
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగపల్లి ఆర్టీసీ కల్యాణమండపంలో గురువారం సీపీఎం 22వ జాతీయ మహా సభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం జరిగింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి, వ్యాపారానికి అనుకూలంగా ఉందని ఓ ఏజెన్సీ చెప్పడంతో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక చాలా మంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. రైల్వే వంటి సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే సీపీఎం జాతీయ మహాసభలు ప్రత్యామ్నాయ రాజకీయాలకు దశ, దిశ చూపించాలని పేర్కొన్నారు. కేంద్రం ఎన్నికల సంఘం, సీబీఐని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 22వ జాతీయ మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా బీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం, కోశాధికారి వెంకట్‌ను నియమించారు. వైస్ చైర్మన్లుగా మల్లు స్వరాజ్యం, మధు, పాటూరు రామయ్య, వి.శ్రీనివాస్‌రావు, హేమలత, చెరుపల్లి సీతారాములు, చుక్కా రాములు, సున్నం రాజయ్య, నంద్యాల నరసింహారెడ్డి నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment