రాయల తెలంగాణపై ఆజాద్ వెనకడుగు!
న్యూఢిల్లీ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనలు వెల్లువెత్తటంతో పది జిల్లాల తెలంగాణ వైపే కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జీవోఎం సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణపై వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడే పది జిల్లాల తెలంగాణకే సిపార్సు చేయాలని ఆయన... కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి ప్రతిపాదించారు.
ప్రస్తుతం కోల్కతాలో ఉన్న ఆజాద్ ఈమేరకు ఫోన్లో షిండేతో మాట్లాడినట్లు తెలుస్తుంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రత్యామ్నాయంగానే చూడాలని ఆయన షిండేకి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా అంగీకరిస్తే రాయల తెలంగాణకు మొగ్గు చూపవచ్చని చెప్పినట్లు సమాచారం.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఏర్పాటుచేసిన మంత్రుల బృందం(జీవోఎం) ఎట్టకేలకు తన పని పూర్తి చేసింది. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా రూపొందించిన సిఫార్సులతో కూడిన నివేదికకు, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు, కేబినెట్ నోట్‌కు నిన్న జరిపిన చివరి భేటీలో జీవోఎం ముద్ర వేసింది.
ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడింటినీ టేబుల్ ఐటెమ్‌గా పెడతారని తెలియవచ్చింది. కేబినెట్ వాటిపై చర్చించి ఆమోదం తెలపడంతో పాటు ఆ వెంటనే, అంటే ఈరోజే రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి కూడా పంపుతుందని సమాచారం.