‘తమిళనాడు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో తమిళనాడుకు అదనపు బలగాలు పంపించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందిస్తామని చెప్పారు. తమిళనాడు ఎన్నికోరితే అన్ని అదనపు కేంద్ర బలగాలను పంపిస్తామన్నారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా తమను కోరలేదని వెల్లడించారు. తమిళనాడులో సరిపడా కేంద్ర బలగాలు ఉన్నాయని తెలిపారు. తమిళనాడు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.
‘రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు కేంద్రం బంగాలను పంపిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కనీస కర్తవ్యం. సీఎం జయలలిత అనారోగ్యం నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అదనపు బలగాలు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామ’ని రిజిజు చెప్పారు.