విజయవంతం!
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను ప్రశాంత పూరిత వాతావరణంలో విజయవంతం చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. సెలవులు ప్రకటించని మూడు ఐటీ సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఓటింగ్ కు దూరంగా ఉన్న ప్రజలను బుజ్జగించి మరీ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చామన్నారు.
- బుజ్జగించి ఓట్లేయించాం
- మూడు ఐటీ సంస్థలపై చర్యలు
- ఈసీ ప్రవీణ్‌కుమార్
సాక్షి, చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు చెన్నై సచివాలయం నుంచి ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. గంటకోమారు చొప్పున ఎన్నికల నమోదు శాతా న్ని తెప్పించుకుంటూ వచ్చారు. అలాగే, వచ్చిన ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే రీతిలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు ఆదేశాలు ఇచ్చారు.
వెబ్ కెమెరాల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించినానంతరం ప్రవీణ్‌కుమార్ కాసేపు నగరంలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఆయా కేంద్రాల్లో స్వయంగా పర్యటించి ఓటింగ్ శాతం, అక్కడి ఏర్పాటను వీక్షించారు. కొన్ని చోట్ల ఓటర్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రవీణ్‌కుమార్‌కు ఏర్పడింది.
ఆయన్ను చుట్టుముట్టిన ఓటర్లు పలు రకాల ఫిర్యాదులు చేశారు. గుర్తింపు కార్డుల్లో పేర్లు తప్పుగా ఉండడం, బూత్ స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరగలేదంటూ ఆరోపించారు. వారందరికీ సమాధానాలు ఇస్తూ, సంయమనంతో ప్రవీణ్‌కుమార్ బుజ్జగించారు. అనంతరం కీల్పాకంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.
ప్రశాంతంగా ఓటింగ్: రాష్ర్ట వ్యాప్తంగా తాము చేపట్టిన కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత పూరిత వాతావరణంలో విజయవంతం చేశామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు చేసుకోలేదని, ఇక మీదట కూడా చోటుచేసుకోవని, ఎన్నికలు విజయవంతమైనట్టేనని ధీమా వ్యక్తం చేశారు.
పలు చోట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయని, అన్నింటినీ పరిష్కరించామని వివరించారు. కొన్ని ప్రైవేటు స్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చా రు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, వాటిని వెనువెంటనే మార్చామని వివరించారు.
పొల్లాచ్చిలో ఓటర్లకు విందు ఏర్పాటు చేసిన సమాచారంతో కట్టడి చేయడానికి చర్యలు తీసుకున్నామని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అనేక చోట్ల సిరా చుక్క మీద ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సరిదిద్దుకున్నామని చెప్పారు.
మూడు ఐటీ సంస్థలపై కేసు: చెన్నైలోని మూడు ఐటీ సంస్థలపై కేసు నమోదు చేశామని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల రోజు అన్ని సంస్థలు సెలవులు ప్రకటించాలన్న ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హెచ్‌సీఎల్, విప్రో, టెక్ మహేంద్ర సంస్థలు విధులు నిర్వర్తించాయి.
దీంతో ఆయా సంస్థల్లో ఉదయం 3500 మంది విధులకు వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకుని ఆ సంస్థ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబ్బందిని ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ పంపించేశారు. ఎన్నికల ఆదేశాల్ని బేఖాతరు చేసిన ఆ మూడు ఐటీ సంస్థలపై కేసులు నమోదు చేశారు. శాఖా పరంగా చర్యలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను రాష్ట్ర ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ సిఫారసు చేశారు.