ECL Narasimhan
-
కన్నుల పండువగా.. సాక్షి అవార్డుల పండుగ
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు 2018’ కార్యక్రమం శనివారం కన్నుల పండువగా సాగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా, సాక్షి గ్రూపు మాజీ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి గౌరవఅతిథిగా పాల్గొన్నారు. 2014లో ప్రారంభమైన ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు’ఐదో ఎడిషన్‌లో భాగంగా 2018కి సంబంధించి వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారికి అవార్డులు ప్రదానం చేశా రు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్య పరిరక్షణ, క్రీడ లు, సినిమా రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. సినీ నటి ఝాన్సీ వ్యాఖ్యానం, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ దీపికారెడ్డి బృందం ‘స్వాగతాంజలి’కూచిపూడి నాట్యంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యఅతిథి గా హాజరైన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, గౌర వ అతిథి వైఎస్ భారతీరెడ్డి చేతుల మీదుగా వ్యవసాయ రంగంలో చెరుకూరి రామారావు, విద్యారంగంలో పెరవలి గాయత్రి, ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్‌గా డాక్టర్ రమేశ్ కంచర్ల, తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అవార్డులు అందుకున్నారు. సామాజిక సేవా రంగంలో మల్లికాంబ ఇనిస్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీకాప్డ్ సంస్థ వ్యవస్థాపకురాలు రామలీల, విద్యారంగంలో డాక్టర్ ఐవీ శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్య పరిరక్షణ విభాగంలో డాక్టర్ బిందు మీనన్, క్రీడారంగానికి సంబంధించి గరికపాటి అనన్య, షేక్ మహ్మద్ అరీఫుద్దీన్ తరపున అతడి సోదరుడు అవార్డులు అందుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ, సామాజిక సేవా రంగాల్లో డాక్టర్ యాదయ్య, హుసాముద్దీన్‌తోపాటు సబీనా జేవియర్ తరపున దినేశ్ అవార్డులు స్వీకరించారు. ప్రముఖుల చేతుల మీదుగా: ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌ను వైఎస్ భారతీరెడ్డి సన్మానించారు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేసిన జ్యూరీ చైర్పర్సన్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శాంతా సిన్హాతో పాటు, జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన రెయిన్బో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతీరెడ్డి, రిటైర్డు ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ, పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్జీ రంగా యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ పద్మరాజు, కాటన్ బోర్డు మాజీ సలహాదారు దొంతి నర్సింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌రావు, సురానా టెలికాం ఎండీ నరేంద్ర సురానా, రిటైర్డు ఐఏఎస్ అధికారి వినోద్ అగర్వాల్ తదితరులకు సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణిరెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, సీఈఓ అనూప్ కుమార్ సక్సేనా, వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉపాధ్యక్షులు శేఖర్ విశ్వనాథన్, శంకర్ విశ్వనాథన్, సాక్షి సీఈఓ వినయ్ మహేశ్వరి, సాక్షి మీడియా డైరెక్టర్లు ఎ.లక్ష్మీనారాయణ రెడ్డి, కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, పీవీకే ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాల్లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియ ర్ నటుడు కృష్ణంరాజు, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్అశ్విన్, ఉత్తమ చిత్రం గా ‘మహానటి’కి అవార్డులు ప్రదానం చేశారు. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపు ణు లు ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు. -
సమాజానికి స్ఫూర్తిదాతలు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో సభ్యుడిగా ఉంటూ. సమాజం కోసం పాటుపడేవారిని ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’కు ఎంపిక చేయడం ఆహ్వానించదగిన అంశమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఈ అవార్డులు పొందిన వారిని చూసి సమాజం స్ఫూర్తి పొందుతుందని ఆయన అన్నారు. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు 2018’కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఆరోగ్యం, విద్య తదితరరంగాల్లో విశేష కృషిచేస్తున్న వారిని అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీకి అభినందనలు. సమాజం సుఖ, సంతోషాలతో ఉండేందుకు ఆరోగ్య పరిరక్షణ, విద్య అత్యంత కీలకం.ఈ రెండు రంగాలను అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ రెండు రంగాలపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరముందనే విషయాన్ని ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు 2018’కార్యక్రమం నొక్కి చెప్పింది’అని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఇలాంటి వార్తలను నివారించలేమా? ‘సమాజంలో ప్రతికూల ధోరణి క్రమంగా పెరుగుతోంది. పత్రికల మొదటి పేజీ, ఎలక్ట్రానిక్ మీడియాలో విచారకరమైన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడంతో.. సమాజంలో చెడు తప్ప మరేదీలేదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే ప్రమాదముంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా (ఫోర్త్ ఎస్టేట్) చెప్పుకునే మీడియాకు సంబంధించి.. నేను ఐదో లేదా ఆరో స్తంభంగా నా మనస్సాక్షి మేరకు మాట్లాడాలని అనుకుంటున్నా. నా మాటలు ఫోర్త్ ఎస్టేట్‌తో విభేదించేలా ఉన్నా.. సమాజంలో సానుకూల ధోరణి పెరిగేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఉదయాన్నే ఎస్వీబీసీ లాంటి భక్తి ఛానెల్‌ను చూస్తే ఓ రకమైన సంతృప్తి లభిస్తుంది. కానీ ఆ తర్వాత పేపర్ తెరిచి చూసినా.. టీవీ ఆన్ చేసినా అన్నీ చెడు వార్తలే కనిపిస్తాయి. ఇలాంటి వార్తలను మొదటి పేజీలు, టీవీ హెడ్లైన్లలో రాకుండా నివారించలేమా’అని గవర్నర్ నరసింహన్ ప్రశ్నించారు. తాను ఏ ఒక్క మీడియా సంస్థనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో ఇలాంటి సంస్కృతి ప్రబలకుండా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. నివారించాల్సిన బాధ్యత మీడియాపైనా.. ‘వరకట్న వేధింపులు, గృహహింస తదితరాలను పదే పదే చూపే బదులు.. వాటిని నివారించేందుకు మీడియా ఎందుకు ప్రయత్నించదు. ప్రతీ దృశ్యాన్నీ ఫోటోలు, వీడియోలు తీసి చూపడం ద్వారా ఒరిగేదేమిటో నాకు అర్థం కావడంలేదు. ఈ విషయాలను గవర్నర్ హోదాలో కాకుండా.. నా మనస్సాక్షి మేరకు చెప్తున్నా’అని నరసింహన్ వ్యాఖ్యానించారు. ‘ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే పత్రికలు, టీవీ ఛానెళ్లు సమాజంలో అంతర్భాగమే. అందరికీ ఉపయోగపడే విధానాలు రూపొందించేలా మీడియా మార్గనిర్దేశనం చేయాలి. అందులో లోటు పాట్లపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి. తద్వారా సమాజం మార్పు దిశగా సాగుతుంది’అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ప్రమాదాలు, వరదలు సంభవించినపుడు మీడియా అనుసరించే ధోరణిపై కూడా గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో మీడియా కూడా తన వంతు సామాజిక బాధ్యతగా సహాయ సామగ్రి వంటివి చేరవేయడం ద్వారా ప్రజల్లో సానుకూల ధృక్పథం పెరిగేలా చూడాలన్నారు. ఎవరైనా వెళ్లాల్సిందే.. సెన్సేషనలిజం వద్దు ‘ఈ రోజు సమాజంలో ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోలేని పరిస్థితి కనబడుతోంది. సత్యమేవ జయతే నినాదం ఉన్న దేశంలో సెన్సేషలిజం పెరుగుతోంది. సెన్సేషనలిజం ద్వారా పాఠకుల సంఖ్య, టీఆర్పీ రేటింగ్ పెరిగినా.. సమాజానికి మాత్రం నష్టమే చేకూరుతోంది. నిజాలను వెలికితీయడంలో మీడియా మార్గదర్శకత్వంతో వ్యవహరించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. ఓ వ్యక్తి మరణించకముందే బ్రేకింగ్ అంటూ వార్తలు వేస్తున్న పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. ‘ఈ గవర్నర్ వెళ్తున్నాడు.. వెళ్తామని మేము ముందే చెప్పాం’తరహా వార్తలపై నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఏదో ఒక గవర్నర్ వెళ్లక తప్పదు అని వ్యాఖ్యానించారు. వార్తల ప్రచురణ, ప్రసారంలో మీడియా సంస్థలు నైతిక విలువలు పాటించాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా చర్చలను అరుపులు కేకలు లేకుండా అర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే డైలీ సీరియళ్లకు బదులుగా సంతోషకరమైన కుటుంబ వాతావరణం ఉండేలా వాటిని ప్రసారం చేయాలని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. ఇతరులు స్ఫూర్తి పొందేలా అవార్డులు సమాజంలో వివిధరంగాల్లో కృషి చేసిన వారికి గుర్తించి అవార్డులు ఇవ్వడం ద్వారా మరికొందరికి స్ఫూర్తి లభిస్తుందని సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి అన్నారు. నాలుగేళ్లుగా సాక్షి మీడియా గ్రూప్ ఎక్సలెన్స్ అవార్డులు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాక్షి మీడియా గ్రూపు మాజీ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, రిటైర్డు ఐఎఎస్ అధికారి అజేయ కల్లం, ఏపీ డీజీపి దామోదర్ గౌతమ్ సవాంగ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, జ్యూరీ చైర్మన్ పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శాంతా సిన్హా, జ్యూరీ సభ్యులు ప్రణతి రెడ్డి, అరుణ బహుగుణ, చంద్రశేఖర్‌రెడ్డి, పద్మ రాజే, దొంతి నర్సింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌రావు, నరేంద్ర సురానా, వినోద్ కె అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఈవో ద్వివేది
-
రేపు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశం
-
‘సెలవిచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు’
సాక్షి, హైదరాబాద్ : నేడు మెజారిటీ రంగాల్లో మన దేశం టాప్ 10లో ఉండటానికి ప్రజస్వామ్యమే కారణమన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌తో పాటు నాగిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిబియాలో అన్ని వనరులు, సంపద ఉన్నా.. ప్రజస్వామ్యం లేదని తెలిపారు. ఫలితంగా అక్కడ తిండి తినలేని దారుణ పరిస్థితులున్నాయన్నారు. గ్రామాల్లో ఏకంగా 90 శాతం ఓట్లు పోల్ అవుతుంటే.. జీహెచ్ఎంసీలో కనీసం 50 శాతం కూడా పోల్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికి జనాలు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. ఓటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది : గవర్నర్ ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ నరసింహన్ ఓటరు హెల్ప్ లైన్ పోస్టర్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం అభినందనీయమన్నారు. ఎన్నికల రోజు సెలవు ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. ఓటు వేయడానికని తెలిపారు. -
కేంద్ర హోంమంత్రితో గవర్నర్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల రాజకీయ, పరిపాలన పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. అంతేకాకుండా తెలుగు రాష్ర్టాల్లోని తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్‌తో గవర్నర్ చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ ఢిల్లీ పర్యటనకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ నరసింహన్ ఈ రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఇక ప్రతి నెలా అన్ని రాష్ట్రాల గవర్నర్లు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలవడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. -
కొలువుదీరిన కొత్త హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరాదిన తెలంగాణ కొత్త హైకోర్టు కొలువుదీరింది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమం అనంతరం హైకోర్టు చేరుకున్న జస్టిస్ రాధాకృష్ణన్ తన సహచర న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ బి.శివశంకర్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్లతో ప్రమాణం చేయించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు మొదటి కోర్టు హాలు వేదిక కాగా, ఈసారి హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వేదిక నుంచి ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం సీజే, ఇతర న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావు, బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్‌రావు, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావుతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ 1959 ఏప్రిల్ 29న కేరళలో జన్మించారు. తల్లిదండ్రులు ఎన్.భాస్కరన్ నాయర్, కె.పారుకుట్టి అమ్మ.. ఇద్దరూ న్యాయవాదులే. కొల్లాంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన జస్టిస్ రాధాకృష్ణన్, కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ, బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1988లో ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. అనతికాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2004లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా, అక్కడి నుంచి బదిలీపై ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. ఉమ్మడి హైకోర్టు విభజన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ రాజస్తాన్‌కు చెందిన జస్టిస్ చౌహాన్, 1959 డిసెంబర్ 24న జన్మించారు.1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ డిగ్రీ సాధించారు. అదే ఏడాది రాజస్తాన్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1996 నుంచి 2005 వరకు రాజస్తాన్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, రాజ్యాంగపర, సర్వీసు కేసుల్లో పట్టు సాధించారు. 2005 జూన్ 13న రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బదిలీపై 2015 మార్చి 10న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది నవంబర్ 23న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ వి.రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టీఆర్మణిల వద్ద న్యాయ మెళకువలు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మంచివక్తగా పేరున్న జస్టిస్ రామసుబ్రమణియన్ 2016 ఏప్రిల్ 27న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ 1963 ఆగస్టు 14న పులిగోరు రామచంద్రారెడ్డి, పి.పద్మావతమ్మ దంపతులకు జన్మించారు. రామచంద్రారెడ్డి 1969 నుంచి 1982 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. సంజయ్‌కుమార్ నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1988లో ఢిల్లీ యూని వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యి, తన తండ్రి వద్దే వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. న్యాయవాద వృత్తి నుంచి తండ్రి తప్పుకొన్న తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2000–03 సంవత్సరాల మధ్య ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2008 ఆగస్టు 8న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు 1966 ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి జస్టిస్ ఎం.జగన్నాథరావు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. తాత జస్టిస్ రామచంద్రరావు 1960–61 సంవత్సరా ల్లో హైకోర్టు జడ్జిగా పనిచేశారు. చిన్న తాత జస్టిస్ ఎం.కృష్ణారావు కూడా హైకోర్టు జడ్జిగా వ్యవహరించారు. జస్టిస్ రామచంద్రరావు ఎస్సెస్సీ సెయింట్ పాల్ హైస్కూల్, ఇంటర్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ, బీఎస్సీ మ్యాథ్స్ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో చదివారు. మ్యాథ్స్‌లో ఆయన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. 1989లో ఓయూ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్బీ చివరి ఏడాదిలో అత్యధిక మార్కు లు సాధించినందుకు సీవీఎస్ఎస్ చార్యులు బంగారు పతకాన్ని సాధించారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రఖ్యాత క్రేంబిడ్జి యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. ఈ సమయంలో ఆయనకు క్రేంబిడ్జి కామన్వెల్త్ స్కాలర్షిప్, బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కామర్స్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ లభించింది. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2012లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి నల్లగొండ జిల్లా, సిరిసినగండ్ల గ్రామంలో ఎ.రామానుజరెడ్డి, జయప్రద దంపతులకు 1960 మే 4న జన్మించారు. మిర్యాలగూడలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. హైదరాబాద్ ఏజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి బంగారు పతకంతో బీఎల్ డిగ్రీ సాధించారు. 1985లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది మహమూద్ అలీ వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నుంచి 2009 వరకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు. 2013న న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.నవీన్‌రావు కరీంనగర్ జిల్లా, నంది మైడారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి విమల, తండ్రి మురళీధర్‌రావు. 1986లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏ డాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2013న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి 1963 అక్టోబర్ 8న సుబ్బారావు, యశోద దంపతులకు జన్మించారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యా రు. న్యాయవాది డి.లింగారావు వద్ద జూనియర్‌గా చేరారు. తర్వాత విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్రావు వద్ద చేరి, ఉద్యోగుల సర్వీసు వివాదాల కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2017న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ చల్లా కోదండరామ్ అనంతపురం జిల్లా, చల్లావారిపల్లె గ్రామంలో 1959లో జన్మించారు. 1983లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1979 నుంచి 1988 వరకు పారిశ్రామిక రంగంలో పనిచేశారు. కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరించారు. 1988 జూన్ 24న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్న్యాయవాది ఎ.వెంకటరమణ, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.పర్వతరావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ట్యాక్స్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. సుప్రీంకోర్టు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు హైకోర్టుల్లో కూడా కేసులు వాదించారు. ఆయన వాదించిన కేసులు వివిధ జర్నల్స్‌లో 250 వరకు ప్రచురితమయ్యాయి. 2013న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ శివశంకర్‌రావు జస్టిస్ శివశంకర్‌రావు 1959 మార్చి 29న తూర్పు గోదావరి జిల్లా, సకుర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి గవర్రాజు సర్పంచ్‌గా వ్యవహరించారు. తల్లి సూర్యకాంతం గృహిణి. వీరిది వ్యవసాయ కుటుంబం. నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పీహెచ్డీ పూర్తి చేశారు. 1984 మార్చిలో న్యాయ వాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయ వాదులు పాలగుమ్మి సూర్యారావు, దువ్వూరి మార్కండేయులు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1996లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఏపీ, తెలంగాణలో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ షమీమ్ అక్తర్ 1961 జనవరి 1న నల్లగొండలో రెహీమున్సీసా బేగం, జాన్ మహ్మద్ దంపతులకు జన్మించారు. నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. పీజీ లా కాలేజీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. 1986 నుంచి 2002 వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2002లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.కేశవరావు 1961 మార్చి 29న ప్రకాశరావు, జయప్రద దంపతులకు జన్మించారు. కాకతీయ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వరంగల్ జిల్లాలో పి.సాంబశివరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1991లో హైదరాబాద్‌కు ప్రాక్టీస్ మార్చి, ఎంవీ రమణారెడ్డి ఆఫీసులో చేశారు. 1996లో స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులు, ఎన్నికల కేసుల్లో పట్టు సాధించారు. ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2010లో సీబీఐ స్పెషల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. అనేక సంచలన కేసుల్లో వాదనలు వినిపించారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అమర్నాథ్ గౌడ్ 1965 మార్చి 1న కృష్ణ, సావిత్రి దంపతులకు జన్మించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. మహారాష్ట్రలోని శివాజీ కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య వద్ద జూనియర్‌గా చేరారు. అనతికాలంలోనే సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. పలు బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. అమర్నాథ్ గౌడ్ తాత టి.అంజయ్య సంఘ సంస్కర్త. ప్యారడైజ్ థియేటర్ య జమాని. సొంత భూమిని కవాడిగూడ శ్మశానం కోసం ఇచ్చారు. 2017లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను..
‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాస నాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గురువారం మధ్యాహ్నం 1.25గంటలకు కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. కేసీఆర్‌తోపాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమా ణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ ముందుకు ఒంగి వినయపూర్వకంగా అందరికీ నమస్కారం చేశారు. అనంతరం కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. రాజ్‌భవన్‌లో సాదాసీదాగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీల నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిజామాబాద్ ఎంపీ కవిత దంపతులు, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎమ్మె ల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధా కర్‌రెడ్డి హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వివిధ కార్పొరేషన్ చైర్మ న్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారాని కి ముందు గవర్నర్ కార్యాలయంలో ఒవైసీ తో కలిసి కేసీఆర్ కాసేపు కూర్చున్నారు. ముహూర్త సమయానికి సీఎంతో కలిసే ఒవైసీ బయటికొచ్చారు. వీరు మినహా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, టీజేఎస్ అధ్య క్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేనితోపాటు ఆయా పార్టీల నేతలకు ఆహ్వానం రాలేదని సమాచారం. రాజన్న ఆశీర్వాదం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్‌తోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ను రాజ్‌భవన్‌లోనే ఆశీర్వదించారు. వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్‌బాబు, ఆలయ ఈవో దూస రాజేశ్వర్ కేసీఆర్‌ను సత్కరించారు. అనంతరం ప్రగతిభవన్ చేరుకున్న సీఎంను భద్రాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. పలువురు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తదిత రులు కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. ఆయన మరింత ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని ట్వీట్ చేశారు. ఇదీ ప్రస్థానం పేరు: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పుట్టిన తేదీ: 17.2.1954 తల్లిదండ్రులు: వెంకటమ్మ, రాఘవరావు స్వగ్రామం: సిద్ధిపేట జిల్లా చింతమడక విద్యార్హత: ఎంఏ కుటుంబం: భార్య శోభ, కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత. రాజకీయ జీవితం: యువజన కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రాఘవాపూర్ సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1983లో తెదేపాలో చేరి సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో సిద్దిపేట నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 ఎన్టీఆర్ కేబినేట్లో కరు వు మంత్రిగా పని చేశారు. 1996–1999 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా మంత్రిగా పనిచేశారు. 1999–2001 వరకు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2001లో ఎమ్మెల్యే పదవి, డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2001 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచారు. 2004లో సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి విజయం సాధిం చారు.యూపీఏ ప్రభుత్వంలో కార్మికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా మరోసారి గెలిచారు. 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచారు. 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు ప్రయత్నించి అరెస్టయ్యారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశా రు. 2014 ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజైన 2014 జూన్ 2న తొలి సీఎంగా ప్రమాణం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. -
నేడు కేసీఆర్ ప్రమాణం...
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఒక్కరే ప్రమాణం చేయనుండగా.. జిల్లాలు, సామాజిక వర్గాల కూర్పు అనంతరం వారంలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో సీఎంతోపాటు 17 మంది మంత్రులు ఉండాలి.. ఈ లెక్కల ప్రకారం.. సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం తెలంగాణభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకునే తీర్మానాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రవేశపెట్టారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ బలపరిచారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు చప్పట్లతో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. గవర్నర్‌కు అందజేత టీఆర్ఎస్ శానససభాపక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక అనంతరం 11 మంది ఎమ్మెల్యేల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి ఎన్నికకు సంబందించిన పత్రాలను అందజేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా టీఆర్ఎస్ఎల్పీ నేతను ఆహ్వానించాలని కోరింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి.లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్‌రెడ్డి, గొంగడి సునీత, అజ్మీరా రేఖానాయక్, దాస్యం వినయభాస్కర్, వి.శ్రీనివాస్‌గౌడ్, రవీంద్రకుమార్, కాలె యాదయ్యలు గవర్నర్‌ను కలిశారు. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ నర్సింహన్‌కు అందజేసింది. అన్నింటినీ పరిశీలించిన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ నర్సింహన్ టీఆర్ఎల్పీనేత కేసీఆర్‌ను ఆహ్వానించారు. రాజీనామాలు ఆమోదం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజీనామా చేస్తూ గవర్నర్ నరసింహన్‌కు లేఖ పంపారు. గవర్నర్ దీన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. రాష్ట్ర మంత్రివర్గ రాజీనామా ఆమోదాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంత్రులంతా మాజీలయ్యారు. అసంతృప్తులు లేకుండా! మంత్రివర్గంలో ఎక్కువ మంది కొత్తవారికి చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గురువారం తనతోపాటు ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అదేరోజు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న వారిలో అవకాశం దక్కని వారు అసంతృప్తితో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అయితే ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న వారిలో ఎక్కువ మందిని పక్కనపెట్టే అవకాశం ఉంటుంది. మంత్రులుగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు, అజ్మీరా చందులాల్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. వీరి స్థానంలో కొత్తగా నలుగురికి అవకాశం కల్పించాల్సి ఉంది. జిల్లాలు, సామాజికవర్గాల కూర్పుతో కొత్త జట్టును ఎంపిక చేసుకోనున్నారు. పరిశీలనలో దానం, వివేకా సామాజికవర్గాల వారీగా ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లకు చోటు కల్పించే అవకాశం ఉంది. వచ్చే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులు ఉంటారా లేదా అనేదానిపై స్పష్టతలేదు. అయితే.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి స్థానంలో మాదిగ సామాజికవర్గానికి చెందిన అరూరి రమేశ్, మహమూద్ అలీ స్థానంలో మహ్మమ్మద్ ఫరీదుద్దీన్‌లు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. టి పద్మారావుగౌడ్ స్థానంలో కేపీ వివేకానంద్ గౌడ్, జోగు రామన్న స్థానంలో దానం నాగేందర్ లేదా దాస్యం వినయభాస్కర్ పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. స్పీకర్ పదవిని ఎవరికి అప్పగించాలనే విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే మంత్రివర్గ కూర్పు తుదిదశకు రానుంది. -
మెజిస్టీరియల్ విచారణ
పాతబస్తీ కాల్పులపై గవర్నర్ ఆదేశం * మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, క్షతగాత్రులకు 50 వేలు ఎక్స్‌గ్రేషియా * కొనసాగుతున్న కర్ఫ్యూ... కోలుకుంటున్న బాధితులు * కిషన్‌బాగ్‌లో డీజీపీ పర్యటన సాక్షి, సిటీబ్యూరో: పాతనగరంలోని సిక్‌చావ్నీలో జరిగిన పోలీస్కాల్పులపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. పోలీసుకాల్పులు ఏకపక్షంగా ఉన్నాయంటూ పలు పార్టీలు ఆరోపిం చినందున గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలపై పోలీసు అధికారులతో గవర్నర్ నరసింహన్ గురువారం సమీక్షించారు. కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.ఆరు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల కయ్యే వైద్యఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా, అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు గురువారం పర్యటించారు. అల్లర్లకు కారణాలు, చేపట్టిన బందోబస్తు గురించి సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. అల్లర్లు, కాల్పులు ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. నేటి వరకు కర్ఫ్యూ పొడిగింపు పాతబస్తీలోని సిక్‌చావ్నీలో విధించిన కర్ఫ్యూను శుక్రవారం వరకు పొడిగించారు. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కర్ఫ్యూను సడలించడంతో ఆ ప్రాంత ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పరుగులు తీశారు. అనంతరం తిరిగి కర్ఫ్యూ విధించారు. అల్లర్లలో మృతిచెందిన ముగ్గురి కుటుంబాలతో పాటు గాయపడిన వారికి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి, తహసీల్దార్ అశోక్‌కుమార్ ఆర్థిక సహాయం కింద చెక్‌లను అందజేశారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కిషన్‌బాగ్, రాజేంద్రనగర్ ప్రాంతాలలో అదనపు బలగాలను కూడా మోహరించారు. ప్రశాంతతకు మజ్లిస్ భంగం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకు మజ్లిస్ పార్టీ యత్నిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల అనంతరం ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కుట్ర పన్నిందని, ఆ కోణంలోనే రాజేంద్రనగర్ శివారులోని సిక్‌చావ్నీలో మతఘర్షణలు చోటుచేసుకున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున శుక్రవారం మజ్లిస్ నేతలపై పోలీసులు దృష్టి పెట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
అల్లర్లపై గవర్నర్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని సిక్చావ్ని ప్రాంతంలో జరిగిన అల్లర్లపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని మాజీమంత్రి దానం నాగేందర్ రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, నగర డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్‌తో కలిసి గురువారం దానం గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తనకు ఫోన్ చేసి సంఘటన వివరాలు తెలుసుకోవడంతోపాటు జరిగిన ఘటనపట్ల సానుభూతి వ్యక్తం చేశారని చెప్పారు. మరోవైపు టీపీసీసీ కిసాన్- ఖేత్ మజ్దూర్ యూనియన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి గురువారం గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్‌ను కలిసి తెలంగాణలో ఆకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతోపాటు కనీస మద్దతు ధర చెల్లించాలని కోరారు. విత్తనం కొరత లేకుండా సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు సరఫరా చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
ఇష్టానికి విరుద్ధంగా కేటాయించొద్దు
గవర్నర్‌కు ఏపీ భవన్ ఉద్యోగుల వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ భవన్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రానికి కేటాయించాలని ఏపీభవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది. ఇష్టానికి విరుద్ధంగా ఉద్యోగులను వేరే రాష్ట్రాలకు కేటాయించరాదని కోరింది. ఈ మేరకు గురువారం గవర్నర్‌కు లేఖ రాసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్‌రావు, ప్రధాన కార్యదర్శి బాలకోటేశ్వర్రావు, కోశాధికారి లింగరాజులు తెలిపారు. ఏపీ భవన్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల విభజన ఇష్టారీతిగా చేశారని, ఆంధ్రా ప్రాంతం వారిని తెలంగాణకు, తెలంగాణ ప్రాంతం వారిని ఆంధ్రా ప్రాంతానికి వారి మనోభీష్టానికి విరుద్ధంగా కేటాయిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉద్యోగులను ఏ ప్రాంతంవారిని ఆ ప్రాంతానికి కేటాయించిన అనంతరం ఏవైనా పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని డెప్యుటేషన్లతో భర్తీ చేయాలని కోరారు. ఇక ఏపీ భవన్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారికి ఆప్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
మిగిలింది సీఎం ఒక్కరే!
* ‘సాక్షి’ చెప్పినట్లు సీఎం పేషీ ఖాళీ * కీలక శాఖలకు అధికారుల బదిలీ * సీఎం ప్రెస్ కార్యదర్శి సత్యారావు * ప్రెస్ అకాడెమీ చైర్మన్‌గా నియామకం * ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా అజయ్ కల్లం * జెన్కో ఎండీగా శంషీర్ సింగ్ రావత్ * సాగు నీటి శాఖకు జవహర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం ఖాళీ అయింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కరే మిగిలారు. ఆయన కూడా మంగళవారం సాయంత్రంలోగా పదవికి రాజీనామా చేయనున్నారు. ‘సాక్షి’ ఇంతకు ముందే చెప్పిన విధంగా సోమవారం ముఖ్యమంత్రి తన పేషీలోని అధికారులను కీలకమైన శాఖలకు బదిలీ చేశారు. తెలంగాణ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చకు రాగానే గవర్నర్ నరసింహన్‌ను కలిసి సీఎం పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే పలు కీలకమైన ఫైళ్లపై సీఎం సంతకాలు చేశారు. తన పేషీలోని అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎమ్మార్ కేసులో అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలంటూ సీబీఐ కోరిన ఫైలును తిరస్కరిస్తూ సంతకం చేశారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన ఫైళ్లను కూడా తిరస్కరిస్తూ శాఖాపరమైన విచారణలకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శి జవహర్‌రెడ్డిని సాగు నీటి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎన్. శ్రీధర్‌ను రాష్ర్ట బ్రూవరీస్, డిస్టిలరీస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేస్తున్న ఎం.సురేందర్‌ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా బదిలీ చేశారు. సీఎం ప్రెస్ కార్యదర్శి ఎ.సత్యారావును రాష్ట్ర ప్రెస్ అకాడెమీ చైర్మన్‌గా నియమించారు. సీఎం ముఖ్య కార్యదర్శి అజయ్కల్లంను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్‌ను జెన్కో ఎండీగా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. సీఎం మంగళవారం రాజీనామా చే సే వరకు ఈ ఇద్దరు అధికారులు ముఖ్యమంత్రి పేషీలో కొనసాగుతారు. సోమవారం జరిగిన మరికొందరు ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలివీ.. -
గవర్నర్ ఢిల్లీకి వచ్చారు.. వెళ్లారు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం ఉదయం ఢిల్లీ వచ్చి వెళ్లారు. ఉదయం తొమ్మిదిన్నర సమయంలో ఢిల్లీకి వచ్చిన నరసింహన్ కొద్దిసేపు ఏపీభవన్‌లో గడిపారు. అనంతరం ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన సమీప బంధువును పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడే దాదాపు రెండు గంటల సమయం గడిపిన నరసింహన్ సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగపయనమయ్యారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న నేపథ్యంలో అక్కడి పరిణామాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకే నరసింహన్ ఢిల్లీ వచ్చారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేకుండానే ఆయన పర్యటన ముగిసింది. -
ఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్
ఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ ఢిల్లీకి చేరుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడి మూడు రోజులపాటు గవర్నర్ బసచేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సంబంధిత విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కేంద్ర మంత్రుల బృందం కీలక అంశాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మంత్రుల బృందానికి అందుబాటులో ఉండేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. సీమాంధ్రలో ఒకపక్క ఆందోళనలు ఉవ్వెత్తున కొనసాగుతుండగా మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం విభజన అనంతరం చోటు చేసుకునే కీలక అంశాలపై దృష్టి సారించింది. -
విభజనపై మంత్రుల బృందాన్ని కలవనున్న గవర్నర్
హైదరాబాద్ :రాష్ట్ర విభజనపై గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ మంత్రుల బృందాన్ని కలువనున్నారు. దీనికి సంబంధించి ఆయన రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరనున్నారు. అక్కడి మూడు రోజులపాటు గవర్నర్ బసచేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సంబంధిత విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కేంద్ర మంత్రుల బృందం కీలక అంశాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మంత్రుల బృందానికి అందుబాటులో ఉండేందుకు ఢిల్లీ పయనం కానున్నారు. విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఒకపక్క ఆందోళనలు ఉవ్వెత్తున కొనసాగుతుండగా మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం శనివారం కీలక అంశాలపై దృష్టిసారించనున్నట్టు సమాచారం.