panneeru Selvam
-
పన్నీర్ సెల్వానికి మరో షాక్.. ఇద్దరు కుమారులపైనా వేటు
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వానికి(ఓపీఎస్) మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఓపీఎస్‌ను తొలగించిన కొద్ది రోజుల్లోనే ఆయన కుమారులు సహా మరో 16 మందిపై బహిష్కరణ వేటు వేశారు పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రెటరీ పళనిస్వామి(ఈపీఎస్). క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పన్నీరు సెల్వం వర్గంపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పన్నీరు సెల్వం కుమారులైన.. థేని లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు రవీంద్రనాథ్, జయప్రదీప్, మాజీ మంత్రి వెల్లమండి ఎన్ నటరాజన్‌లను బహిష్కరించినట్లు పార్టీ తెలిపింది. వారితో పాటు శాసనసభ మాజీ సభ్యులు, ఎంపీలు మొత్తం మరో 15 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పళనిస్వామి. మొత్తం 18 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, వారంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అందుకే వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చినట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో.. ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేశారు. పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్)ను ఎన్నుకున్నారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యంత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇదీ చూడండి: AIADMK General Body Meet: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పళనికి పార్టీ పగ్గాలు -
అన్నాడీఎంకేలో కుర్చీ వార్
సాక్షి, చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో నిప్పు రాజుకుంది. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు ‘నేనంటే నేనే’ అంటూ వాదులాడుకునే స్థాయికి చేరింది. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు పార్టీ సోమవారం స్పష్టం చేసింది. చదవండి: (కుష్బూను సందిగ్ధంలో పడేసిన గ్రూపు రాజకీయాలు) ఎడపాడి, పన్నీర్ మాటల యుద్ధం చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సోమవారం పార్టీ కార్యవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. ఎడపాడి, పన్నీర్ వర్గాలు రెండుగా విడిపోయి బలప్రదర్శన చేస్తూ తమ నేతలకు స్వాగతం పలికాయి. తమనేతే సీఎం అభ్యర్థి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సీఎం ఎడపాడికి బందోబస్తు పెంచారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ అంశంపై 11 మందితో మార్గదర్శక కమిటీని వేయాలని పన్నీర్ ప్రతిపాదించగా, పార్టీ పరంగానే నిర్ణయం తీసుకోవచ్చు, కమిటీ అవసరం లేదని ఎడపాడి నిరాకరించారు. జయలలిత ఆదేశాల మేరకు సీఎం అయినందున తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని పన్నీర్‌సెల్వం చెప్పగా, మిమ్మల్నే కాదు జయను సైతం సీఎంను చేసింది శశికళేనని ఎడపాడి బదులిచ్చారు. సుమారు ఐదు గంటపాటు సమావేశం జరిగినా ఓ అవగాహనకు రాలేకపోయారు. వచ్చే నెల 7వ తేదీన జరుగనున్న జనరల్ బాడీ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ సంయుక్తంగా ప్రకటన చేస్తారని ఆ పార్టీ అగ్రనేత కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు. 15 తీర్మానాలు ఆమోదం పార్టీ ప్రయోజనాలు, సిద్ధాంతాలకు కట్టుబడి సమష్టిగా పాటుపడదాం, తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం జీఎస్టీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల బకాయిలను చెల్లించాలని, కరోనా కష్టకాలంలో ప్రజల కోసం శ్రమించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఆరోగ్య, పోలీస్ శాఖలతోపాటు అన్నాడీఎంకే శ్రేణులకు ధన్యవాదాలు, ద్విభాషా విధానం, తమిళనాడులో నీట్ పరీక్ష రద్దు తదితర 15 తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. -
పళని తంత్రం, దినకరన్ గప్‌చుప్!
