అర్హులైన పోలీసులకు ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: పోలీసులలో అర్హులైన వారికి ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతులను కల్పించే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు హామీ ఇచ్చారు. అదే సమయంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసుల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతులను ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేస్తూనే... దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల్లో ఇస్తున్న పదోన్నతుల పద్ధతిపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదాను కల్పించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. పోలీసులకు ప్రత్యేక పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. పోలీసు సంఘానికి చెందిన ప్రతి జిల్లా అధ్యక్షుడిని లైజాన్ ఆఫీసర్‌గా గుర్తిస్తామని, తమ జిల్లాల సమస్యలను వీరు నేరుగా తనతో చర్చించవచ్చని చెప్పారు. విభజన ఉద్యమాల సందర్భంగా పోలీసులు నిర్వహించిన పాత్ర ఎనలేనిదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ కొనియాడారు. రాష్ట్ర పోలీసులకు దేశంలోనే అత్యుత్తమ పోలీసు శాఖగా పేరుందని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పారు. పోలీసుల సంక్షేమానికి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటున్నామని పోలీసు సంక్షేమ విభాగం ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి సిబ్బంది సంక్షేమంపై డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని డీజీపీకి అందచేశారు.