seetaram yechuri
-
సీతారాం ఏచూరి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఏచూరి పట్ల వైఎస్ జగన్..జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయ స్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనబర్చారని గుర్తు చేశారు. సీపీఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి, పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పోలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారు. ఏచూరి మృతి, దేశ రాజకీయాల్లో తీరని లోటని అన్నారు. ఇది కూడా చదవండి: వామపక్ష దిగ్గజ నేత ఏచూరి రాజకీయ ప్రస్థానం ఇలా.. -
‘ప్రధాని’ ఆసక్తి లేదు: నితీశ్
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ మంగళవారం ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాంలతో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం దేశ రాజధానికి చేరుకోవడం తెలిసిందే. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే వారితో సమావేశమైనట్టు అనంతరం నితీశ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై విపక్షాల సమష్టి శక్తిని చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతరం సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్ యాదవ్, పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా తదితరులను కూడా నితీశ్ కలిశారు. తనకు ప్రధాని కావాలని ఉందన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘‘ఆ పదవికి నేను పోటీదారు కాను. దానిపై నాకు ఆసక్తీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. విపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తమ తొలి అజెండా తప్ప ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం కాదని ఏచూరి చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు తేలుతుందన్నారు. బీజేపీపై పోరులో నితీశ్ కలిసి రావడం దేశ రాజకీయాలకు గొప్ప శుభ సంకేతమని అభిప్రాయపడ్డారు. నితీశ్, కేజ్రీవాల్ భేటీ గంటన్నర పాటు సాగింది. విద్య, వైద్యం తదితర అంశాలతో పాటు ఆపరేషన్ లోటస్, విపక్షాల ఎమ్మెల్యేల కొనుగోలు తదితరాలపై చర్చించినట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం బీజేపీపై పోరాటానికి వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని రాజా అన్నారు. సోమవారం రాహుల్‌గాంధీతోనూ నితీశ్ భేటీ కావడం తెలిసిందే. 25న ‘బల ప్రదర్శన’ ర్యాలీ నితీశ్, కేసీఆర్, మమత హాజరు! సెప్టెంబర్ 25న హరియాణాలో ఐఎన్ఎల్డీ తలపెట్టిన ర్యాలీని విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మార్చాలని నితీశ్ భావిస్తున్నారు. దానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్ తదితరులను ఐఎన్ఎల్డీ ఆహ్వానించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తదితరులకు కూడా ఆహ్వానాలు పంపుతామని పేర్కొంది. ఈ ర్యాలీలో విపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పలు అంశాలపై లోతుగా చర్చిస్తారని చెప్పుకొచ్చింది. బీజేపీతో జనం విసిగిపోయారని చౌతాలా అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా కన్పిస్తోందని చెప్పారు. -
కనీస వేతనం 18వేలు చేస్తాం
న్యూఢిల్లీ: కనీస వేతనం నెలకు రూ.18 వేలు ఉండేలా చట్టం, పౌరులపై ప్రభుత్వ సంస్థల నిఘా ఎత్తివేత, టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట. ఇవీ సీపీఎం మేనిఫెస్టోలో ప్రధానాంశాలు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు గాను గురువారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పౌరుల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ఐటీ చట్టంలోని 69వ సెక్షన్‌ను తొలగిస్తుందని ఏచూరి తెలిపారు. ‘పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా/ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడకుండా నివారిస్తాం. ఆధార్, బయో మెట్రిక్ సమాచారాన్ని సంక్షేమ పథకాలకు వినియోగించుకోవటాన్ని నిలిపివేస్తాం. రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా హక్కు కల్పిస్తాం’ అని తెలిపారు. కొన్ని టెలికం సంస్థల గుత్తాధిపత్య ధోరణిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నెలకు రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఉండేలా చట్టం చేస్తామని తెలిపారు. ప్రజా పంపిణీ విధానం ద్వారా కుటుంబానికి నెలకు 35 కేజీల ఆహార ధాన్యాలు అందించటంతోపాటు వృద్ధాప్య పింఛను రూ.6 వేలకు పెంచుతామన్నారు. ఎలక్టోరల్ బాండ్లకు బదులు అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించేలా చట్టం చేస్తామన్నారు. -
ఎన్నికల ప్రచారానికి సురవరం, ఏచూరి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చేనెల మొదటివారంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల పొత్తుల్లో భాగంగా భువనగిరి, మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి సీపీఐ, నల్లగొండ, ఖమ్మంల నుంచి సీపీఎం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నాలుగు స్థానాల్లో ఇరుపార్టీలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయా సభల్లో రెండు పార్టీల నాయకులు పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. 1, 2 తేదీల్లో సురవరం సభలు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఏప్రిల్ 1న భువనగిరిలో, 2న మహబూబాబాద్‌లో నిర్వహించే ఎన్నికల బహిరంగసభల్లో పాల్గొంటారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు వచ్చే నెల మొదటివారంలో ప్రచారం నిర్వహించనున్నారు. వచ్చేనెల 4న బహుజన్ సమాజ్‌పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి, జనసేన నేత పవన్‌కల్యాణ్‌ల ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించే అవకాశాలున్నాయి. సీపీఐ, సీపీఎం పోటీ చేయని స్థానాల్లో జనసేన, బీఎస్పీ, ఎంసీపీఐ(యూ), బీఎల్పీ, ఎంబీటీలకు మద్దతునివ్వాలని సీపీఎం నిర్ణయించగా, జనసేన, బీఎస్పీ, బీఎల్పీ వంటి పార్టీలకు మద్దతునిచ్చే విషయాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి సమావేశాలు... తాము పోటీ చేసే నాలుగు స్థానాల్లో మెరుగైన రీతిలో పరస్పరం సహకరించుకునేందుకు సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా లోక్‌సభ నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ నెల 27న ఖమ్మంలో, 28న మహబూబాబాద్‌లో నిర్వహించనున్న సమావేశాల్లో ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుల నుంచి మండల కమిటీ సభ్యుల వరకు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న నల్లగొండ, 31న భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సంయుక్త సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆయా లోక్‌సభ సీట్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు, మండలాల్లో కూడా రెండుపార్టీల సంయుక్త సమావేశాలు నిర్వహించనున్నారు. -
దేశాన్ని దోచుకుంటున్నారు
సాక్షి, మహబూబాబాద్/కారేపల్లి: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కలసి దేశాన్ని దోచుకుంటున్నారని, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా కారేపల్లి, మహబూ బాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం, బీఎల్ఎఫ్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మతోన్మాద రాజకీయాలను పెంచింది మోదీ యేనని, కేవలం ఓటు బ్యాంకు కోసమే హిందూవాదంతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల దేశ ఐక్యతకు పెను ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ కూడా మతోన్మాదాన్ని సమర్థించడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఆర్థిక దోపిడీ పెరిగిందని అన్నారు. బీఎల్ఎఫ్ అభ్యర్థి బానోత్ మోహన్‌లాల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని పిలుపునిచ్చారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, అబద్ధాల కోరు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. సోనియాను తెలంగాణ తల్లి అని ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చార్జీలు చేసి, కేసులు పెట్టారని మండిపడ్డారు. టీజేఎస్, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు, గద్దర్, మందకృష్ణ మాదిగ కలసి ఊరేగుతున్నారని, కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందని వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. దేశం చూపు తెలంగాణవైపు.. దేశవ్యాప్తంగా ఖమ్మంకు ఎర్ర జిల్లాగా గుర్తింపు ఉందని, ఇక్కడి ఫలితాలు తెలంగాణలోనే కాక.. దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతాయని కారేపల్లి సభలో సీతారాం ఏచూరి అన్నారు. దేశమంతా తెలంగాణ ఎన్నికల వైపు చూస్తోందని, ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైరా నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రంను అత్యధిక మెజా ర్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమయ్య తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తో ఒప్పందంపై పీటముడి
న్యూఢిల్లీ: బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్‌తో రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవాలా? వద్దా? అన్న విషయంపై ఏకాభిప్రాయానికి రాకుండానే సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన రెండు అంశాలపై చర్చలు జరిగాయి. 22వ సీపీఎం జాతీయ మహాసభల్లో చర్చించాల్సిన పలు అంశాలపై ఓ ముసాయిదాను కూడా రూపొందించారు. కాంగ్రెస్‌తో ఎన్నికల ఒప్పందమేదీ ఉండకూడదనీ, అయితే మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేసేందుకు అన్ని వామపక్షేతర పార్టీల సహకారాన్ని తీసుకోవాలని ఏచూరి సూచించారు. దీనిని కారత్ వర్గం వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌తో రాజకీయ ఒప్పందం ఉండనప్పటికీ, ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయపార్టీలతో సీపీఎం కలసి నడవాలనేది కారత్ సూచన. ఇది అసాధ్యమని ఏచూరి వర్గం వాదిస్తోంది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముసాయిదాను పార్టీ కేంద్ర కమిటీ ముందు ఉంచనున్నారు. కేంద్ర కమిటీ జనవరి 19 నుంచి 21 వరకు మూడురోజులపాటు కోల్‌కతాలో సమావేశమై చర్చలు జరపనుంది. కాగా కాంగ్రెస్ పార్టీపై కారత్ విరుచుకుపడ్డారు. 1992లో బాబ్రీ మసీదు కూలిపోతుంటే నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆపడానికి ప్రయత్నం కూడా చేయలేదనీ, కాంగ్రెస్ బయటకు మాత్రమే లౌకికవాద పార్టీ కానీ లోపల కాదని ఆయన ఆరోపించారు. -
నోట్ల రద్దు, జీఎస్టీతో అన్ని రంగాలు కుదేలు
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగపల్లి ఆర్టీసీ కల్యాణమండపంలో గురువారం సీపీఎం 22వ జాతీయ మహా సభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం జరిగింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి, వ్యాపారానికి అనుకూలంగా ఉందని ఓ ఏజెన్సీ చెప్పడంతో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక చాలా మంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. రైల్వే వంటి సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే సీపీఎం జాతీయ మహాసభలు ప్రత్యామ్నాయ రాజకీయాలకు దశ, దిశ చూపించాలని పేర్కొన్నారు. కేంద్రం ఎన్నికల సంఘం, సీబీఐని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 22వ జాతీయ మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా బీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం, కోశాధికారి వెంకట్‌ను నియమించారు. వైస్ చైర్మన్లుగా మల్లు స్వరాజ్యం, మధు, పాటూరు రామయ్య, వి.శ్రీనివాస్‌రావు, హేమలత, చెరుపల్లి సీతారాములు, చుక్కా రాములు, సున్నం రాజయ్య, నంద్యాల నరసింహారెడ్డి నియమితులయ్యారు. -
22వ ఏట నుంచే ‘ఎర్ర’కోటలోకి!
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీతారాం ఏచూరి తన 22వ సంవత్సరంలోనే కమ్యూనిస్టుల కోటలోకి అడుగుపెట్టారు. అప్పగించిన ప్రతి బాధ్యతను ఎంతో క్రమశిక్షణతో నిర్వహించి అనతికాలంలోనే పార్టీలో ప్రముఖుల గుర్తింపు పొందారు. 1974లో సీపీఎం అనుబంధ భారత విద్యార్థి సమాఖ్య(ఎన్ఎఫ్ఐ)లో చేరిన సీతారాం ఆ తర్వాత వెనుదిరిగి చూసిందిలేదు. ఏడాదిలోపే సీపీఎంలో చేరారు. అయితే, 1975నాటి ఎమర్జెన్సీ సమయంలో జైలు పాలయ్యారు. దీనికి ముందు కొన్నాళ్లు అజ్ఞాత జీవితం గడిపారు. అనంతరం జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతగా, 1978లో ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగా, తర్వాత ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా తనదైన ముద్రవేశారు. 1985లో జరిగిన 12వ మహాసభలో సీపీఎం కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1988లో కేంద్ర కార్యదర్శివర్గ సభ్యునిగా, 1992నాటి 14వ మహాసభలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. 2017 చివరినాటికి ఏచూరి రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుంది. ఏచూరి మంచి కాలమిస్టు. దాదాపు 20 పుస్తకాలు రాశారు. ‘హిందుస్తాన్ టైమ్స్’లో పలు సమస్యలపై అనేక వ్యాసాలు రాశారు. పలు దేశాల్లో పర్యటించారు. కార్మిక వర్గ ప్రయోజనాలను రాజ్యసభలో ఎలుగెత్తి చాటడంలో తనకుతానే సాటిగా నిలిచిన ఉత్తమ కామ్రేడ్ ఏచూరి. ఏచూరి భార్య సీమా శిస్తీ కూడా ప్రముఖ జర్నలిస్టు. ఒకప్పుడు బీబీసీ హిందీ విభాగానికి ఢిల్లీలో సంపాదకురాలైన ఆమె ప్రస్తుతం ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్నారు. పేరు : సీతారాం ఏచూరి తల్లిదండ్రులు: ఎస్ఎస్ ఏచూరి, కల్పకం పుట్టింది: 12.08.1952న చెన్నైలో(ఉమ్మడి రాష్ట్రం) చదువు: ఎంఎ(ఆర్థిక శాస్త్రం), ఢిల్లీ జేఎన్‌యూ వృత్తి: రాజకీయ, సామాజిక కార్యకర్త, ఆర్థిక వేత్త, పత్రికల్లో కాలమిస్ట్ భార్య: సీమా శిస్తీ పిల్లలు: ఒక కూతురు, ఇద్దరు కుమారులు ప్రస్తుత హోదా: రాజ్యసభ సభ్యుడు(బెంగాల్ నుంచి), పార్టీ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన పదవులు: రాజ్యసభ సభ్యునిగా పలు కమిటీల్లో సభ్యుడు త్వరలో.. ఇల్లు చక్కదిద్దుతాం ‘ముందు మేము మా కాళ్లపై నిలబడాలి. పార్టీని చక్కదిద్దుకోవాలి. త్వరలో పార్టీ ప్లీనం జరగనుంది. దాన్లో పూర్తిగా చర్చించి దిద్దుబాటు ప్రక్రియను చేపడతాం.’ అని సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: ఈసారి ప్రజాతంత్ర విప్లవ నినాదమా? ఏచూరి: ఔను. ప్రజాతంత్ర విప్లవమే!. దీనర్థం తుపాకులో, తూటాలో కాదు. సామాజిక అణచివేత, పాలకుల దుర్నీతికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల్ని ఏకంచేసి తిరగబడేలా చేయడం. సాక్షి: పొత్తులు, ఎత్తులు ఉంటాయా? ఏచూరి: ఇప్పటికే చాలా సార్లు చెప్పాం. అవసరమైనప్పుడు వాటిపై చర్చిస్తాం. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులతో కలసి పోరాడడమే మా ముందున్న లక్ష్యం. సాక్షి: పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ తెలుగు వ్యక్తి ఎన్నికపై.. ఏచూరి: నేను తెలుగువాడినని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది. అయితే నేను నాయకత్వం వహిస్తున్నది జాతీయ పార్టీకి. నాకు అన్ని రాష్ట్రాలూ సమానమే. కమ్యూనిస్టులకు ప్రాంతాలు, భాషలతో నిమిత్తం ఉండదు. సాక్షి: తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం ఏచూరి: సీపీఎంని బలపర్చండి. వామపక్ష శక్తులను బలపర్చండి. ప్రజాతంత్ర విప్లవానికి సహకరించండని విజ్ఞప్తి చేస్తున్నా. సంక్షోభ సమయాల్లో తెలుగువారే అండ సీపీఎం సంక్షోభంలో చిక్కుకున్న ప్రతిసారీ తెలుగు నేతే అండగా నిలుస్తున్నా రు. 1964లో పార్టీ చీలిపోయినప్పుడు సీపీఐకి చండ్ర రాజేశ్వరరావు నాయకత్వం వహిస్తే, సీపీఎంను పుచ్చలపల్లి సుందరయ్య ముందుండి నడిపించారు. ఆయా పార్టీల్లో ఈ ఇద్దరూ వేసిన తమదైన ముద్ర భవిష్యత్తరాలకు కూడా పాఠంగా నిలవడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. పలు రాష్ట్రాల్లో పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి.ఈ క్రమంలో సీపీఎం, సీపీఐలకు దిశానిర్దేశం చేసే పదవులు తిరిగి తెలుగువారిని వరించడం విశేషం. -
సీపీఎం సారథిగా ఏచూరి
లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కూడగడదాం విశాఖలో ముగిసిన సీపీఎం జాతీయ మహాసభలు విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కొంతకాలంగా సీపీఎంలో సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తొలుత ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో నిలిచిన కేరళ నేత రామచంద్రన్ పిళ్లై.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో ఏచూరి ఎన్నిక ఏకగ్రీవమైంది. గత 6 రోజులుగా విశాఖలో జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభల ముగింపు రోజైన ఆదివారం పార్టీ నూతన కార్యవర్గాన్ని.. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న ప్రకాశ్ కారత్ ప్రకటించారు. 