సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలైన నాటి నుంచి రాజకీయంగా రంగులు మారుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ సమన్వయకర్త ఓ పన్నీర్‌సెల్వం, ఉపసమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు మొలకెత్తాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై, ఎన్నికల తరువాత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం మొదలకుని అన్ని ప్రధానమైన వ్యవçహారాల్లో ఓపీఎస్, ఈపీఎస్ నడుమ అగాథం పెరుగుతూ వస్తోంది. త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనుండగా, ద్వంద సారథ్యానికి ఓపీఎస్, ఆయన అనుచర వర్గం అభ్యంతరం చెబుతున్నారు. దివంగత జయలలిత హయాంలో వలెనే పార్టీకి ఒకే ఒక అధినాయకత్వం ఉండాలి, అది నేనై ఉండాలి అని పన్నీర్‌సెల్వం పట్టుబడుతున్నారు.
‘స్థానికం’లో బీజేపీ ఒంటరి పోరు..
ఇదిలా ఉండగా, గడిచిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని పోటీచేసిన బీజేపీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. కూటమి నీడనే కొనసాగితే క్షేత్రస్థాయిలో ‘కమలం’ వికసించదనే భావన బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తువల్లనే నాలుగుసీట్లు దక్కాయని బీజేపీలో కొందరు చేస్తున్న వాదనపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను వేర్వేరుగా చూడాలని, అదే సమయంలో అన్నాడీఎంకేతో సామరస్య ధోరణిని కొనసాగించాలని సూచించినట్లు సమాచారం.
అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వపక్షం నుంచే పోటీగా అభ్యర్థులు రంగంలోకి దిగినపుడు ఎలాంటి వైఖరి అవలంభించాల ని అన్నాడీఎంకే మదనపడుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకే స్థానిక ఎన్నికల్లో ఒంటరిపోరుపై బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయం తీసుకుందని తెలుస్తు న్నా ‘అయిననూ పోయిరావలె అనేలా ఓపీఎస్,ఈపీఎస్‌లు ఢిల్లీ బాటపట్టారు.
వేర్వేరుగా ఛలో ఢిల్లీ..
ఈ నేపథ్యంలో ఓపీఎస్, ఈపీఎస్ హఠాత్తుగా వేర్వేరుగా ఢిల్లీ పయనమయ్యారు. ఆదివారం ఉదయం పన్నీర్‌సెల్వం, రాత్రి ఎడపాడి పళనిస్వామి ఢిల్లీ విమానం ఎక్కారు. ఎడపాడి కంటే ముందుగానే ఓపీఎస్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను సోమవారం కలుసుకునేలా అపాయింట్‌మెంట్ సాధించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉప్పందడంతో హుటాహుటిన ఎడపాడి సైతం ఢిల్లీకి బయలుదేరారు. వీరివురూ ఒకేసారి మోదీ, నడ్డాలను కలుస్తారా లేక వేర్వేరుగా భేటీ అవుతారా అనేది సోమవారంగానీ తేటతెల్లంకాదు.
Comments
Please login to add a commentAdd a comment