఎంఎ గఫూర్, సుంకర పుణ్యవతి.
     తెలంగాణ నుంచి: తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు.
     కేంద్ర కమిటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రతినిధి: బీవీ రాఘవులు
     
     సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు, దేశ సమగ్రతకు భంగకరంగా మారిన మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడదాం. దీనికిగాను లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కూడగడదాం. నూతన భారతాన్ని నిర్మిద్దాం. అందుకోసం సీపీఎంను బలపరచండి’ అని సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మతోన్మాద, విధ్వంసకర రాజకీయాలను సీపీఎం ఎర్రజెండా అడ్డుకుని తీరుతుం దని ఉద్ఘాటించారు. ఈ మేరకు సీపీఎం 21వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా విశాఖ ఆర్కేబీచ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఏచూరి ప్రసంగించారు.

    •  చరిత్రాత్మక సీపీఎం మహాసభలతో విశాఖ తీరాన కొత్త ఉద్యమ స్ఫూర్తి ఉదయించిందని ఏచూరి చెప్పారు. ‘ఘర్‌వాపసీ’, ‘లవ్‌జీహాద్’, చర్చిలపై దాడులు తదితర ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత రాజకీయాలతో దేశ సమగ్రతకు బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్నం కలిగిస్తోందని నిప్పులు చెరిగారు. రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజుకుని.. కార్పొరేట్ పెద్దలకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నిందన్నారు.
    • ఫాన్స్ నుంచి రూ.8 వేల కోట్లతో యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలన్న మోదీ నిర్ణయం విదేశీ కంపెనీలకే ప్రయోజనకరమని విమర్శించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ స్థానంలో ‘మేక్ ఫర్ ఇండియా’ విధానం కావాలని ఏచూరి డిమాండ్ చేశారు.
    •  బడా కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం సామాన్యులపై పన్ను భారాలు మోపుతోందని ఆరోపించారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఉద్యమపథం సాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. వచ్చే 6 మాసాల్లో ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఎర్రజెండాకు పూర్వవైభవం తెస్తామన్నారు.

     
     ఉద్యమాలతో బుద్ధి చెబుదాం: కారత్, పొలిట్ బ్యూరో సభ్యుడు
     కేంద్రంలోని బీజేపీ, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి ఉద్యమిద్దాం. తద్వారా ఆయా ప్రభుత్వాలకు బుద్ధి చెబుదాం. దీనికిగాను సీపీఎం తన బలాన్ని మరింత పటిష్టపరుచుకోనుంది.
     బహిరంగ సభలో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు, సీిపీఎం ఏపీ కార్యదర్శి మధు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement