panneer selvem
-
పన్నీర్ సెల్వానికి మరో షాక్.. ఇద్దరు కుమారులపైనా వేటు
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వానికి(ఓపీఎస్) మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఓపీఎస్‌ను తొలగించిన కొద్ది రోజుల్లోనే ఆయన కుమారులు సహా మరో 16 మందిపై బహిష్కరణ వేటు వేశారు పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రెటరీ పళనిస్వామి(ఈపీఎస్). క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పన్నీరు సెల్వం వర్గంపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పన్నీరు సెల్వం కుమారులైన.. థేని లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు రవీంద్రనాథ్, జయప్రదీప్, మాజీ మంత్రి వెల్లమండి ఎన్ నటరాజన్‌లను బహిష్కరించినట్లు పార్టీ తెలిపింది. వారితో పాటు శాసనసభ మాజీ సభ్యులు, ఎంపీలు మొత్తం మరో 15 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పళనిస్వామి. మొత్తం 18 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, వారంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అందుకే వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చినట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో.. ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేశారు. పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్)ను ఎన్నుకున్నారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యంత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇదీ చూడండి: AIADMK General Body Meet: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పళనికి పార్టీ పగ్గాలు -
అన్నాడీఎంకేలో ముదిరిన ఆధిపత్య పోరు.. నేనంటే నేనని..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంపై సర్వాధికారం తనదేనని, ప్రధాన కార్యదర్శిగా ఎడపాడిని అంగీకరించేది లేదని పన్నీర్‌సెల్వం పట్టుదలతో ఉన్నారు. మెజారిటీ శ్రేణులు తనవైపే ఉంటే పన్నీర్‌సెల్వం నాయకత్వం ఎలా సాధ్యమంటూ ఎడపాడి పళనిస్వామి మెట్టుదిగలేదు. ఎవరికివారు చేసుకుంటున్న సన్నాహాలతో అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు శుక్రవారం తీవ్ర రూపం దాల్చింది. అన్నాడీఎంకేను స్థాపించిన ఎంజీ రామచంద్రన్ ఆ పార్టీ తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన మరణించిన తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టిన జయలలిత ఎంజీఆర్ గౌరవార్థం అధ్యక్ష పదవిని అలాగే ఉంచి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జయ మరణం తరువాత ఎడపాడి, పన్నీర్‌సెల్వం సమ ఉజ్జీవులుగా మారారు. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఓ పన్నీర్‌సెల్వం, కో–కన్వీనర్‌గా ఎడపాడి పళనిస్వామి పార్టీ బాధ్యతలను సమానంగా పంచుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిన తరువాత పార్టీలో ఏక నాయకత్వం నినాదం తెరపైకి వచ్చింది. ఈనెల 23వ తేదీ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగనున్న తరుణంలో ఎడపాడి పళనిస్వామికి అనుకూలంగా ఏక నాయకత్వం వివాదం విశ్వరూపం దాల్చింది. తిరువణ్ణామలైలో జరిగిన ఒక కార్యక్రమానికి ఎడపాడి పళనిస్వామి శుక్రవారం వెళ్లగా జిల్లా వ్యాప్తంగా ఆయనకు అనుకూలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ‘పార్టీ ప్రధాన కార్యదర్శికి స్వాగతం’ ‘పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శి’ ‘అన్నాడీఎంకేకు వందేళ్లు మార్గదర్శకంగా నిలిచే నేత’ తదితర నినాదాలతో ఎడపాడి అనుచరులు ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపాయి. అలాగే ఎడపాడి పళనిస్వామి సొంతూరైన ఎడపాడిలో ఓపీఎస్ నాయకత్వాన్ని బలపరుస్తూ పోస్టర్లు వెలిశాయి. పార్టీ జిల్లా కార్యదర్శులు, నిర్వాహకులను ఓపీఎస్, ఈపీఎస్ వేర్వేరుగా ఆహ్వానించి సమాలోచనలు జరిపేందుకు సన్నాహలు చేస్తున్నారు. అయితే ఇద్దరూ కలిసి తమను ఆహ్వానించడమే పార్టీకి శ్రేయస్కరమని కొందరు హితవుపలికారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకునే ప్రశ్నే లేదని మిత్రపక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమ వైఖరిని స్పష్టం చేశారు. జయకు ద్రోహం చేస్తున్న ఎడపాడి: ఓపీఎస్ ప్రధాన కార్యదర్శి పదవిని ఎవరు చేపట్టినా అది జయలలితకు చేసిన ద్రోహమే అవుతుందని పరోక్షంగా ఎడపాడిని ఉద్దేశిస్తూ పన్నీర్‌సెల్వం గురువారం సాయంత్రం మీడియా ముందు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతేగాక పార్టీకి తానే శాశ్వత ప్రధాన కార్యదర్శినని ప్రకటించినట్లుగా తెలిపారు. జయలలిత హయాంలో ప్రభుత్వం అనేక ఒడిదుడుకులు ఎదుర్కోగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తానే ప్రభుత్వాన్ని నిలబెట్టానని పన్నీర్‌సెల్వం గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు ఏక నాయకత్వాన్నే కోరుకుంటే అందుకు తానే అర్హుడినని పన్నీర్‌సెల్వం వాదిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏక నాయకత్వం అవసరం లేదని అన్నారు. అదే జరిగితే ఎలాంటిæ కారణాల చేత తనను పక్కనపెట్టేందుకు వీలులేదని చెప్పారు. పార్టీ చీలిపోకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తన అంగీకారం లేనిదే పార్టీ సమావేశాల్లో చేసే ఎలాంటి తీర్మానం చెల్లదని ఎడపాడిని ఓపీఎస్ స్పష్టం చేశారు. అదే జరిగితే చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని హెచ్చరించారు. స్పందించొద్దు: ఎడపాడి పన్నీర్ వైఖరి ఇలా ఉండగా ఎడపాడి పళనిస్వామి మరో కోణంలో నింపాదిగా అడుగులు వేస్తున్నారు. ఏక నాయకత్వం వ్యవహారం, పన్నీర్ చేస్తున్న ఆరోపణలపై స్పందించొద్దని తన అనుచరులను ఆదేశించారు. 23వ తేదీ జరిగే జనరల్‌బాడీ సమావేశంలో చూసుకుందామని అన్నారు. పార్టీలో పూర్తిస్థాయి పెత్తనం కోసం ఎడపాడి, పన్నీర్‌సెల్వం మధ్య అన్నాడీఎంకేలో 4 రోజులుగా రగులుతున్న రచ్చ రసకందాయంలో పడింది. ఎడపాడి దూకుడుకు కళ్లెం వేసేందుకు పన్నీర్‌సెల్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీపై తన వైఖరిని పన్నీర్‌సెల్వం మీడియా సమావేశం ద్వారా స్పష్టతనిచ్చారు. ఇరువురి మధ్య క్యాడర్ నలిగిపోతుండగా మాజీ ఎంపీ తంబిదురై ద్వారా సామరస్యపూర్వక సంధికి కొందరు పూనుకున్నారు. -
అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్ వార్.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్ పళని స్వామి మధ్య మళ్లీ అంతర్గత పోరు తెర మీదకు వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిన్నమ్మ శశికళ దూకుడు, పార్టీని కాపాడుకునేందుకు పన్నీరు, పళని సారథ్యంలోని సమన్వయ కమిటీ సాగిస్తున్న కుస్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హఠాత్తుగా సోమవారం సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చిన్నమ్మ శశికళ నామస్మరణను అందుకోవడం చర్చకు దారి తీసింది. చిన్నమ్మను ఆది నుంచి పళని స్వామితో పాటుగా సీనియర్లు వ్యతిరేకిస్తున్న తరుణంలో, అందరితో చర్చించి చిన్నమ్మ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడంలో ఆంతర్యాన్ని పసిగట్టే పనిలో రాజకీయ విశేష్లకులు నిమగ్నమయ్యారు. ( చదవండి: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు ) టార్గెట్.. ప్రధాన కార్యదర్శి పదవి తానే ప్రధాన కార్యదర్శి అని శశికళ స్పష్టం చేస్తూ వస్తున్న తరుణంలో ఆ పదవి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు పళని రచించిన వ్యూహం మంగళవారం రాజకీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్లో అన్నాడీఎంకే కార్యవర్గం, సర్వసభ్య సమావేశం నిర్వహించి, రద్దు చేసిన ఆ పదవిని మళ్లీ పునరుద్ధరించి, చేజిక్కించుకునేందుకు పళని వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జంట నాయకత్వాన్ని పక్కన పెట్టి, ఏకాధిప్యతం లక్ష్యంగా సీనియర్లతో పళని రహస్య మంతనాలు చేస్తున్న విషయం పన్నీరు దృష్టికి రావడంతోనే హఠాత్తుగా చిన్నమ్మను జపాన్ని ఆయన తెర మీదకు తెచ్చినట్టు సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి తన గుప్పెట్లోకి వచ్చిన తరువాత.. చిన్నమ్మ దూకుడుకు కళ్లెం వేయవచ్చన్న ధీమాతో పళని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా చిన్నమ్మ నినాదాన్ని పన్నీరు అందుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నమ్మ పర్యటన ఓవైపు అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట మళ్లీ తెర రాగా, మరోవైపు కేడర్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు చిన్నమ్మ దృష్టి పెట్టారు. మంగళవారం చెన్నై నుంచి ఆమె తంజావూరుకు బయలుదేరి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలే కాకుండా, మద్దతుదారులు ఆమెకు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. మూడు రోజుల పాటుగా ఆమె తంజావూరు, మదురై, రామనాథపురంలో పర్యటించనున్నారు. చదవండి: Vijayakanth: నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన.. -
Tamil Nadu: ఢిల్లీకి ఎడపాడి, పన్నీర్‌సెల్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలైన నాటి నుంచి రాజకీయంగా రంగులు మారుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ సమన్వయకర్త ఓ పన్నీర్‌సెల్వం, ఉపసమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు మొలకెత్తాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై, ఎన్నికల తరువాత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం మొదలకుని అన్ని ప్రధానమైన వ్యవçహారాల్లో ఓపీఎస్, ఈపీఎస్ నడుమ అగాథం పెరుగుతూ వస్తోంది. త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనుండగా, ద్వంద సారథ్యానికి ఓపీఎస్, ఆయన అనుచర వర్గం అభ్యంతరం చెబుతున్నారు. దివంగత జయలలిత హయాంలో వలెనే పార్టీకి ఒకే ఒక అధినాయకత్వం ఉండాలి, అది నేనై ఉండాలి అని పన్నీర్‌సెల్వం పట్టుబడుతున్నారు. ‘స్థానికం’లో బీజేపీ ఒంటరి పోరు.. ఇదిలా ఉండగా, గడిచిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని పోటీచేసిన బీజేపీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. కూటమి నీడనే కొనసాగితే క్షేత్రస్థాయిలో ‘కమలం’ వికసించదనే భావన బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తువల్లనే నాలుగుసీట్లు దక్కాయని బీజేపీలో కొందరు చేస్తున్న వాదనపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను వేర్వేరుగా చూడాలని, అదే సమయంలో అన్నాడీఎంకేతో సామరస్య ధోరణిని కొనసాగించాలని సూచించినట్లు సమాచారం. అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వపక్షం నుంచే పోటీగా అభ్యర్థులు రంగంలోకి దిగినపుడు ఎలాంటి వైఖరి అవలంభించాల ని అన్నాడీఎంకే మదనపడుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకే స్థానిక ఎన్నికల్లో ఒంటరిపోరుపై బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయం తీసుకుందని తెలుస్తు న్నా ‘అయిననూ పోయిరావలె అనేలా ఓపీఎస్,ఈపీఎస్‌లు ఢిల్లీ బాటపట్టారు. వేర్వేరుగా ఛలో ఢిల్లీ.. ఈ నేపథ్యంలో ఓపీఎస్, ఈపీఎస్ హఠాత్తుగా వేర్వేరుగా ఢిల్లీ పయనమయ్యారు. ఆదివారం ఉదయం పన్నీర్‌సెల్వం, రాత్రి ఎడపాడి పళనిస్వామి ఢిల్లీ విమానం ఎక్కారు. ఎడపాడి కంటే ముందుగానే ఓపీఎస్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను సోమవారం కలుసుకునేలా అపాయింట్మెంట్ సాధించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉప్పందడంతో హుటాహుటిన ఎడపాడి సైతం ఢిల్లీకి బయలుదేరారు. వీరివురూ ఒకేసారి మోదీ, నడ్డాలను కలుస్తారా లేక వేర్వేరుగా భేటీ అవుతారా అనేది సోమవారంగానీ తేటతెల్లంకాదు. -
AIADMK: ‘ఓపీఎస్.. ఒకే నాయకత్వం’
అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన నాటి నుంచి తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. జంట నాయకత్వం వద్దు, ఒకే నాయకత్వం కావాలి అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం వర్గం మరోసారి నిరసన గళం విప్పి వివాదానికి తెరదీసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అన్నాడీఎంకే పార్టీ పదేళ్ల పాటు అధికారంలో కొనసాగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. జయలలిత మరణం తరువాత పార్టీ ఇద్దరి (ఓపీఎస్, ఈపీఎస్) సారధ్యంలోకి వెళ్లింది. మూడోసారి గెలవడం ద్వారా హాట్రిక్ కొట్టగలమని ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగినా అధికారం డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆనాటి నుంచి ఓటమితో కుంగిపోయిన పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎన్నికల అనంతరం జరిగిన తొలి సమావేశంలో అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఉప సమన్వకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మధ్య అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కోసం పోటీ నెలకొంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ప్రధాన ప్రతిపక్షనేతగా ఎడపాడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉప నేతగా పన్నీర్‌సెల్వం పేరును ఎడపాడి ప్రతిపాదించారు. అధికారంలో ఉన్నా లేకున్నా నెంబర్ టూగా ఉండాలా అంటూ నిరాకరించిన పన్నీర్‌సెల్వం సీనియర్ నేతల బుజ్జగింపుల తరువాత ఒప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం చెన్నై రాయపేటలోని ప్రధాన కార్యాలయంలో కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ప్రతిపక్ష పార్టీగా భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు పన్నీర్, ఎడపాడి సమక్షంలో అంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఓపీఎస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ‘పార్టీకి ఏక నాయకత్వం ఉండాలి’ అంటూ ఆయన వర్గం నేతలు నినాదాలు చేయడం కలకలం రేపింది. ఈ నినాదాలు చేసిన తన వర్గం నేతలను పన్నీర్‌సెల్వం వారించనూ లేదు, ప్రోత్సహించనూ లేదు. అందరికీ నమస్కరిస్తూ లోనికి వెళ్లిపోయారు. ఆరు తీర్మానాలు కాగా సంస్థాగత ఎన్నికలు, పార్టీ పరంగా భవిష్యత్ కార్యాచరణపై కొద్దిసేపు చర్చించిన పార్టీ అధినేతలు ఈ సందర్భంగా ఆరు తీర్మానాలు చేశారు. కావేరి నదీజలాల వాటా విషయంలో తమిళనాడు హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి, మేఘధాతు ఆనకట్ట నిర్మాణాన్ని అడ్డుకోవాలి, వరి ధాన్యాల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ జాప్యానికి ఖండన, కుటుంబ పెద్దకు రూ.1000ల హామీని నెరవేర్చకుంటే పోరాటం తదితర తీర్మానాల ఆమోదంతో సమావేశం ముగిసింది. -
