వ్యవసాయ కార్మికులకు పని భద్రత కల్పించాలి | Farm workers, work safety | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కార్మికులకు పని భద్రత కల్పించాలి

Published Sun, Aug 3 2014 4:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farm workers, work safety

హన్మకొండ సిటీ : వ్యవసాయ కార్మికులకు నిరంతరం ఆదాయం వచ్చేలా పని భద్రత కల్పించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్లై డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మికులను సంఘటితం చేసి పోరాటా లు చేపట్టాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మికుల సమస్యలు, హక్కుల కోసం ఇతర సంఘాలతో కలిసి పోరాడాలన్నారు.

వరంగల్, హన్మకొండలో నాలుగు రోజులపాటు జరిగిన అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు శనివారం ముగిశాయి. చివరి రోజు సభలో రామచంద్రన్ పిళ్లైముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత సమాజంలో వివిధ కులాలు, మతాల్లో నయా ధనికులు పుట్టుకొచ్చి మూఢనమ్మకాలు, కాలం చెల్లిన ఆచార వ్యవహారాలు ముందుకు తీసుకొస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని నీరుగారుస్తున్నారని, దీనిని వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు తిప్పికొట్టాలని చెప్పారు.

ప్రజలను చైతన్య వంతులను చేసి వ్యవసాయ కార్మికుల కు పదునైన ఆయుధంగా ప్రజల్లో ఉండాల న్నారు. వ్యవసాయ కార్మికులకు ఇచ్చే కూలి రేట్లు తక్కువగా ఉంటున్నాయని, మహిళలు, పురుషుల వేతానాల్లో వ్యత్యాసాలు కనపడుతున్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు పరిహారం ఇవ్వడం లేదని, దీంతో బాధితులకు రుణభారం పెరుగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు. పని రోజులు తగ్గిపోవడంతో వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయ కార్మికులకు ఆహార భద్రత లేదని, వారి పిల్లలకు విద్యావకాశాలు లేకుండా పోయాయన్నారు. కార్మికుల పిల్లలు కార్మికులుగా మారే దుస్థితి పాలకుల వైఫల్యాలతో కలుగుతోందని విమర్శించారు. అనంతరం సంఘం నూతన జాతీయ కమిటీని ఎన్నుకోవడంతోపాటు పలు తీర్మానాలు అమోదించారు.

మహాసభ బులెటిన్‌ను నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పాటూరి రామయ్య, ఎం.వి.గోవిందరాజన్, బానులాల్ సాహ్, గుర్మేశ్‌సింగ్, సుభాషిణీ అలీ, జాయింట్ కార్యదర్శులు సునీత్ చోప్రా, కుమార్ షిరాల్కర్, బి.వెంకట్, సారంగధర్ పాశ్వాన్, బ్రిజిలాల్ భారతి, కార్యదర్శి వర్గ సభ్యులు బి.రాఘవన్, పి.మురళీకృష్ణ, కె.కోమలకుమారి, నాయకులు జి.నాగయ్య, నాగేశ్వర్‌రావు, రవి, మెట్టు శ్రీనివాస్, సూడి కృష్ణారెడ్డి, సీహెచ్.రంగయ్య, ప్రభాకర్‌రెడ్డి, సారంపల్లి వాసుదేవరెడ్డి, ఉపేందర్, ఉప్పలయ్య, యాదానాయక్, చుక్కయ్య, సంపత్ పాల్గొన్నారు.
 
 బాధ్యతతో పని చేస్తా..


అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడిగా బాధ్యత ఎరిగి పని చేస్తా. దేశంలో పాలకవర్గాలు వ్యవసాయ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో ఆకట్టుకుంటున్నాయి. తరువాత డబ్బులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నామంటూ నిట్టూరుస్తున్నాయి. డబ్బులతో వ్యవసాయ కార్మికులకు ఆర్థిక వనరులు సమకూరుస్తే వారు సొంత కాళ్లపై నిలబడుతారు. స్వశక్తితో ఎదుగుతారు. వ్యవసాయ కార్మికులందరినీ సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాం. తెలంగాణ కమిటీ మహాసభలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభలను విజయవంతం చేసిన ఏపీ, తెలంగాణ కమిటీలకు అభినందనలు.
 -నూతన అధ్యక్షుడు తిరువక్కరుస్
 
 కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలి

 వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు ప్రజలతో మమేకమై వ్యవసాయ కార్మికులను చైతన్య వంతులుగా తయారు చేయాలి. నాయకులు అనేవారు ప్రజల మధ్య ఉన్నపుడే గుర్తింపు ఉంటుంది. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం ఒక్కటే మార్గం. మహాసభలు చూపించిన మార్గంలో నడుస్తాం. పాలకుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించేలా పోరాటాలు నిర్వహిస్తాం. రాష్ట్ర విభజన జరుగకముందు ఇక్కడ జాతీయ మహాసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఏపీ, తెలంగాణ శాఖలు మహాసభలను విజయవంతం చేశాయి.

 - విజయరాఘవన్, జాతీయ ప్రధాన కార్యదర్శి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement