సాక్షి, న ల్లగొండ: ఎస్పీగా పనిచేసిన జిల్లాకు డీజీపీ హోదాలో రావడం తన అదృష్టమని డీజీపీ బి. ప్రసాదరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ)లో పోలీసు అధికారులతో సమావేశమై శాఖాపరమైన అంశాలపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 10 నెలల పాటు పనిచేసిన కాలంలో అన్ని వర్గాల ప్రజల నుంచి సహకారం అందిందని గుర్తుచేసుకున్నారు. శాఖలో అధికారుల మధ్య ఐక్యత , అంకితభావం వల్ల జిల్లాలో ప్రశాంతత నెలకొందన్నారు. పరిపాలన కూడా సజావుగా సాగుతోందని చెప్పారు.
ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో మొట్టమొదటి సారిగా బస్ టికెట్ మిషన్ జిల్లాలోనే ప్రవేశపెట్టానని గుర్తు చేశారు. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. లక్షల ఎకరాలకు సాగునీరందించే నాగార్జునసాగర్ జిల్లాకే వరమన్నారు. ఇక్కడి ప్రజలు మంచి స్వభావం గలవారని కొనియాడారు. కొన్ని సమస్యల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
క్యాంటీన్‌లో సబ్సిడీపై వస్తువులు
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్ర సంక్షేమ సబ్సిడీ పోలీస్ క్యాంటీన్‌ను డీజీపీ దంపతులు ప్రసాదరావు, సౌమిని ప్రారంభించారు. వీరికి ఎస్పీ దంపతులు టి. ప్రభాకర్‌రావు, పావని ఇతర పోలీసు అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. క్యాంటీన్‌లో డీజీపీ స్వయంగా రైస్ కుక్కర్ కొనుగోలు చేశారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోసి మాట్లాడారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా క్యాంటీన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇందుకు కృషి చేసిన ఎస్పీని ప్రశంసించారు. నిత్యావసర సరుకులు, వస్తువుల కొనుగోళ్లపై 20 నుంచి 30 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని పోలీసు కుటుంబాలు వినియోగించుకోవాలని కోరారు.
జిల్లాకు రావడం అదృష్టం
Published Wed, Dec 11 2013 4:13 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement