‘క్రాస్’ గుబులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలింగ్ సరళిపై సమీక్షిస్తూ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులంతా ఇపుడు ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో కొన్ని చోట్ల ఓ పార్టీ హవా సాగినా, మరి కొన్ని స్థానాల్లో మాత్రం ఏ పార్టీవైపు ఓటర్లు మొగ్గుచూపారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో క్రాస్ ఓటింగ్ జరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో 16న వెలువడనున్న ఫలితాలకోసం అభ్యర్థులం తా ఎదురుచూస్తున్నారు. ఎవరికివారు విజయం తమదంటే తమదంటూ పైకి బీరాలు పలుకుతున్నా, లోలోన మాత్రం ఏమైతదోనంటూ ఆందోళన చెందుతున్నారు. రూ. కోట్లకు కో ట్లు గుమ్మరించినా ఓటరు‘నాడి’ దొరకక పోవడం..తీర్పు వెలువడానికి ఇంకా 10 రోజులు సమయం ఉండడంతో నేతలకు నిద్రపట్టడం లేదు. ఈ టెన్షన్ తట్టుకోలేక కొందరు నాయకులు తీర్థ యాత్రలకు వెళ్లిపోగా, మరికొంత మం ది నాయకులు గ్రామాల్లోని తమ నాయకులకు రప్పిం చుకుని ఓట్లపై లెక్కలు వేస్తూ కాలం గడుపుతున్నారు.
రోటీన్‌కు భిన్నంగా....
రోటీన్‌కు భిన్నంగా ఓటర్లు స్పందించారు. సంప్రదాయక ఓటింగ్‌కు ‘స్వస్తి’ చెప్పారు. క్రాస్ ఓటింగ్‌కు తెరలేపారు. ఏ ఓటు ఎవరికి పడిందో సర్వేలకు కూడా అందని విధంగా ఓటర్లు తీర్పు చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మద్యం, డబ్బు సగటు ఓటరు ఇచ్చే ‘తీర్పు’ మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. రాజకీయ చైతన్యం ఉన్న మెదక్ జిల్లాలో ప్రతి పార్టీకి సంప్రదాయక ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతంలో ప్రజలు తమ కులానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో... రాజకీయ పార్టీకి అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఒక పార్టీకి చెందిన కార్యకర్త ఇంటికి మరో పార్టీ వాళ్లు వచ్చి ఓటు అడిగితే అవమానంగా భావించి, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన సందార్భాలు పల్లెల్లో అనేకం ఉన్నాయి. మరోవైపు నాయకులే ఓటరు ఇంటి గుమ్మం తొక్కి బతిమిలాడి డబ్బు చేతుల్లో పెట్టి తనకే ఓటు వేసే విధంగా ఒట్టు పెట్టించుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే తీరా పోలింగ్ రోజున మాత్రం సగటు ఓటరు ఒట్టు తీసి గట్టున పెట్టాడు, సంప్రదాయ ఓటింగ్ పద్ధతిని పక్కనబెట్టి తమకు నచ్చిన నేతకే ఓటు వేసుకున్నారు. దీంతో ఈ సారి ఎవరు ఓడిపోతారో.. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది.
‘క్రాస్’ భయం
జిల్లాలోని 10 అసెంబ్లీ , 2 పార్లమెంటు నియోజకవర్గాలుండగా అన్నిచోట్లా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు సమాచారం. అందువల్లే గెలుపుపై నమ్మకం పెట్టుకున్న నేతలు కూడా క్షేత్రస్థాయిలోని కార్యకర్తలను పిలిపించుకుని పోలింగ్ సరళిపై క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఓటరు నాడి అందకపోవడంతో అభ్యర్థులంతా టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు చెందిన నేతల్లో తీవ్రమైన ఉత్కంఠత నెలకొని ఉంది. ఈ ఐదు నియోజకవర్గాల్లో సగటు ‘ఓటరు నాడి’ నేతలకు దొరకడం లేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు ఎవరికి వారిగా లెక్కలు గడుతూ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెదక్ పార్లమెంటు విషయంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, ఓటర్లు ‘గేరు’ మార్చినట్లు సమాచారం. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వైపుకూడా ఓటర్లు మొగ్గు చూపినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.