న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ మంగళవారం ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాంలతో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం దేశ రాజధానికి చేరుకోవడం తెలిసిందే. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే వారితో సమావేశమైనట్టు అనంతరం నితీశ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై విపక్షాల సమష్టి శక్తిని చాటాల్సిన సమయం వచ్చిందన్నారు.
అనంతరం సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్ యాదవ్, పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఐఎన్‌ఎల్‌డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా తదితరులను కూడా నితీశ్ కలిశారు. తనకు ప్రధాని కావాలని ఉందన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘‘ఆ పదవికి నేను పోటీదారు కాను. దానిపై నాకు ఆసక్తీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. విపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తమ తొలి అజెండా తప్ప ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం కాదని ఏచూరి చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు తేలుతుందన్నారు.
బీజేపీపై పోరులో నితీశ్ కలిసి రావడం దేశ రాజకీయాలకు గొప్ప శుభ సంకేతమని అభిప్రాయపడ్డారు. నితీశ్, కేజ్రీవాల్ భేటీ గంటన్నర పాటు సాగింది. విద్య, వైద్యం తదితర అంశాలతో పాటు ఆపరేషన్ లోటస్, విపక్షాల ఎమ్మెల్యేల కొనుగోలు తదితరాలపై చర్చించినట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం బీజేపీపై పోరాటానికి వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని రాజా అన్నారు. సోమవారం రాహుల్‌గాంధీతోనూ నితీశ్ భేటీ కావడం తెలిసిందే.
25న ‘బల ప్రదర్శన’ ర్యాలీ
నితీశ్, కేసీఆర్, మమత హాజరు!
సెప్టెంబర్ 25న హరియాణాలో ఐఎన్‌ఎల్‌డీ తలపెట్టిన ర్యాలీని విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మార్చాలని నితీశ్ భావిస్తున్నారు. దానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్ తదితరులను ఐఎన్‌ఎల్‌డీ ఆహ్వానించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తదితరులకు కూడా ఆహ్వానాలు పంపుతామని పేర్కొంది. ఈ ర్యాలీలో విపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పలు అంశాలపై లోతుగా చర్చిస్తారని చెప్పుకొచ్చింది. బీజేపీతో జనం విసిగిపోయారని చౌతాలా అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా కన్పిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment