చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వానికి(ఓపీఎస్) మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఓపీఎస్‌ను తొలగించిన కొద్ది రోజుల్లోనే ఆయన కుమారులు సహా మరో 16 మందిపై బహిష్కరణ వేటు వేశారు పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రెటరీ పళనిస్వామి(ఈపీఎస్). క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పన్నీరు సెల్వం వర్గంపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
పన్నీరు సెల్వం కుమారులైన.. థేని లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు రవీంద్రనాథ్, జయప్రదీప్, మాజీ మంత్రి వెల్లమండి ఎన్ నటరాజన్‌లను బహిష్కరించినట్లు పార్టీ తెలిపింది. వారితో పాటు శాసనసభ మాజీ సభ్యులు, ఎంపీలు మొత్తం మరో 15 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పళనిస్వామి. మొత్తం 18 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, వారంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అందుకే వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చినట్లు చెప్పారు.
కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో.. ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేశారు. పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్)ను ఎన్నుకున్నారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యంత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర‍్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: AIADMK General Body Meet: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పళనికి పార్టీ పగ్గాలు
Comments
Please login to add a commentAdd a comment