సాక్షి ప్రతినిధి, చెన్నై : శాసనసభాపక్ష ఉప నేత ఎన్నికపై తలెత్తిన భిన్నాభిప్రాయాలతో అన్నాడీఎంకేలో మరోసారి రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. ఎప్పటిలాగే పార్టీ కో–ఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం, డిప్యూటీ కో–ఆర్డినేటర్ ఎడపాడి పళనిస్వామి పరస్పరం ఢీకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఏర్పాటైన సమావేశంలో ఎడపాడి, పన్నీర్ పోటీపడ్డారు. నాలుగేళ్లు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపించిన ఎడపాడినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన మద్దతుదారులు బహిరంగంగా గళం విప్పారు. పార్టీ అధినేతను కాబట్టి తానే సీఎం అభ్యర్థినని పన్నీర్‌సెల్వం పట్టుబట్టారు.
పార్టీ ద్వితీయశ్రేణి నేతలు పన్నీర్‌సెల్వంను కలిసి పదిరోజులపాటు బుజ్జగించడంతో పట్టువీడారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడపాడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో పన్నీర్‌సెల్వం తీవ్ర మనస్థాపం చెంది ఎడపాడిని అభినందించకుండానే సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు.
ఎన్నికల్లో 65 సీట్లకే పరిమితం కావడంతో అన్నాడీఎంకేలో స్తబ్దత నెలకొంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తుండడంతో అన్నాడీఎంకేలో కదలిక వచ్చింది. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు అగ్రనేతలు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమయంలో మళ్లీ ఎడపాడి, పన్నీర్ మళ్లీ పోటీపడ్డారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిపోయింది. కొన్నిరోజుల తర్వాత నిర్వహించిన సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎడపాడి వైపే నిలవడంతో ఆయన పేరునే ఖరారు చేశారు.
‘టూ’ ఎంపికలో వన్ అండ్ టూ మళ్లీ ఢీ
ఎన్నికలకు ముందు ఒకసారి, ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి విభేదాలతో రచ్చకెక్కిన ఎడపాడి, పన్నీర్‌సెల్వం శాసనసభాపక్ష ఉప నేత ఎంపిక విషయంలో మూడోసారి పరోక్షంగా ముష్టియుద్దం సాగిస్తున్నారు. ఉప సభాపక్ష నేతగా పన్నీర్‌సెల్వంను ఎంపిక చేసుకోవాలని ఎడపాడి ఆశించారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, నేడు ప్రతిపక్షంలో ఉపనేత, తర్వాత పార్టీలో సైతం తనను ద్వితీయ స్థానానికి నెట్టే ప్రమాదం ఉందని అనుమానించిన పన్నీర్ సెల్వం అందుకు అయిష్టతను వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష ఉప నేత పదవికి ద్వితీయశ్రేణి నేతల్లో పోటీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే వైద్యలింగం పట్ల పన్నీర్‌సెల్వం సుముఖుత వ్యక్తం చేస్తుండగా, దీన్ని ఎడపాడి వర్గీయులు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, నత్తం శ్రీనివాసన్ పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరూ ఎడపాడికి రబ్బర్‌స్టాంప్‌లా మారుతారనే విమర్శ రావడంతో మాజీ మంత్రి విజయభాస్కర్ పేరును సూచించారు.
వైద్యలింగం మినహా మరెవరినీ అంగీకరించేది లేదని పన్నీర్‌సెల్వం భీష్మించుకుని కూర్చున్నారు. సీనియార్టీతోపాటు సామాజిక సమతుల్యం కూడా పాటించాలని కొందరు పేర్కొనడంతో కేపీ మునుస్వామి తదితరుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఎడపాడి, పన్నీర్‌సెల్వం ఏకాభిప్రాయానికి వస్తేగానీ ఉప నేత ఎంపిక వ్యవహారం కొలిక్కివచ్చే పరిస్థితి లేదు.
చదవండి: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ
Comments
Please login to add a commentAdd a comment