హైదరాబాద్ :రాష్ట్ర విభజనపై గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ మంత్రుల బృందాన్ని కలువనున్నారు. దీనికి సంబంధించి ఆయన రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరనున్నారు. అక్కడి మూడు రోజులపాటు గవర్నర్ బసచేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సంబంధిత విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కేంద్ర మంత్రుల బృందం కీలక అంశాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మంత్రుల బృందానికి అందుబాటులో ఉండేందుకు ఢిల్లీ పయనం కానున్నారు.
విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఒకపక్క ఆందోళనలు ఉవ్వెత్తున కొనసాగుతుండగా మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం శనివారం కీలక అంశాలపై దృష్టిసారించనున్నట్టు సమాచారం.