సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతిపాలన నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన పోలీసు అధికారుల సంఘం విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతిపాలన పురస్కరించుకుని శాంతిభద్రతలపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న కేంద్ర బలగాలకు తోడు ముందు జాగ్రత్తలో భాగంగా మరికొన్ని అదనపు బలగాలను కేంద్రం నుంచి రప్పిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నాయని చెప్పారు. నగర పోలీసు కమిషనరేట్లు, ఇతర జిల్లాల్లో ముందస్తు చర్యగా పలు జాగ్రత్తలను తీసుకున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకే భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు జరిపామని, మరికొన్ని బదిలీలు జరుగుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తామని ఆయన తెలిపారు.