వరంగల్ పోలీసులు భేష్
- మావోయిస్టుల అణచివేతలో అగ్రభాగం
- పోలీసుల సమష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతం
- డీజీపీ ప్రసాదరావు
- జిల్లా కేంద్రంలో పలు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపన
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్: పోలీసుల సమష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. మావోయిస్టుల అణచివేతలో వరంగల్ పోలీసులు ముందున్నారని అన్నారు. ఆయన బుధవారం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భీమారం గ్రామంలో నిర్మించిన పోలీసు కల్యాణ మండపాన్ని తన సతీమణి సౌమినితో కలిసి ప్రారంభించారు.
ఆ తర్వాత హన్మకొండ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించతలపెట్టిన సిబ్బంది విశ్రాంతి బ్యారక్‌కు శంకుస్థాపన చేశారు. జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో డిస్ట్రిక్ట్ గార్డ్స్ బ్రీఫింగ్ హాల్, పార్కింగ్ షెడ్, ధ్యాన మందిరం, ఎంటీ విభాగం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అర్బన్, రూరల్ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఇటీవల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతిభ చూపిన రూరల్ అధికారులకు క్యాష్ రివార్డులను అందజేయగా, అర్బన్ పరిధిలోని అధికారులకు ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిస్టులను అణచివేసి ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో వరంగల్ పోలీసులు ముఖ్య భూమిక పోషించారని అన్నారు.
మావోయిస్టులను ఎదుర్కోవడంలో జిల్లాకు చెందిన అధికారులు, సిబ్బంది తమ ప్రాణ త్యాగాలు చేశారని, అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల ప్రశాంత నిర్వాహణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఇందుకోసం శ్రమించిన హోంగార్డు స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకు అందరికీ అభినందనలు తెలిపారు.
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ విధులలో రాణించడంలో పోలీసు సిబ్బంది సతీమణుల పాత్ర కూడా కీలకమని అన్నారు. ఈ సమావేశంలో వరంగల్ రీజియన్ ఐజీ రవిగుప్తా, రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళిదాసు, ఎ.వెంకటేశ్వరరావు, అదనపు ఎస్పీలు యాదయ్య, కె.శ్రీకాంత్, డీఎస్పీలు జనార్దన్, దక్షిణమూర్తి, రాజిరెడ్డి, హిమవతి, సురేష్‌కుమార్, సీఐలు కిరణ్‌కుమార్, పృథ్వీధర్‌రావు, దేవేందర్‌రెడ్డిలతో పాటు ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కల్యాణ మండపాన్ని ప్రారంభించిన డీజీపీ దంపతులు
భీమారం : వరంగల్ నగర పరిధిలోని కేయూసీ పోలీస్‌స్టేషన్ సమీపంలో నిర్మించిన పోలీసుల కల్యాణ మండపాన్ని డీజీపీ ప్రసాదరావు దంపతులు బుధవారం ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ పోలీసుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పోలీసుల కుటుంబాల కోసం ఈ ఫంక్షన్ హాల్‌ను నిర్మించినట్లు తెలిపారు. సుమారు రూ.70 లక్షలతో ఈ కల్యాణ మండపం పనులు చేపట్టారు.