7,98,892 బద్ధకస్తులు
సాక్షి, కర్నూలు: ఓటు వజ్రాయుధం వంటిది. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వినియోగించుకోవాలి. మంచి నాయకున్ని ఎన్నుకోవాలి.. అంటూ జిల్లా అధికారులు చేసిన ప్రచారం ఫలించలేదు. పోలింగ్ శాతం పెరిగితే ఓటర్లకు సెల్‌ఫోన్లు ఇస్తామని ఆశ చూపినా ప్రయోజనం లేకపోయింది. కళా జాతాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ఓటింగ్ శాతం 80 నుంచి 85 వరకు రాబట్టాలని జిల్లా ఎన్నికల అధికారులు యత్నించారు. అయితే వారి అంచనాలు తారుమారయ్యాయి. 2009 కంటే స్వల్పంగా నాలుగు శాతం పోలింగ్ పెరిగి 74తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా కేంద్రమైన కర్నూలు నియోజకవర్గంలో
అత్యల్పంగా 58 శాతం నమోదైంది. అత్యధికంగా శ్రీశైలం నియోజకవర్గంలో 81 శాతం పోలింగ్ జరిగింది. ఈ సారి పట్టణ ఓటర్ల కంటే మారుమూల ప్రాంతాల్లోని వారే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్నూలు, ఆదోని నియోజకవర్గాలు మినహా మిగిలిన 12 నియోజకవర్గాల్లో 70 శాతానికి మించి పోలింగ్ నమోదు కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 30,56,867 మంది ఓటర్లుండగా 22,57,975 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 7,98,892 మంది ఓటర్లు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పురుషుల్లో 11,40,336 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. జిల్లాలో అత్యధిక ఓటర్లుగా ఉన్న మహిళలు 11,17,619 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళ, పురుష ఓటర్ల మధ్య తేడా 38,431 ఓట్లు ఉండటం విశేషం. అయితే బనగానపల్లె నియోజకవర్గంలో మహిళలు 87,598 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. పురుషులు 85,570 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులకంటే 2,028 మంది మహిళలు అదనంగా ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.
ఓటింగ్ తగ్గడానికి కారణాలు ఇవే..
విద్యా సంస్థలకు పది రోజుల ముందే వేసవి సెలవులు ఇచ్చేయడం.. చాలా మంది స్వస్థలాలకు వెళ్లడంతో వీరు పోలింగ్‌కు గైర్హాజరయ్యారని తెలుస్తోంది. నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. జిల్లాలో వందకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో బారులు తీరిన ఓటర్లు వేచిచూడలేక వెనుదిరిగారు. ఓటరు చిట్టీల పంపిణీ చాలా చోట్ల సరిగా జరగలేదు. కొన్ని కేంద్రాల్లో స్త్రీ, పురుషులకు వేర్వేరు ఏర్పాట్లు లేకపోవడంతో పలువురు ఓటేయకుండా వెనుదిరిగారు. నెల రోజుల కిందట జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మార్చడంతో ఓటర్లు తికమక పడ్డారు.