ఈవీఎంలలో నే‘తల’ రాతలు
ఎన్నికల్లో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డిన నేతల తలరాతలు ఓట్ల రూపంలో స్ట్రాంగ్ రూముల్లోకి చేరిపోయాయి. గెలుపోటముల భవిష్యత్తు ఈవీఎంలలో భద్రంగా ఉన్నారుు. వచ్చే నెల 16వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు వరకు అన్ని పార్టీల నాయకుల్లో ఉత్కంఠ తప్పని పరిస్థితి నెలకొంది.
42 స్ట్రాంగ్ రూములకు మూడంచెల భద్రత
వచ్చే నెల 16 వరకు తప్పని ఉత్కంఠ
కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమిళనాడు,పుదుచ్చేరిలో గురువారం పోలింగ్ ముగిసింది. ప్రజలు భారీ శాతంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా తమ బాధ్యతను నెరవేర్చారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రాత్రింబవళ్లు ప్రచారం చేసి అలసిన నేతలు ఫలితాల కోసం ఎదురుచూస్తూ సేదతీరుతున్నారు. అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా ప్రధాని పీఠాన్ని అధిరోహిం చాలని అమ్మ ఆశతో ఎదురుచూస్తున్నారు. రెండు దఫాలుగా కేంద్రంలో చక్రం తిప్పిన డీఎంకే మూడోసారి ముచ్చటగా తాము బలపరిచిన ప్రభుత్వమే రావాలని ఆశిస్తోంది.
యూపీఏ ప్రభుత్వానికి చెల్లుచీటి ఇచ్చి కేంద్రంలో బీజేపీ జెండా పాతడం ఖాయమని ఆ పార్టీ కూటమి గట్టి నమ్మకంతో ఉంది. పరువు దక్కించుకునేలా స్థానాలు వస్తే చాలని దింపుడు కళ్లెం ఆశగా కాంగ్రెస్ కాచుక్కూర్చుని ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. గెలుపు కోసం ఎన్ని అక్రమాలకైనా పాల్పడతారని ముందుగానే ఊహించిన ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ఓటుకు నోటుతో ప్రజలను ప్రలోభపెట్టడ ంలో రాష్ట్ర నేతలు దేశంలోనే తమిళనాడును రెండవ స్థానం నిలిపారు. ఇది ఆందోళన కలిగించే అంశమని అధికారులు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపునకు మరో 22 రోజులు ఉండడంతో అంతవరకు బ్యాలెట్ బాక్సులను భద్రంగా ఉంచడం అధికారులకు సవాల్‌గా మారింది. గురువారం సాయంత్రం పోలింగ్ ముగియగానే ఎన్నికల ఏజెంట్లు, అధికారుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీలు వేశారు.
వాటిని కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు రాత్రికి రాత్రే తరలించి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. మొత్తం 40 నియోజకవర్గాలకు సంబంధించి 42 లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. లెక్కింపు కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూములు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి స్ట్రాంగ్ రూము వద్దా మూడంచెల సాయుధ పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు.
అందరికీ శుక్రవార ప్రసన్నమే
పరీక్షలు రాసిన విద్యార్థులకు, రాజకీయ నేతలకు ఫలితాల విషయంలో మే నెలలోని శుక్రవారాలే కీలకం కాను న్నాయి. ప్లస్-2 రాసిన విద్యార్థుల ఫలితాలు 9వ తేదీన, ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫలితాలు 23వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 15 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే 40 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు ఓటములు 16వ తేదీన తేలిపోనున్నారుు. ఈ మూడు తేదీలు శుక్రవారమే కావడం కాకతాళీయమే.