పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్రంపై ఒత్తిడికి రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్షబృందాలను తీసుకెళ్లాలని వివిధ బీసీ సంఘాలు డిమాండ్‌చేశాయి. ఈ దిశలో రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే బీసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించాయి.
బీసీ బిల్లుపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయపార్టీలకు అతీతంగా ఈ నెల 30న ఏపీ, తెలంగాణల్లోని 23 జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి. బీసీలను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తే అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని హెచ్చరించాయి. ఆదివారం బీసీ భవన్‌లో బీసీసంక్షేమసంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏపీ,తెలంగాణలలోని వివిధ బీసీసంఘాల సమావేశం జరిగింది. రెండురాష్ట్రాల బీసీసంక్షేమసంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ (తెలంగాణ), కౌసన శంకరరావు (ఏపీ), బీసీ సంఘాల నాయకులు డా.ర్యాగ అరుణ్, నీల వెంకటేష్, కె.ఆల్మిన్‌రాజు, పద్మజ యాదవ్, పోతన మహేశ్, వరప్రసాద్ యాదవ్, రాచకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీలో బీసీసంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ,టీడీపీ,టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రకటించాయని, రెండేళ్లు గడుస్తున్నా బీసీ బిల్లుపై ఏ పార్టీ పార్లమెంట్‌లో లేదా తమ సమావేశాల్లో పెదవి విప్పడం లేదని విమర్శించారు.బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం తాము గత పాతికేళ్లుగా పోరాడుతుంటే తూ.తు మంత్రంగా రెండు ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేశాయే తప్ప వాటి అమలుకు చిత్తశుద్ధి కృషి చేయలేదని విమర్శించారు. ఇప్పటికి 72 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఇద్దరు సీఎంలు, ఒక్కసారి కూడా ఈ అంశంపై ప్రధానితో, కేంద్రంతో చర్చించకపోవడం బాధాకరమన్నారు.