ఔను.. పోలింగ్ తగ్గింది
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లా ఓటర్లలో చైతన్యం పెరిగింది. కానీ.. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో సగటు పోలింగ్ శాతం 83.99 కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో 82.74 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గతంకంటే ఈసారి 1.25 శాతం పోలింగ్ తగ్గింది. ఈసారి ఎన్నికలలో 5.04 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. పోలైన ఓట్లలో సంఖ్యాపరంగా చూస్తే పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నప్పటికీ, పురుషులు, మహిళల ఓట్ల శాతంతో పోలిస్తే ఎక్కువ మంది పురుషులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
జిల్లాలో మొత్తంగా 2,33,671 మంది పురుషులు పోలింగ్‌కు దూరంగా ఉండగా, 2,70,299 మంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకోలేదు. జిల్లాలోని 3,055 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 29,21,520 మంది ఓటర్లు ఉండగా, 24,17,337 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 14,40,403 మంది కాగా, 12,06,732 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 14,80,902 మంది కాగా, 12,10,603 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. 15 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో 80 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా గోపాలపురం నియోజకవర్గంలో 86.60 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 70.45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
1.25 శాతం తగ్గిన పోలింగ్ సగటు
జిల్లాలో 2009 ఎన్నిక ల కంటే ఈ విడత ఎన్నికల్లో సగటు పోలింగ్ 1.25 శాతం తగ్గింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 25,95,269 మంది ఓటర్లకు గాను 21,79,663 మంది ఓటేశారు. ఇందులో పురుషు ఓటర్లు 10,73,278 మంది కాగా, మహిళా ఓటర్లు 11,06,385 మంది ఉన్నారు. అప్పట్లో జిల్లా సగటు పోలింగ్ శాతం 83.99గా నమోదైంది. ఈ ఎన్నికల్లో 82.74 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
ఓట్లు పెరిగినా.. శాతం తగ్గింది
జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా మూడుసార్లు కొత్తగా ఓటర్ల చేరికకు అవకాశం కల్పిం చారు. ఆ రకంగా 81వేల మందికి పైగా ఓటర్లు పెరి గినప్పటికీ ఓటింగ్ శాతం పెరగకపోవడం అధికారులను అయోమయూనికి గురిచేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఏలూరు, భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 10 శాతం మేర పోలింగ్ తగ్గింది. అధికారులు ఓటర్లలో చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకురావటంలో విఫలమయ్యారు.
ఏలూరు ఎంపీ స్థానం పరిధిలో...
ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సగటున 83.62 శాతం పోలింగ్ నమోదైంది. 1,544 పోలింగ్ కేంద్రాల పరిధిలో 14,27,300 మంది ఓటర్లు ఉండగా, 11,93,449 ఓట్లు పోలయ్యాయి. పురుష ఓటర్లు 7,06,616 మంది కాగా, 6,00,426 మంది ఓటు వేశారు. 7,20,610 మంది మహిళా ఓటర్లు ఉండగా, వారిలో 5,93,018 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ వినియోగించుకున్న వారిలో ఇక్కడా పురుషులదే పైచేరుుగా నిలచింది.
0.47 శాతం తగ్గిన పోలింగ్
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 2009 ఎన్నికలతో పోలిస్తే.. తాజా ఎన్నికల్లో 0.47 శాతం పోలింగ్ తగ్గింది. అప్పట్లో 84.09 శాతం ఓట్లు పోలవ్వగా, ఇప్పుడు 83.62 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 1.50 లక్షల మంది ఓటర్లు పెరిగినా.. పోలింగ్ శాతం మాత్రం పెరగలేదు. 2009 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 12,75,165 మంది ఉండగా, 10,72,225 మంది ఓటేశారు.