AIADMK: ఉపనేత ఎంపికపై ఉడుంపట్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై : శాసనసభాపక్ష ఉప నేత ఎన్నికపై తలెత్తిన భిన్నాభిప్రాయాలతో అన్నాడీఎంకేలో మరోసారి రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. ఎప్పటిలాగే పార్టీ కో–ఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం, డిప్యూటీ కో–ఆర్డినేటర్ ఎడపాడి పళనిస్వామి పరస్పరం ఢీకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఏర్పాటైన సమావేశంలో ఎడపాడి, పన్నీర్ పోటీపడ్డారు. నాలుగేళ్లు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపించిన ఎడపాడినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన మద్దతుదారులు బహిరంగంగా గళం విప్పారు. పార్టీ అధినేతను కాబట్టి తానే సీఎం అభ్యర్థినని పన్నీర్‌సెల్వం పట్టుబట్టారు. పార్టీ ద్వితీయశ్రేణి నేతలు పన్నీర్‌సెల్వంను కలిసి పదిరోజులపాటు బుజ్జగించడంతో పట్టువీడారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడపాడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో పన్నీర్‌సెల్వం తీవ్ర మనస్థాపం చెంది ఎడపాడిని అభినందించకుండానే సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు. ఎన్నికల్లో 65 సీట్లకే పరిమితం కావడంతో అన్నాడీఎంకేలో స్తబ్దత నెలకొంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తుండడంతో అన్నాడీఎంకేలో కదలిక వచ్చింది. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు అగ్రనేతలు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమయంలో మళ్లీ ఎడపాడి, పన్నీర్ మళ్లీ పోటీపడ్డారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిపోయింది. కొన్నిరోజుల తర్వాత నిర్వహించిన సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎడపాడి వైపే నిలవడంతో ఆయన పేరునే ఖరారు చేశారు. ‘టూ’ ఎంపికలో వన్ అండ్ టూ మళ్లీ ఢీ ఎన్నికలకు ముందు ఒకసారి, ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి విభేదాలతో రచ్చకెక్కిన ఎడపాడి, పన్నీర్‌సెల్వం శాసనసభాపక్ష ఉప నేత ఎంపిక విషయంలో మూడోసారి పరోక్షంగా ముష్టియుద్దం సాగిస్తున్నారు. ఉప సభాపక్ష నేతగా పన్నీర్‌సెల్వంను ఎంపిక చేసుకోవాలని ఎడపాడి ఆశించారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, నేడు ప్రతిపక్షంలో ఉపనేత, తర్వాత పార్టీలో సైతం తనను ద్వితీయ స్థానానికి నెట్టే ప్రమాదం ఉందని అనుమానించిన పన్నీర్ సెల్వం అందుకు అయిష్టతను వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష ఉప నేత పదవికి ద్వితీయశ్రేణి నేతల్లో పోటీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే వైద్యలింగం పట్ల పన్నీర్‌సెల్వం సుముఖుత వ్యక్తం చేస్తుండగా, దీన్ని ఎడపాడి వర్గీయులు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, నత్తం శ్రీనివాసన్ పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరూ ఎడపాడికి రబ్బర్‌స్టాంప్‌లా మారుతారనే విమర్శ రావడంతో మాజీ మంత్రి విజయభాస్కర్ పేరును సూచించారు. వైద్యలింగం మినహా మరెవరినీ అంగీకరించేది లేదని పన్నీర్‌సెల్వం భీష్మించుకుని కూర్చున్నారు. సీనియార్టీతోపాటు సామాజిక సమతుల్యం కూడా పాటించాలని కొందరు పేర్కొనడంతో కేపీ మునుస్వామి తదితరుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఎడపాడి, పన్నీర్‌సెల్వం ఏకాభిప్రాయానికి వస్తేగానీ ఉప నేత ఎంపిక వ్యవహారం కొలిక్కివచ్చే పరిస్థితి లేదు. చదవండి: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ -
దిండుగల్‌లో పోస్టర్ల హల్చల్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీఎం వివాదం రోజుకో రూపంలో తెరపైకి వస్తోంది. దిండుగల్‌లో సీఎం పన్నీరు.. డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇది దిండుగల్ అన్నాడీఎంకే గ్రూపువార్‌ను తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి అంటూ మంత్రులు సెల్లూరు రాజు, కేటీ రాజేంద్ర బాలాజీల భిన్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇది కాస్త సీఎం, డిప్యూటీ సీఎం శిబిరాల మధ్య చిచ్చుకు దారి తీసింది. బుధవారం దిండుగల్ జిల్లాలో సీఎంపన్నీరు..డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. దిండుగల్ జిల్లా అన్నాడీఎంకేలో మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కీలకం. ఇది వరకు పన్నీరు విశ్వాసపాత్రుడి ఉన్న విశ్వనాథన్, ప్రస్తుతం సీఎం పళనికి నమ్మకస్తుడయ్యారు. ఇది దిండుగల్ శ్రీనివాసన్ మద్దతుదారుల్ని కలవరంలో పడేసింది. నత్తం రూపంలో శ్రీనివాసన్‌కు చిక్కులు తప్పవన్న ఆందోళన బయలుదేరింది. ఈ పరిస్థితుల్లో రెండు శిబిరాల వివాదం కాస్త సీఎం ఎవరో చర్చను మరోమారు తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో గెలుపుతో సీఎంగా పన్నీరు, డిప్యూటీ సీఎంగా పళని వ్యవహరించడం ఖాయం అంటూ వెలిసిన ఈ పోస్టర్లు దిండుగల్ రాజకీయ గ్రూప్ వార్‌ను తెర పైకి తెచ్చింది. -
అన్నాడీఎంకే తీవ్ర నిర్ణయం.. 130మందిపై వేటు
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలోని ఓ ఐదారుగురు సొంత ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారని, వారు తమ పద్దతిని మార్చుకోవాలని అన్నాడీఎంకే రెబల్ అభ్యర్థి, ఎమ్మెల్యే దినకరన్ అన్నారు. లేకపోతే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అదే ప్రభుత్వం విషయంలో కూడా జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. కాగా, దీనిపై మీడియా ప్రతినిధులు పన్నీర్‌ను ప్రశ్నించగా 'అదంత దినకరన్ కల మాత్రమే. ఆయన కలలపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను' అని పన్నీర్ చెప్పారు. కాగా, తమకు రెబల్‌గా తయారైన టీటీవీ దినకరన్ కోటను బద్ధలు కొట్టే కార్యక్రమాల్లో అధికార అన్నాడీఎంకే పార్టీ వేగం పెంచింది. దాదాపు 130మంది దినకరన్ మద్దతుదారులుగా గుర్తించి పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల నుంచి వీరిని తొలగించినట్లు ప్రకటించింది. పార్టీ సమన్వయ కర్త, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, సహ సమన్వయ కర్త, సీఎం కే పళనిస్వామి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. తిర్పూర్, పుదుకొట్టాయ్, ధర్మపురి ప్రాంతాల్లోని పార్టీకి సంబంధించిన వారిని దినకరన్ మద్దతుదారులుగా గుర్తించి తొలగించినట్లు తెలిపారు. వీరిలో 65మంది ఒక్క తిర్పూర్ నుంచే అధికంగా ఉన్నారు. -
చేతులు కలిపిన ఓపీఎస్, ఈపీఎస్
-
పండుగవేళ.. రాష్ట్రమంతా కరువు!
తమ రాష్ట్రం మొత్తం కరువు కోరల్లో విలవిల్లాడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చెప్పారు. రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ఆయన ప్రకటించారు. దక్షిణాది వారికి, అందునా తమిళులకు అత్యంత ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి సమయంలో ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం. తీవ్రమైన నీటి కొరత కారణంగా.. రైతులకు భూమిపన్నును మినహాయిస్తున్నట్లు చెప్పడంతో పాటు పలు రాయితీలు కూడా ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ. 160 కోట్లు, పల్లెల్లో సాగునీటి కోసం రూ. 350 కోట్లను విడుదల చేశారు. ప్రధానంగా కర్ణాటకతో కావేరీ జలాల వివాదం కారణంగా తమిళనాడుకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. తాగు, సాగునీటి కోసం తమిళులు అల్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా కూడా ప్రకటించడంతో కావేరీ జలాల కోసం మరింతగా కర్ణాటకను పట్టుబట్టే అవకాశం ఏర్పడింది. తమిళనాడుకు ఇప్పటికే కర్ణాటక నుంచి రోజుకు 2వేల క్యూసెక్కుల కావేరీ జలాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ఈ నీటిని వదులుతోంది.