91 మందితో నూతన కేంద్ర కమిటీ(సీసీ)ని, 16 మందితో పొలిట్‌బ్యూరో(పీబీ)ను మహాసభ ఎన్నుకున్నట్టు తెలిపారు. సీసీలో 17 మంది, పీబీలో నలుగురు కొత్తవారికి చోటు కల్పించారు. పొలిట్‌బ్యూరోలో ఏపీ, తెలంగాణల ప్రతినిధిగా బీవీ రాఘవులు కొనసాగుతారు. మరో ఐదుగురు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. సీనియర్ నేత సుకుమల్సేన్ పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా ఉంటారు. మైనారిటీలు, మహిళలకు కూడా.. పార్టీ నాయకత్వ స్థానాల్లోకి మహిళలను, మైనా రిటీలను, ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని తీర్మానించినప్పటికీ దళితవర్గాలకు పొలిట్‌బ్యూరోలో చోటు లభించలేదు. మైనారిటీలకు, ఓ మహిళకు మాత్రం స్థానం దక్కింది. కేంద్ర కమిటీలో కొంతమంది బీసీలకు చోటు కల్పించారు. వీరిలో తెలంగాణ నుంచి ఎన్నికయిన చెరుపల్లి సీతారాములు ఒకరు. ముగిసిన మహాసభలు ఆరు రోజులు, 12 సెషన్లు, 40 గంటల చర్చోపచర్చలు, 812 మంది ప్రతినిధులు, 26 తీర్మానాలు, కొత్త కార్యవర్గం ఎంపిక అనంతరం పార్టీ 21వ జాతీయ మహాసభలు ఆదివారమిక్కడ ముగిశాయి. పార్టీకి రాబోయే కాలంలో దిశానిర్దేశం కల్పించే రాజకీయ, ఎత్తుగడల పంథాను, వచ్చే మూడేళ్ల కాలానికి రాజకీయ విధానాన్నీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల దిద్దుబాటుకు త్వరలో ప్రత్యేక ప్లీనంను నిర్వహించాలన్న కీలక నిర్ణయాలతో మహాసభలు ముగిసినట్టు రామచంద్రన్ పిళ్లై ప్రకటించారు. పొలిట్‌బ్యూరో సభ్యులు వీరే సీతారాం ఏచూరి(ప్రధాన కార్యదర్శి), ప్రకాశ్ కారత్, ఎస్.రామచంద్రన్ పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్(త్రిపుర సీఎం), పినరాయి విజయన్, బీవీ రాఘవులు, బృందా కారత్, కొడియేరి బాలకృష్ణన్, ఏంఏ బేబీ, సూర్యకాంత్ మిశ్రా, ఏకే పద్మనాభన్, హన్నన్ మొల్లా, మహమ్మద్ సలీం, సుభాషిణీ అలీ, జి.రామకృష్ణన్. కేంద్ర కమిటీ నుంచి తప్పించిన కురువృద్ధులు (వీరు ఆహ్వానితులుగా ఉంటారు) అచ్యుతానందన్ (కేరళ మాజీ సీఎం) బుద్ధదేవ్ భట్టాచార్య (బెంగాల్ మాజీ సీఎం) మల్లు స్వరాజ్యం (తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు) మహమ్మద్ అమీన్ కేంద్ర కమిటీలో తెలుగువారు వీరే.. ఏపీ నుంచి: పెనుమల్లి మధు, పాటూరి రామయ్య, ఎంఎ గఫూర్, సుంకర పుణ్యవతి. తెలంగాణ నుంచి: తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు. కేంద్ర కమిటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రతినిధి: బీవీ రాఘవులు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు, దేశ సమగ్రతకు భంగకరంగా మారిన మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడదాం. దీనికిగాను లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కూడగడదాం. నూతన భారతాన్ని నిర్మిద్దాం. అందుకోసం సీపీఎంను బలపరచండి’ అని సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మతోన్మాద, విధ్వంసకర రాజకీయాలను సీపీఎం ఎర్రజెండా అడ్డుకుని తీరుతుం దని ఉద్ఘాటించారు. ఈ మేరకు సీపీఎం 21వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా విశాఖ ఆర్కేబీచ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఏచూరి ప్రసంగించారు. చరిత్రాత్మక సీపీఎం మహాసభలతో విశాఖ తీరాన కొత్త ఉద్యమ స్ఫూర్తి ఉదయించిందని ఏచూరి చెప్పారు. ‘ఘర్‌వాపసీ’, ‘లవ్‌జీహాద్’, చర్చిలపై దాడులు తదితర ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత రాజకీయాలతో దేశ సమగ్రతకు బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్నం కలిగిస్తోందని నిప్పులు చెరిగారు. రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజుకుని.. కార్పొరేట్ పెద్దలకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నిందన్నారు. ఫాన్స్ నుంచి రూ.8 వేల కోట్లతో యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలన్న మోదీ నిర్ణయం విదేశీ కంపెనీలకే ప్రయోజనకరమని విమర్శించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ స్థానంలో ‘మేక్ ఫర్ ఇండియా’ విధానం కావాలని ఏచూరి డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం సామాన్యులపై పన్ను భారాలు మోపుతోందని ఆరోపించారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఉద్యమపథం సాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. వచ్చే 6 మాసాల్లో ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఎర్రజెండాకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఉద్యమాలతో బుద్ధి చెబుదాం: కారత్, పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్రంలోని బీజేపీ, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి ఉద్యమిద్దాం. తద్వారా ఆయా ప్రభుత్వాలకు బుద్ధి చెబుదాం. దీనికిగాను సీపీఎం తన బలాన్ని మరింత పటిష్టపరుచుకోనుంది. బహిరంగ సభలో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు, సీిపీఎం ఏపీ కార్యదర్శి మధు ప్రసంగించారు.