ఆర్టీసీ పాలిట ‘నష్ట’పరిహారం
సాక్షి, హైదరాబాద్: కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా ఆర్టీసీ నష్టాలకు అనేకానేక కారణాలు ఉన్నాయి. అప్పులు, పెరుగుతున్న డీజిల్ ధరలతో ముక్కుతూ మూలుగుతూ నెట్టుకొస్తోన్న ఆర్టీసీకి నష్టపరిహారం చెల్లింపులు అదనపు భారంగా మారాయి. ఏటా గరిష్టంగా రూ.35 కోట్ల వరకు వివిధ కేసుల్లో నష్టపరిహారంగా చెల్లిస్తోంది. ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం ఆర్టీసీలో ప్రయాణీకులకు బీమా లేకపోవడమే. టోల్‌ట్యాక్స్, సెస్, రవాణా చార్జీలు మినహా టికెట్లపై ఇతర చార్జీలు వసూలు చేయరు. బీమా కింద ప్రత్యేకంగా ఎలాంటి రుసుం వసూలు చేయరు. ఇదే ఇప్పుడు ఆర్టీసీకి భారంగా మారింది. ప్రమాదాలు జరిగినపుడు చెల్లించాల్సిన నష్టపరిహారం సొంత నిధులనుంచే వెచ్చించాల్సి రావడం అదనపు భారంగా మారింది. ప్రస్తుతం క్యాట్ కార్డు, వనితా కార్డులకు మినహా ఎక్కడా బీమా సదుపాయం కల్పించడం లేదు.
కొండగట్టు భారం రూ.1.8 కోట్లు
తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ‘కొండగట్టు’అతిపెద్ద దుర్ఘటన. ఏకంగా 62 మంది అసువులు బాయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ప్రమాదంపై ఆర్టీసీ వెంటనే స్పందించి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అంటే 62 మందికి రూ.1.8 కోట్లకుపైగా నష్టపరిహారం రూపంలో చెల్లించాలి. వీటిని సొంత నిధులనుంచే ఇవ్వాలి. ఈ విషయంలో బాధితుల కుటుంబసభ్యులు కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయిస్తే, ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు. కానీ, ప్రమాదం జరిగి నెలరోజులు గడుస్తున్నా.. బాధితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడంతో బాధిత కుటుంబాలు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.
రైల్వేలో బీమా ఎలా ఉందంటే..
రైల్వేలో బీమా సదుపాయంకోసం ప్రతి ఆన్లైన్ టికెట్‌పై 90పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్ ఫైనాన్స్‌లాంటి సంస్థలతో భారతీయ రైల్వే ఒప్పందం చేసుకుంది. ఆ లెక్కన బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. మరోవైపు ఈ బీమా కాకుండా రైల్వే నుంచి వచ్చే నష్టపరిహారం కూడా అందుతుంది.
వెంటనే పరిహారం చెల్లించాలి
కొండగట్టు ప్రమాదంలో బాధితులందరికీ పరిహారం చెల్లించాలి. సంస్థపై భారం తగ్గాలంటే ఆర్టీసీలో బీమా అమలు చేయాలి. ఈ పథకం వల్ల మృతుల కుటుంబాలకే కాదు, క్షతగాత్రులకూ మెరుగైన వైద్యం అందే వీలుంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసం ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలను నిలువరించడం సరికాదని నాగేశ్వరరావు (ఎన్ఎంయూ), హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ)లు అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో ఎందుకు విఫలమైంది..?
వాస్తవానికి ఆర్టీసీలోనూ ఇదే తరహా ప్రయత్నం జరిగింది. ఏటా తమపై పడుతున్న నష్టపరిహారం (దాదాపుగా రూ.35 కోట్లు) భారం తగ్గించడం, బాధితులకు మెరుగైన పరిహారాన్ని చెల్లించాలన్న తలంపుతో ఉన్నతస్థాయిలో చర్చలు జరిగాయి. తొలుత ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. ఇందుకోసం బజాజ్ అలయెన్స్, సుందరంఫైనాన్స్ లాంటి కంపెనీలు ఆర్టీసీతో ఒప్పందానికి ముందుకు వచ్చాయి. ప్రతిపాదన ప్రకారం ఈ ఒప్పందం అమలు కావాలంటే.. ప్రతి టికెట్‌పై ఎంతో కొంత చార్జీలు పెంచాలి, కానీ, చార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళనతో కొందరు ఈ ప్రతిపాదనను వాయిదా వేయించారని ఉన్నతాధికారులు వాపోతున్నారు.