b.prasada rao
-
వరంగల్ పోలీసులు భేష్
మావోయిస్టుల అణచివేతలో అగ్రభాగం పోలీసుల సమష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతం డీజీపీ ప్రసాదరావు జిల్లా కేంద్రంలో పలు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపన వరంగల్ క్రైం, న్యూస్‌లైన్: పోలీసుల సమష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. మావోయిస్టుల అణచివేతలో వరంగల్ పోలీసులు ముందున్నారని అన్నారు. ఆయన బుధవారం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భీమారం గ్రామంలో నిర్మించిన పోలీసు కల్యాణ మండపాన్ని తన సతీమణి సౌమినితో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత హన్మకొండ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించతలపెట్టిన సిబ్బంది విశ్రాంతి బ్యారక్‌కు శంకుస్థాపన చేశారు. జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో డిస్ట్రిక్ట్ గార్డ్స్ బ్రీఫింగ్ హాల్, పార్కింగ్ షెడ్, ధ్యాన మందిరం, ఎంటీ విభాగం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అర్బన్, రూరల్ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతిభ చూపిన రూరల్ అధికారులకు క్యాష్ రివార్డులను అందజేయగా, అర్బన్ పరిధిలోని అధికారులకు ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిస్టులను అణచివేసి ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో వరంగల్ పోలీసులు ముఖ్య భూమిక పోషించారని అన్నారు. మావోయిస్టులను ఎదుర్కోవడంలో జిల్లాకు చెందిన అధికారులు, సిబ్బంది తమ ప్రాణ త్యాగాలు చేశారని, అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల ప్రశాంత నిర్వాహణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఇందుకోసం శ్రమించిన హోంగార్డు స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకు అందరికీ అభినందనలు తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ విధులలో రాణించడంలో పోలీసు సిబ్బంది సతీమణుల పాత్ర కూడా కీలకమని అన్నారు. ఈ సమావేశంలో వరంగల్ రీజియన్ ఐజీ రవిగుప్తా, రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళిదాసు, ఎ.వెంకటేశ్వరరావు, అదనపు ఎస్పీలు యాదయ్య, కె.శ్రీకాంత్, డీఎస్పీలు జనార్దన్, దక్షిణమూర్తి, రాజిరెడ్డి, హిమవతి, సురేష్‌కుమార్, సీఐలు కిరణ్‌కుమార్, పృథ్వీధర్‌రావు, దేవేందర్‌రెడ్డిలతో పాటు ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కల్యాణ మండపాన్ని ప్రారంభించిన డీజీపీ దంపతులు భీమారం : వరంగల్ నగర పరిధిలోని కేయూసీ పోలీస్‌స్టేషన్ సమీపంలో నిర్మించిన పోలీసుల కల్యాణ మండపాన్ని డీజీపీ ప్రసాదరావు దంపతులు బుధవారం ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ పోలీసుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పోలీసుల కుటుంబాల కోసం ఈ ఫంక్షన్ హాల్‌ను నిర్మించినట్లు తెలిపారు. సుమారు రూ.70 లక్షలతో ఈ కల్యాణ మండపం పనులు చేపట్టారు. -
మెజిస్టీరియల్ విచారణ
పాతబస్తీ కాల్పులపై గవర్నర్ ఆదేశం * మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, క్షతగాత్రులకు 50 వేలు ఎక్స్‌గ్రేషియా * కొనసాగుతున్న కర్ఫ్యూ... కోలుకుంటున్న బాధితులు * కిషన్‌బాగ్‌లో డీజీపీ పర్యటన సాక్షి, సిటీబ్యూరో: పాతనగరంలోని సిక్‌చావ్నీలో జరిగిన పోలీస్కాల్పులపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. పోలీసుకాల్పులు ఏకపక్షంగా ఉన్నాయంటూ పలు పార్టీలు ఆరోపిం చినందున గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలపై పోలీసు అధికారులతో గవర్నర్ నరసింహన్ గురువారం సమీక్షించారు. కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.ఆరు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల కయ్యే వైద్యఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా, అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు గురువారం పర్యటించారు. అల్లర్లకు కారణాలు, చేపట్టిన బందోబస్తు గురించి సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. అల్లర్లు, కాల్పులు ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. నేటి వరకు కర్ఫ్యూ పొడిగింపు పాతబస్తీలోని సిక్‌చావ్నీలో విధించిన కర్ఫ్యూను శుక్రవారం వరకు పొడిగించారు. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కర్ఫ్యూను సడలించడంతో ఆ ప్రాంత ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పరుగులు తీశారు. అనంతరం తిరిగి కర్ఫ్యూ విధించారు. అల్లర్లలో మృతిచెందిన ముగ్గురి కుటుంబాలతో పాటు గాయపడిన వారికి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి, తహసీల్దార్ అశోక్‌కుమార్ ఆర్థిక సహాయం కింద చెక్‌లను అందజేశారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కిషన్‌బాగ్, రాజేంద్రనగర్ ప్రాంతాలలో అదనపు బలగాలను కూడా మోహరించారు. ప్రశాంతతకు మజ్లిస్ భంగం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకు మజ్లిస్ పార్టీ యత్నిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల అనంతరం ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కుట్ర పన్నిందని, ఆ కోణంలోనే రాజేంద్రనగర్ శివారులోని సిక్‌చావ్నీలో మతఘర్షణలు చోటుచేసుకున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున శుక్రవారం మజ్లిస్ నేతలపై పోలీసులు దృష్టి పెట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
ఏమరపాటు వద్దు: బి.ప్రసాదరావు
పోలీసులకు డీజీపీ ప్రసాదరావు ఆదేశాలు అభ్యర్థులు, అనుచరుల వెంటే షాడో టీమ్స్ ప్రచారమే కాదు ప్రతి కదలికపైనా నిఘా కీలక ఘట్టాలన్నీ పక్కాగా వీడియో సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏ అంశంలోనూ ఏమరుపాటుకు తావివ్వరాదని పోలీసు అధికారులను డీజీపీ బి.ప్రసాదరావు ఆదేశించారు. భద్రత, బందోబస్తు, ముందస్తు ఏర్పాట్లపై శనివారం తన కార్యాలయంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎస్పీలు, కమిషనర్లతో పాటు డీఐజీ, ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితోపాటు సాధారణ పోలీసులతోనూ అవసరమైన సంఖ్యలో షాడో టీమ్స్ ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు. ఇవి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు వారి కీలక అనుచరుల్నీ నీడలా వెంటాడనున్నాయి. ప్రచారం మాత్రమేగాక ఆద్యంతం వారి ప్రతి కదలికపైనా కన్నేసి ఉంచుతాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతోపాటు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు చెక్ చెప్పడంలో భాగంగా కీలక ఘట్టాలన్నింటినీ వీడియోగ్రఫీ చేయాలని, ఇందుకోసం అవసరమైతే ప్రైవేట్ వీడియో కెమెరాలను సమకూర్చుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు. - పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి డబ్బు, మద్యం పంపిణీ జోరందుకునే అవకాశం ఉండటంతో ఆ సమయాల్లో షాడో టీమ్స్ సంఖ్య పెంచాలని నిర్దేశించారు. కేంద్ర సాయుధ బలగాలతోసహా అదనపు బలగాలు ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరిన నేపథ్యంలో తనిఖీలు, సోదాలను మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. వివిధ విభాగాలతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల, కమిషనరేట్ల పోలీసులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. - ఫ్యాక్షన్ ప్రభావిత, ఉద్రిక్తతలు, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. - మావోయిస్టులు ఎన్నికల ప్రక్రియను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా అధికారులతో సమాచార మార్పిడి చేసుకోవాలని సూచించారు. - ఆయా రాష్ట్రాల్లో కేంద్రీకృతమైన కేడర్ నేరుగా చొచ్చుకు రాకపోయినప్పటికీ.. యాక్షన్ టీమ్‌లతో మెరుపుదాడులు చేసే ప్రమాదముందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదావరి, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళం జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. - ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేసి నగదు, మద్యం తరలింపుతోపాటు ప్రలోభాలకు సంబంధించినవిగా భావించే అనుమానిత వస్తువులకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు అన్నీ బంద్ సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఈనెల 30న, సీమాంధ్రలో మే 7వ తేదీన జరిగే పోలింగ్ రోజు ప్రైవేట్ సంస్థలేవీ తెరిచి ఉంచడానికి వీల్లేదని, వారికి గతంలో ఇచ్చిన మినహాయింపులు కూడా ఆరోజు వర్తించవని కార్మిక శాఖ కమిషనర్ డాక్టర్ అశోక్ శనివారం స్పష్టం చేశారు. ఆ రెండు రోజుల్లో ఉద్యోగులంతా ఓటింగ్‌లో పాల్గొనడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో పోలింగ్ రోజున సెలవు దినంగా ప్రకటించాలని పేర్కొన్నారు. ఐటీ, సాఫ్ట్వేర్, ఐఈటీఎస్ పాలసీ ప్రకారం వాటికి మినహాయింపు ఉన్నా పోలింగ్ రోజు వర్తించదని స్పష్టం చేశారు. అలాగే 365 రోజులూ దుకాణాలు తెరిచి ఉంచే ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు కూడా పోలింగ్ రోజున పని చేయడానికి వీల్లేదని కమిషనర్ పేర్కొన్నారు. -
రాష్ట్రానికి అదనపు బలగాలు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతిపాలన నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన పోలీసు అధికారుల సంఘం విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతిపాలన పురస్కరించుకుని శాంతిభద్రతలపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న కేంద్ర బలగాలకు తోడు ముందు జాగ్రత్తలో భాగంగా మరికొన్ని అదనపు బలగాలను కేంద్రం నుంచి రప్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నాయని చెప్పారు. నగర పోలీసు కమిషనరేట్లు, ఇతర జిల్లాల్లో ముందస్తు చర్యగా పలు జాగ్రత్తలను తీసుకున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకే భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు జరిపామని, మరికొన్ని బదిలీలు జరుగుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తామని ఆయన తెలిపారు. -
అర్హులైన పోలీసులకు ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: పోలీసులలో అర్హులైన వారికి ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతులను కల్పించే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసుల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతులను ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేస్తూనే... దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల్లో ఇస్తున్న పదోన్నతుల పద్ధతిపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఎస్ఐలకు గెజిటెడ్ హోదాను కల్పించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. పోలీసులకు ప్రత్యేక పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. పోలీసు సంఘానికి చెందిన ప్రతి జిల్లా అధ్యక్షుడిని లైజాన్ ఆఫీసర్‌గా గుర్తిస్తామని, తమ జిల్లాల సమస్యలను వీరు నేరుగా తనతో చర్చించవచ్చని చెప్పారు. విభజన ఉద్యమాల సందర్భంగా పోలీసులు నిర్వహించిన పాత్ర ఎనలేనిదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ కొనియాడారు. రాష్ట్ర పోలీసులకు దేశంలోనే అత్యుత్తమ పోలీసు శాఖగా పేరుందని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. పోలీసుల సంక్షేమానికి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటున్నామని పోలీసు సంక్షేమ విభాగం ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి సిబ్బంది సంక్షేమంపై డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని డీజీపీకి అందచేశారు. -
'ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ గ్యాంగ్..'
ఎర్ర చందనం అక్రమ రవాణాలో వీరప్పన్ అనుచరుల హస్తం ఉండవచ్చనే అనుమానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ చీఫ్ బి ప్రసాదరావు వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ... చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను స్మగ్లర్లు హత్య చేయడం ఆందోళన కలిగిస్తోంది అని ప్రసాదరావు అన్నారు. హత్యలను, సంఘటనలను బట్టి చూస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ గ్యాంగ్ ఉందేమో అనే అనుమానం కలుగుతోంది అని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక వీరప్పన్ అనుచరుల పాత్ర ఉందో లేదో అని స్పష్టంగా చెప్పలేము కాని.. అక్రమ కలప రవాణకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లేనని డీజీపీ అన్నారు. అక్రమ కలప రవాణ మాఫియాను అరికట్టేందుకు ఫారెస్ట్ శాఖతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఫారెస్ట్ అధికారులతోపాటు, ఆయుధాలు ధరించిన పోలీసులతో చెక్ పోస్ట్ ల వద్ద భారీ నిఘాను పెట్టమాని ప్రసాదరావు ఓప్రశ్నకు సమాధానంగా జవాబిచ్చారు. 2013 సంవత్సరంలో అక్రమ ఎర్రచందనం రవాణా వ్యవహారంలో 3249 మందిని అరెస్ట్ చేసి.. 531 కేసుల్ని నమోదు చేశామని తెలిపారు. -
జిల్లాకు రావడం అదృష్టం
సాక్షి, న ల్లగొండ: ఎస్పీగా పనిచేసిన జిల్లాకు డీజీపీ హోదాలో రావడం తన అదృష్టమని డీజీపీ బి. ప్రసాదరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ)లో పోలీసు అధికారులతో సమావేశమై శాఖాపరమైన అంశాలపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 10 నెలల పాటు పనిచేసిన కాలంలో అన్ని వర్గాల ప్రజల నుంచి సహకారం అందిందని గుర్తుచేసుకున్నారు. శాఖలో అధికారుల మధ్య ఐక్యత , అంకితభావం వల్ల జిల్లాలో ప్రశాంతత నెలకొందన్నారు. పరిపాలన కూడా సజావుగా సాగుతోందని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో మొట్టమొదటి సారిగా బస్ టికెట్ మిషన్ జిల్లాలోనే ప్రవేశపెట్టానని గుర్తు చేశారు. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. లక్షల ఎకరాలకు సాగునీరందించే నాగార్జునసాగర్ జిల్లాకే వరమన్నారు. ఇక్కడి ప్రజలు మంచి స్వభావం గలవారని కొనియాడారు. కొన్ని సమస్యల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. క్యాంటీన్లో సబ్సిడీపై వస్తువులు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్ర సంక్షేమ సబ్సిడీ పోలీస్ క్యాంటీన్‌ను డీజీపీ దంపతులు ప్రసాదరావు, సౌమిని ప్రారంభించారు. వీరికి ఎస్పీ దంపతులు టి. ప్రభాకర్‌రావు, పావని ఇతర పోలీసు అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. క్యాంటీన్లో డీజీపీ స్వయంగా రైస్ కుక్కర్ కొనుగోలు చేశారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోసి మాట్లాడారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా క్యాంటీన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇందుకు కృషి చేసిన ఎస్పీని ప్రశంసించారు. నిత్యావసర సరుకులు, వస్తువుల కొనుగోళ్లపై 20 నుంచి 30 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని పోలీసు కుటుంబాలు వినియోగించుకోవాలని కోరారు.