అన్నాడీఎంకేలో ముదిరిన ఆధిపత్య పోరు.. నేనంటే నేనని.. | Chennai: Political War Between Panneerselvam Palanisamy For Aiadmk President Seat | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేలో ముదిరిన ఆధిపత్య పోరు.. నేనంటే నేనని..

Published Sat, Jun 18 2022 12:39 PM | Last Updated on Sat, Jun 18 2022 2:06 PM

Chennai: Political War Between Panneerselvam Palanisamy For Aiadmk President Seat - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంపై సర్వాధికారం తనదేనని, ప్రధాన కార్యదర్శిగా ఎడపాడిని అంగీకరించేది లేదని పన్నీర్‌సెల్వం పట్టుదలతో ఉన్నారు. మెజారిటీ శ్రేణులు తనవైపే ఉంటే పన్నీర్‌సెల్వం నాయకత్వం ఎలా సాధ్యమంటూ ఎడపాడి పళనిస్వామి మెట్టుదిగలేదు. ఎవరికివారు చేసుకుంటున్న సన్నాహాలతో అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు శుక్రవారం తీవ్ర రూపం దాల్చింది.  

అన్నాడీఎంకేను స్థాపించిన ఎంజీ రామచంద్రన్‌ ఆ పార్టీ తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన మరణించిన తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టిన జయలలిత ఎంజీఆర్‌ గౌరవార్థం అధ్యక్ష పదవిని అలాగే ఉంచి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జయ మరణం తరువాత ఎడపాడి, పన్నీర్‌సెల్వం సమ ఉజ్జీవులుగా మారారు. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఓ పన్నీర్‌సెల్వం, కో–కన్వీనర్‌గా ఎడపాడి పళనిస్వామి పార్టీ బాధ్యతలను సమానంగా పంచుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిన తరువాత పార్టీలో ఏక నాయకత్వం నినాదం తెరపైకి వచ్చింది. ఈనెల 23వ తేదీ పార్టీ జనరల్‌ బాడీ సమావేశం జరుగనున్న తరుణంలో ఎడపాడి పళనిస్వామికి అనుకూలంగా ఏక నాయకత్వం వివాదం విశ్వరూపం దాల్చింది.

తిరువణ్ణామలైలో జరిగిన ఒక కార్యక్రమానికి ఎడపాడి పళనిస్వామి శుక్రవారం వెళ్లగా జిల్లా వ్యాప్తంగా ఆయనకు అనుకూలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ‘పార్టీ ప్రధాన కార్యదర్శికి స్వాగతం’ ‘పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శి’ ‘అన్నాడీఎంకేకు వందేళ్లు మార్గదర్శకంగా నిలిచే నేత’ తదితర నినాదాలతో ఎడపాడి అనుచరులు ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపాయి. అలాగే ఎడపాడి పళనిస్వామి సొంతూరైన ఎడపాడిలో ఓపీఎస్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ పోస్టర్లు వెలిశాయి. పార్టీ జిల్లా కార్యదర్శులు, నిర్వాహకులను ఓపీఎస్, ఈపీఎస్‌ వేర్వేరుగా ఆహ్వానించి సమాలోచనలు జరిపేందుకు సన్నాహలు చేస్తున్నారు. అయితే ఇద్దరూ కలిసి తమను ఆహ్వానించడమే పార్టీకి శ్రేయస్కరమని కొందరు హితవుపలికారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకునే ప్రశ్నే లేదని మిత్రపక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమ వైఖరిని స్పష్టం చేశారు. 

జయకు ద్రోహం చేస్తున్న ఎడపాడి: ఓపీఎస్‌
ప్రధాన కార్యదర్శి పదవిని ఎవరు చేపట్టినా అది జయలలితకు చేసిన ద్రోహమే అవుతుందని పరోక్షంగా ఎడపాడిని ఉద్దేశిస్తూ పన్నీర్‌సెల్వం గురువారం సాయంత్రం మీడియా ముందు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతేగాక పార్టీకి తానే శాశ్వత ప్రధాన కార్యదర్శినని ప్రకటించినట్లుగా తెలిపారు. జయలలిత హయాంలో ప్రభుత్వం అనేక ఒడిదుడుకులు ఎదుర్కోగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తానే ప్రభుత్వాన్ని నిలబెట్టానని పన్నీర్‌సెల్వం గుర్తు చేశారు.

పార్టీ శ్రేణులు ఏక నాయకత్వాన్నే కోరుకుంటే అందుకు తానే అర్హుడినని పన్నీర్‌సెల్వం వాదిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏక నాయకత్వం అవసరం లేదని అన్నారు. అదే జరిగితే ఎలాంటిæ కారణాల చేత తనను పక్కనపెట్టేందుకు వీలులేదని చెప్పారు. పార్టీ చీలిపోకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తన అంగీకారం లేనిదే పార్టీ సమావేశాల్లో చేసే ఎలాంటి తీర్మానం చెల్లదని ఎడపాడిని ఓపీఎస్‌ స్పష్టం చేశారు. అదే జరిగితే చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని హెచ్చరించారు. 

స్పందించొద్దు: ఎడపాడి 
పన్నీర్‌ వైఖరి ఇలా ఉండగా ఎడపాడి పళనిస్వామి మరో కోణంలో నింపాదిగా అడుగులు వేస్తున్నారు. ఏక నాయకత్వం వ్యవహారం, పన్నీర్‌ చేస్తున్న ఆరోపణలపై స్పందించొద్దని తన అనుచరులను ఆదేశించారు. 23వ తేదీ జరిగే జనరల్‌బాడీ సమావేశంలో చూసుకుందామని అన్నారు. పార్టీలో పూర్తిస్థాయి పెత్తనం కోసం ఎడపాడి, పన్నీర్‌సెల్వం మధ్య అన్నాడీఎంకేలో 4 రోజులుగా రగులుతున్న రచ్చ రసకందాయంలో పడింది. ఎడపాడి దూకుడుకు కళ్లెం వేసేందుకు పన్నీర్‌సెల్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీపై తన వైఖరిని పన్నీర్‌సెల్వం మీడియా సమావేశం ద్వారా స్పష్టతనిచ్చారు. ఇరువురి మధ్య క్యాడర్‌ నలిగిపోతుండగా మాజీ ఎంపీ తంబిదురై ద్వారా సామరస్యపూర్వక సంధికి కొందరు పూనుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement