
న్యూఢిల్లీ: బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్‌తో రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవాలా? వద్దా? అన్న విషయంపై ఏకాభిప్రాయానికి రాకుండానే సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన రెండు అంశాలపై చర్చలు జరిగాయి. 22వ సీపీఎం జాతీయ మహాసభల్లో చర్చించాల్సిన పలు అంశాలపై ఓ ముసాయిదాను కూడా రూపొందించారు. కాంగ్రెస్‌తో ఎన్నికల ఒప్పందమేదీ ఉండకూడదనీ, అయితే మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేసేందుకు అన్ని వామపక్షేతర పార్టీల సహకారాన్ని తీసుకోవాలని ఏచూరి సూచించారు.
దీనిని కారత్ వర్గం వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌తో రాజకీయ ఒప్పందం ఉండనప్పటికీ, ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయపార్టీలతో సీపీఎం కలసి నడవాలనేది కారత్ సూచన. ఇది అసాధ్యమని ఏచూరి వర్గం వాదిస్తోంది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముసాయిదాను పార్టీ కేంద్ర కమిటీ ముందు ఉంచనున్నారు. కేంద్ర కమిటీ జనవరి 19 నుంచి 21 వరకు మూడురోజులపాటు కోల్‌కతాలో సమావేశమై చర్చలు జరపనుంది. కాగా కాంగ్రెస్ పార్టీపై కారత్ విరుచుకుపడ్డారు. 1992లో బాబ్రీ మసీదు కూలిపోతుంటే నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆపడానికి ప్రయత్నం కూడా చేయలేదనీ, కాంగ్రెస్ బయటకు మాత్రమే లౌకికవాద పార్టీ కానీ లోపల కాదని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment