పాతనగరంలోని సిక్‌చావ్నీలో జరిగిన పోలీస్‌కాల్పులపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
పాతబస్తీ కాల్పులపై గవర్నర్ ఆదేశం
* మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, క్షతగాత్రులకు 50 వేలు ఎక్స్‌గ్రేషియా
* కొనసాగుతున్న కర్ఫ్యూ... కోలుకుంటున్న బాధితులు
* కిషన్‌బాగ్‌లో డీజీపీ పర్యటన
సాక్షి, సిటీబ్యూరో: పాతనగరంలోని సిక్‌చావ్నీలో జరిగిన పోలీస్‌కాల్పులపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. పోలీసుకాల్పులు ఏకపక్షంగా ఉన్నాయంటూ పలు పార్టీలు ఆరోపిం చినందున గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలపై పోలీసు అధికారులతో గవర్నర్ నరసింహన్ గురువారం సమీక్షించారు. కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.ఆరు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు.
క్షతగాత్రుల కయ్యే వైద్యఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా, అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు గురువారం పర్యటించారు. అల్లర్లకు కారణాలు, చేపట్టిన బందోబస్తు గురించి సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. అల్లర్లు, కాల్పులు ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు.
నేటి వరకు కర్ఫ్యూ పొడిగింపు
పాతబస్తీలోని సిక్‌చావ్నీలో విధించిన కర్ఫ్యూను శుక్రవారం వరకు పొడిగించారు. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కర్ఫ్యూను సడలించడంతో ఆ ప్రాంత ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పరుగులు తీశారు. అనంతరం తిరిగి కర్ఫ్యూ విధించారు. అల్లర్లలో మృతిచెందిన ముగ్గురి కుటుంబాలతో పాటు గాయపడిన వారికి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి, తహసీల్దార్ అశోక్‌కుమార్ ఆర్థిక సహాయం కింద చెక్‌లను అందజేశారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కిషన్‌బాగ్, రాజేంద్రనగర్ ప్రాంతాలలో అదనపు బలగాలను కూడా మోహరించారు.
ప్రశాంతతకు మజ్లిస్ భంగం: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకు మజ్లిస్ పార్టీ యత్నిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల అనంతరం ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కుట్ర పన్నిందని, ఆ కోణంలోనే రాజేంద్రనగర్ శివారులోని సిక్‌చావ్నీలో మతఘర్షణలు చోటుచేసుకున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున శుక్రవారం మజ్లిస్ నేతలపై పోలీసులు దృష్టి పెట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.