► పన్నీరు సందిగ్ధం ► ఇక, ఆ ముగ్గురే తనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారి నోళ్లకు తాళం వేయడం లక్ష్యంగా సీఎం పళని స్వామి రాజకీయ తంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు గప్‌చుప్‌మని శనివారం సీఎం ఎదుట కూర్చోవడం ఇందుకు నిదర్శనం. ఇక, వివాదం రాజుకుంటుందని ఎదురుచూసిన పన్నీరు శిబిరం చివరకు సందిగ్ధంలో పడక తప్పలేదు. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే ముక్కలైన విష యం తెలిసిందే. మాజీ సీఎం పన్నీరు సెల్వం వెంట కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కదిలారు. చిన్నమ్మ, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆదేశాలతో మిగిలిన వాళ్లు సీఎం పళని స్వామి వెన్నంటే ఉన్నా, తదుపరి పరిణామాలతో అక్కడినుంచి జారుకున్న వాళ్లు పెరిగారు. వీరంతా ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పక్షాన చేరారు. సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా స్వరాన్ని పెంచి మరీ విరుచుకుపడే పనిలో పడ్డారు. ఈ పరిణామాలు కాస్త సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టాయని చెప్పవచ్చు. ఈ సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో కేంద్రం మెప్పుపొందే రీతిలో పళని స్వామి అడుగులు వేశారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మాజీ సీఎం పన్నీరు కూడా కోవింద్‌కే మద్దతు అన్నారు. అయిష్టంగా దినకరన్ వర్గం కూడా మద్దతు ప్రకటించింది. పళని మార్క్ పాలనపరంగా తన మార్క్ పడే రీతిలో ముందుకు సాగుతున్న పళని స్వామి, పార్టీలోనూ పట్టు సా«ధించే పనిలో ఉన్నారు. అయితే, తనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు 34 మంది గళం విప్పడంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు రాజకీయ తంత్రాన్ని ప్రయోగించినట్టున్నారు. దినకరన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు అడపాదడపా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా..? అన్నట్టుగా స్పందిస్తుండటంతో రాత్రికి రాత్రే వారి నోళ్లకు తాళం వేయడం గమనించాల్సిన విషయం. చెన్నైలో మద్దతు సేకరణకు వచ్చిన బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్ కోవింద్ సమక్షంలో దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు తమ గళాన్ని విప్పే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, గప్‌చుప్‌మని కూర్చొని సీఎం పళని స్వామి ప్రసంగాలకు చప్పుట్లు కొట్టి ఆహ్వానించడం విశేషం. అంతా పళని దారికొస్తారా..? దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలను అణచివేసే రీతిలో సీఎం తన తంత్రాన్ని ప్రయోగించడంతోనే వారంతా గప్‌చుప్ అయ్యారని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటుండటం ఆలోచించాల్సిందే. కాగా, కోవింద్ సమక్షంలో దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా గళం విప్పతే దాన్ని తమకు అనుకూలంగా మలచుకుని కేంద్రం వద్ద మార్కులు కొట్టే వ్యూహంతో ఉన్న పన్నీరు శిబిరాన్ని ఈ గప్‌చుప్ సందిగ్ధంలో పడేసినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దినకరన్ సీఎం వద్ద శరణు కోరే పరిస్థితులు మున్ముందు వస్తాయని, పన్నీరు శిబిరం ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తమ వైపునకు వచ్చే సమయం ఆసన్నం అవుతోందంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఆ ముగ్గురు .. తమకు మిత్రపక్షంగా ఉన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు పళని ప్రయత్నాల్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనియరసు, తమీమున్ అన్సారీ, కరుణాస్ అన్నాడీ చిహ్నం మీద గెలిచారు. ఈ ముగ్గురు డీఎంకే వైపు తమ చూపును మరల్చేందుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరు కోవింద్ మద్దతు కార్యక్రమానికి కూడా దూరంగా ఉండటంతో, ఇక, వారిని దారిలో తెచ్చుకునేందుకు పళని తంత్రాన్ని ప్రయోగించబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, తలా ఓ చిన్న పార్టీకి చెందిన ఈ ముగ్గురు తలొగ్గేనా అన్నది వేచి చూడాల్సిందే.