ఏమరపాటు వద్దు: బి.ప్రసాదరావు
- పోలీసులకు డీజీపీ ప్రసాదరావు ఆదేశాలు
- అభ్యర్థులు, అనుచరుల వెంటే షాడో టీమ్స్
- ప్రచారమే కాదు ప్రతి కదలికపైనా నిఘా
- కీలక ఘట్టాలన్నీ పక్కాగా వీడియో
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏ అంశంలోనూ ఏమరుపాటుకు తావివ్వరాదని పోలీసు అధికారులను డీజీపీ బి.ప్రసాదరావు ఆదేశించారు. భద్రత, బందోబస్తు, ముందస్తు ఏర్పాట్లపై శనివారం తన కార్యాలయంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎస్పీలు, కమిషనర్లతో పాటు డీఐజీ, ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితోపాటు సాధారణ పోలీసులతోనూ అవసరమైన సంఖ్యలో షాడో టీమ్స్ ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు.
ఇవి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు వారి కీలక అనుచరుల్నీ నీడలా వెంటాడనున్నాయి. ప్రచారం మాత్రమేగాక ఆద్యంతం వారి ప్రతి కదలికపైనా కన్నేసి ఉంచుతాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతోపాటు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు చెక్ చెప్పడంలో భాగంగా కీలక ఘట్టాలన్నింటినీ వీడియోగ్రఫీ చేయాలని, ఇందుకోసం అవసరమైతే ప్రైవేట్ వీడియో కెమెరాలను సమకూర్చుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు.
- పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి డబ్బు, మద్యం పంపిణీ జోరందుకునే అవకాశం ఉండటంతో ఆ సమయాల్లో షాడో టీమ్స్ సంఖ్య పెంచాలని నిర్దేశించారు. కేంద్ర సాయుధ బలగాలతోసహా అదనపు బలగాలు ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరిన నేపథ్యంలో తనిఖీలు, సోదాలను మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. వివిధ విభాగాలతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల, కమిషనరేట్ల పోలీసులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
- ఫ్యాక్షన్ ప్రభావిత, ఉద్రిక్తతలు, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
- మావోయిస్టులు ఎన్నికల ప్రక్రియను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా అధికారులతో సమాచార మార్పిడి చేసుకోవాలని సూచించారు.
- ఆయా రాష్ట్రాల్లో కేంద్రీకృతమైన కేడర్ నేరుగా చొచ్చుకు రాకపోయినప్పటికీ.. యాక్షన్ టీమ్‌లతో మెరుపుదాడులు చేసే ప్రమాదముందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదావరి, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళం జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
- ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేసి నగదు, మద్యం తరలింపుతోపాటు ప్రలోభాలకు సంబంధించినవిగా భావించే అనుమానిత వస్తువులకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు.
పోలింగ్ రోజు అన్నీ బంద్
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఈనెల 30న, సీమాంధ్రలో మే 7వ తేదీన జరిగే పోలింగ్ రోజు ప్రైవేట్ సంస్థలేవీ తెరిచి ఉంచడానికి వీల్లేదని, వారికి గతంలో ఇచ్చిన మినహాయింపులు కూడా ఆరోజు వర్తించవని కార్మిక శాఖ కమిషనర్ డాక్టర్ అశోక్ శనివారం స్పష్టం చేశారు.
ఆ రెండు రోజుల్లో ఉద్యోగులంతా ఓటింగ్‌లో పాల్గొనడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో పోలింగ్ రోజున సెలవు దినంగా ప్రకటించాలని పేర్కొన్నారు. ఐటీ, సాఫ్ట్‌వేర్, ఐఈటీఎస్ పాలసీ ప్రకారం వాటికి మినహాయింపు ఉన్నా పోలింగ్ రోజు వర్తించదని స్పష్టం చేశారు. అలాగే 365 రోజులూ దుకాణాలు తెరిచి ఉంచే ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్‌లు కూడా పోలింగ్ రోజున పని చేయడానికి వీల్లేదని కమిషనర్ పేర్కొన్నారు.