జగ్గంపేట, న్యూస్‌లైన్ :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై జీఓఎం నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, సమైక్యవాదులు భగ్గుమన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరు తూ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జగ్గంపేటలో 16వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధిం చారు. పెద్దసంఖ్యలో నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, సమైక్యవాదులు రాత్రి ఏడు గంటల నుంచి ఆందోళన చేపట్టారు. సోనియా గాంధీ, కాంగ్రెస్, మంత్రి తోట నరసింహంలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సీఐ సుంకర మురళీమోహన్, ఎస్సై సురేష్‌బాబు, ట్రైనీ ఎస్సై సురేష్ ఆందోళన విరమించాలని జ్యోతులకు నచ్చజెప్పబోయినా ఆయన ససేమిరా అన్నారు. గంటపాటు వేచి ఉన్న పోలీసులు చివరికి జ్యోతులను, పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ జీపులో ఎక్కించబోయారు. తిరస్కరించిన జ్యోతుల సర్వీసు రోడ్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడిచి వెళ్లగా కార్యకర్తలు, సమైక్యవాదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనను అనుసరించారు.
కేబినెట్ ఆమోదం దారుణం
ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా గతంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి జీఓఎం, కేంద్ర కేబినెట్‌లు ఆమోదం తెలపడం దారుణమన్నారు. విభజన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్న తమ అభిమతం కేంద్రానికి తాకేలా చేసేందుకే జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టామన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల మూడు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య పోరును సాగిస్తూ దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు విభజనకు సహకరించారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. జగన్ పిలుపునకు కట్టుబడి సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఉంటే తెలుగుజాతి విచ్ఛిన్నం జరిగేది కాదన్నారు. అక్కడోమాట, ఇక్కడో మాటా చెబుతున్న టీడీపీ కూడా రాష్ట్ర విభజన పాపం మూటకట్టుకుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి సమైక్యాంధ్ర ఉద్యమద్రోహిగా మిగిలిపోతారని, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడంలో ప్రధానపాత్ర పోషించిన ఆయన రోడ్డుపైకి వస్తే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆందోళనలో పార్టీ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్, మారిశెట్టి భద్రం, నీలాద్రిరాజు, జీను మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, వెలిశెట్టి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ, సోమవరం రాజు, సుంకర సీతారామయ్య, అడబాల వెంకటేశ్వరరావు, కుదప శ్రీనివాస్, మారిశెట్టి పుండరీకాక్షుడు, రాయి సాయి, కింగం రమణ, నాళం గోపి, బోరా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల సహా 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
నేటి బంద్‌కు సహకరించండి
రాష్ర్ట విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జరపతలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సమైక్యవాదులంతా చేయి కలిపి పోరుబాటలో కలిసి రావాలని కోరారు.
రాష్ర్ట చరిత్రలో దుర్దినం
రాష్ర్ట చరిత్రలో ఇదొక దుర్దినం. కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసింది. ఈ నిర్ణయానికి రాష్ర్ట ముఖ్యమంత్రితో పాటు మొత్తం కేబినెట్ బాధ్యత వహించాలి. రాజకీయ కుట్రలో భాగంగా ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు. తమ మనోభావాలకు విరుద్ధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సరైన రీతిలో స్పందిస్తారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంటులో తెలంగాణ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తారు. సమైక్యవాదులంతా చేయి కలిపి శుక్రవారం తలపెట్టిన రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేసి కేంద్రం కళ్లు తెరిపించాలి. కేంద్ర, రాష్ర్ట మంత్రులకు తగిన గుణపాఠం చెప్పాలి.
- పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే,
వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు
మెజార్టీ ప్రజల అభిమతానికి వ్యతిరేకం
రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్రిజేష్‌కుమార్ తీర్పు వల్ల కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారయ్యే ప్రమాదం ఉంది. మరో రాష్ట్రం ఏర్పడటంతో ఈ ప్రాంతంలో రైతులు పంటలు వదులుకునే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ తీర్మానం అవసరం లేదంటూ కేంద్రం సాంపద్రాయాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని మార్చుకోవాలి. గతంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన సాంప్రదాయాలను పాటించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం చేస్తున్న బంద్‌కు ప్రతివారూ సహకరించాలి.
- పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు
సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఫల్యమే..
సీమాంధ్ర కేంద్ర మంత్రులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం వరకూ వెళ్లింది. ఇది ముమ్మాటికీ వారి వైఫల్యమే. వారు ఎంతసేపూ ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టడానికే ప్రయత్నించారు తప్ప విభజనను అడ్డుకోలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయారు. సమైక్యాంధ్రను సమర్థిస్తున్నట్టు పదేపదే ప్రకటనలు చేసిన ఆయన ఆచరణలో తెలంగాణ బిల్లును అడ్డుకోలేకపోయారు. తెలంగాణ ప్రాంతపు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతల్లో ఉన్న చొరవ, ఐక్యత సీమాంధ్ర మంత్రులు, నాయకుల్లో లేవు.
- కుడుపూడి చిట్టబ్బాయి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్
ప్రజలే తగిన బుద్ధి చెపుతారు
రాష్ట్ర విభజనను ఆమోదించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రహీనమైపోయింది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీ 200 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయింది. కేంద్ర మంత్రులు గబ్బిలాల్లా పదవులను పట్టుకుని వేలాడడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. సోనియా ఆడించమన్నట్టు తలలాడించిన ఈ నేతలు తెలుగుతల్లికి ఏం సమాధానం చెబుతారు? జగన్‌మోహన్‌రెడ్డి వంటి సమర్థుడైన నేత అధికారంలో లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రజలకు ఈ దుర్దశ పట్టింది. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి విభజనకు కారకులైన టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు బుద్ధి చెబుతారు.
- జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు
ఆమోదంపై ఆగ్రహం
Published Fri, Dec 6 2013 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement