సాక్షి, హైదరాబాద్: సమాజంలో సభ్యుడిగా ఉంటూ. సమాజం కోసం పాటుపడేవారిని ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’కు ఎంపిక చేయడం ఆహ్వానించదగిన అంశమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఈ అవార్డులు పొందిన వారిని చూసి సమాజం స్ఫూర్తి పొందుతుందని ఆయన అన్నారు. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు 2018’కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఆరోగ్యం, విద్య తదితరరంగాల్లో విశేష కృషిచేస్తున్న వారిని అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీకి అభినందనలు. సమాజం సుఖ, సంతోషాలతో ఉండేందుకు ఆరోగ్య పరిరక్షణ, విద్య అత్యంత కీలకం.ఈ రెండు రంగాలను అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ రెండు రంగాలపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరముందనే విషయాన్ని ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు 2018’కార్యక్రమం నొక్కి చెప్పింది’అని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.
ఇలాంటి వార్తలను నివారించలేమా?
‘సమాజంలో ప్రతికూల ధోరణి క్రమంగా పెరుగుతోంది. పత్రికల మొదటి పేజీ, ఎలక్ట్రానిక్ మీడియాలో విచారకరమైన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడంతో.. సమాజంలో చెడు తప్ప మరేదీలేదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే ప్రమాదముంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా (ఫోర్త్ ఎస్టేట్) చెప్పుకునే మీడియాకు సంబంధించి.. నేను ఐదో లేదా ఆరో స్తంభంగా నా మనస్సాక్షి మేరకు మాట్లాడాలని అనుకుంటున్నా. నా మాటలు ఫోర్త్ ఎస్టేట్‌తో విభేదించేలా ఉన్నా.. సమాజంలో సానుకూల ధోరణి పెరిగేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా.
ఉదయాన్నే ఎస్‌వీబీసీ లాంటి భక్తి ఛానెల్‌ను చూస్తే ఓ రకమైన సంతృప్తి లభిస్తుంది. కానీ ఆ తర్వాత పేపర్ తెరిచి చూసినా.. టీవీ ఆన్ చేసినా అన్నీ చెడు వార్తలే కనిపిస్తాయి. ఇలాంటి వార్తలను మొదటి పేజీలు, టీవీ హెడ్‌లైన్లలో రాకుండా నివారించలేమా’అని గవర్నర్ నరసింహన్ ప్రశ్నించారు. తాను ఏ ఒక్క మీడియా సంస్థనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో ఇలాంటి సంస్కృతి ప్రబలకుండా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు.
నివారించాల్సిన బాధ్యత మీడియాపైనా..
‘వరకట్న వేధింపులు, గృహహింస తదితరాలను పదే పదే చూపే బదులు.. వాటిని నివారించేందుకు మీడియా ఎందుకు ప్రయత్నించదు. ప్రతీ దృశ్యాన్నీ ఫోటోలు, వీడియోలు తీసి చూపడం ద్వారా ఒరిగేదేమిటో నాకు అర్థం కావడంలేదు. ఈ విషయాలను గవర్నర్ హోదాలో కాకుండా.. నా మనస్సాక్షి మేరకు చెప్తున్నా’అని నరసింహన్ వ్యాఖ్యానించారు. ‘ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే పత్రికలు, టీవీ ఛానెళ్లు సమాజంలో అంతర్భాగమే. అందరికీ ఉపయోగపడే విధానాలు రూపొందించేలా మీడియా మార్గనిర్దేశనం చేయాలి. అందులో లోటు పాట్లపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి. తద్వారా సమాజం మార్పు దిశగా సాగుతుంది’అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ప్రమాదాలు, వరదలు సంభవించినపుడు మీడియా అనుసరించే ధోరణిపై కూడా గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో మీడియా కూడా తన వంతు సామాజిక బాధ్యతగా సహాయ సామగ్రి వంటివి చేరవేయడం ద్వారా ప్రజల్లో సానుకూల ధృక్పథం పెరిగేలా చూడాలన్నారు.
ఎవరైనా వెళ్లాల్సిందే.. సెన్సేషనలిజం వద్దు
‘ఈ రోజు సమాజంలో ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోలేని పరిస్థితి కనబడుతోంది. సత్యమేవ జయతే నినాదం ఉన్న దేశంలో సెన్సేషలిజం పెరుగుతోంది. సెన్సేషనలిజం ద్వారా పాఠకుల సంఖ్య, టీఆర్‌పీ రేటింగ్ పెరిగినా.. సమాజానికి మాత్రం నష్టమే చేకూరుతోంది. నిజాలను వెలికితీయడంలో మీడియా మార్గదర్శకత్వంతో వ్యవహరించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. ఓ వ్యక్తి మరణించకముందే బ్రేకింగ్ అంటూ వార్తలు వేస్తున్న పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. ‘ఈ గవర్నర్ వెళ్తున్నాడు.. వెళ్తామని మేము ముందే చెప్పాం’తరహా వార్తలపై నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఏదో ఒక గవర్నర్ వెళ్లక తప్పదు అని వ్యాఖ్యానించారు. వార్తల ప్రచురణ, ప్రసారంలో మీడియా సంస్థలు నైతిక విలువలు పాటించాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా చర్చలను అరుపులు కేకలు లేకుండా అర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే డైలీ సీరియళ్లకు బదులుగా సంతోషకరమైన కుటుంబ వాతావరణం ఉండేలా వాటిని ప్రసారం చేయాలని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు.
ఇతరులు స్ఫూర్తి పొందేలా అవార్డులు
సమాజంలో వివిధరంగాల్లో కృషి చేసిన వారికి గుర్తించి అవార్డులు ఇవ్వడం ద్వారా మరికొందరికి స్ఫూర్తి లభిస్తుందని సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి అన్నారు. నాలుగేళ్లుగా సాక్షి మీడియా గ్రూప్ ఎక్సలెన్స్ అవార్డులు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాక్షి మీడియా గ్రూపు మాజీ చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, రిటైర్డు ఐఎఎస్ అధికారి అజేయ కల్లం, ఏపీ డీజీపి దామోదర్ గౌతమ్ సవాంగ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, జ్యూరీ చైర్మన్ పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శాంతా సిన్హా, జ్యూరీ సభ్యులు ప్రణతి రెడ్డి, అరుణ బహుగుణ, చంద్రశేఖర్‌రెడ్డి, పద్మ రాజే, దొంతి నర్సింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌రావు, నరేంద్ర సురానా, వినోద్ కె అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment